
ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల కోసం రష్యా వెళ్లిన భారతీయులు.. బలవంతంగా సైన్యంలో చేరి ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అలా హైదరాబాద్(తెలంగాణ)కు చెందిన ఓ వ్యక్తి చిక్కుకుపోగా.. అతన్ని రక్షించాలంటూ భాదిత కుటుంబం కేంద్రాన్ని ఆశ్రయించింది. దీంతో కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ అహ్మద్(37) ఈ ఏడాది ఏప్రిల్‌లో రష్యాకు వెళ్లాడు. ఓ నిర్మాణ సంస్థలో భాగంగా పని ఉందంటూ ఏజెంట్ నమ్మబలికి అతన్ని అక్కడికి పంపించాడు. అయితే నెలపాటు అహ్మద్ ఏపని లేకుండా ఖాళీగా ఉన్నాడు. అడిగితే.. రేపో మాపో పని చెబుతామంటూ నిర్వాహకులు చెప్పసాగారు. ఈలోపు..
అహ్మద్‌లా ఇతర దేశాల నుంచి వచ్చిన మొత్తం 30 మందిని జమ చేసి ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతానికి తరలించారు. అక్కడ బలవంతంగా వాళ్లకు ఆయుధ శిక్షణ ఇప్పించి.. యుద్ధంలోకి దింపారు. వాహనంలో తరలిస్తున్న క్రమంలో ఇదే అదనుగా అహ్మద్ దూకి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో అతని కాలికి గాయం కావడంతో రష్యా సైన్యానికి చిక్కాడు.
యుద్ధం చేయాల్సిందేనని, లేకుంటే తామే చంపేసి డ్రోన్ దాడుల్లో చనిపోయినట్లు చిత్రీకరిస్తామని బెదిరించారు. దీంతో గత్యంతరం లేక రష్యా తరఫున ఉక్రెయిన్ యుద్ధంలో అహ్మద్ పాల్గొంటున్నాడు. అయితే తన దగ్గర ఉన్న ఫోన్‌తో జరిగిందంతా ఓ సెల్ఫీ వీడియోగా తీసి భార్య అఫ్షా బేగంకు పంపాడు. అందులో.. తాను ఎదుర్కొన్న పరిస్థితులన్నీ వివరించాడు.
Russia mein phanse Hyderabad ke Mohammad Ahmad aur Haryana wa Rajasthan ke Anoop Kumar, Manoj Kumar aur Sumit Kumar ko jald se jald Bharat wapas laane ke liye AIMIM Party ki musalsal koshish. pic.twitter.com/U2dg1OJuez
— Asaduddin Owaisi (@asadowaisi) October 22, 2025
నాతో పాటు ఉన్న 26 మంది మేం యుద్ధంలో పాల్గొనమని చెప్పాం. అందులో నలుగురు భారతీయులు ఉన్నారు. వాళ్లు నా మెడపై తుపాకీ పెట్టి.. యుద్ధం చేస్తావా? చస్తావా? అని బెదిరించారు. నా కాలికి గాయమైనా కనికరించకుండా హింసించారు. ఇప్పటికే 17 మంది మరణించారు. అందులో ఓ భారతీయుడు కూడా ఉన్నాడు. ఉద్యోగాల పేరిట బలవంతంగా ఈ నరకంలోకి మమ్మల్ని లాగారు. ఎట్టిపరిస్థితుల్లో మమ్మల్ని ఇక్కడకు పంపిన ఏజెంట్‌ను(ముంబైకి చెందిన కన్సల్టెన్సీ) వదలొద్దు అని అహ్మద్ ఆ వీడియోలో చెప్పాడు.
ఈ వీడియో ఆధారంగా అహ్మద్ భార్య అఫ్షా బేగం కేంద్ర విదేశాంగ శాఖకు ఓ లేఖ రాసింది. తన భర్త తమ కుటుంబానికి ఆధారమని, ఆయన్ని రక్షించాలని విదేశాంగ మంత్రి జై శంకర్‌ను ఉద్దేశిస్తూ వేడుకుంది. మరోవైపు.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని సైతం కలిసి సాయం చేయాలని కోరింది. దీంతో.. ఆయన అహ్మద్‌ను వెనక్కి రప్పించాలంటూ కేంద్రానికి, రష్యాలోని భారత రాయబార కార్యాలయానికి విజ్ఞప్తి చేశారు.
అహ్మద్ భార్య, హైదరాబాద్ ఎంపీ ఒవైసీ విజ్ఞప్తులతో కేంద్రం కదిలింది. అహ్మద్ గురించి వివరాలు సేకరించి విడిపించే ప్రయత్నం చేస్తామని మాస్కోలోని భారత రాయబార సిబ్బంది తడు మాము(Tadu Mamu) హామీ ఇచ్చారు. భారత విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం.. రష్యా ఆర్మీలో 27 మంది భారతీయులు చిక్కుకుపోయారని, వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నామని, వాళ్ల కుటుంబాలతో నిరంతరంగా సంప్రదింపులు జరుపుతున్నామని చెబుతోంది.