
పెషావర్: పాకిస్తాన్‌లో ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో సైన్యానికి, నిషేధిత తెహ్రీక్–ఇ–తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ) ఉగ్రవాదులకు మధ్య భీకరపోరు కొనసాగుతోంది. నాలుగు రోజులుగా జరుగుతున్న పోరాటంలో కనీసం 19 మంది సైనికులు, 45 మంది ఉగ్రవాదులు చనిపోయారని ఆర్మీ తెలిపింది. బజౌర్ జిల్లాలో ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సందర్భంగా చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో 22 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
దక్షిణ వజీరిస్తాన్‌లో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో 13 మంది టెర్రరిస్టులు మృతి చెందారు. ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో 12 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. గురువారం లాల్ ఖిల్లా మైదాన్ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు సైనికులు, 10 మంది ఉగ్రవాదులు మృతి చెందారు. ఎన్‌కౌంటర్‌ల అనంతరం ఆయా ప్రాంతాల్లో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.