దావోస్: గాజా శాంతి మండలిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆవిష్కరించారు. దావోస్ వేదికగా ‘‘బోర్డ్ ఆఫ్ పీస్’ సంతకాలు జరిగాయి. అయితే, గాజా ’బోర్డ్ ఆఫ్ పీస్‌కు కార్యక్రమానికి భారత్ దూరంగా ఉంది. అయితే, గాజా శాంతిమండలిలో పాకిస్తాన్ సభ్య దేశంగా చేరింది. గాజా పునర్నిర్మాణం, శాంతి కోసమే బోర్డ్ ఆఫ్ పీస్ అంటూ చెబుతున్న ట్రంప్.. ఆయుధాలు వీడకపోతే బూడిద చేస్తామంటూ హమాస్‌ను ఈ సందర్భంగా మరోసారి హెచ్చరించారు.
అంతర్జాతీయ విభేదాలను పరిష్కరించడానికి సహాయపడుతుందని, ప్రతి ఒక్కరూ ఇందులో భాగం కావాలని కోరుకుంటున్నారని ట్రంప్ అన్నారు. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి పని చేస్తామని కూడా ట్రంప్ స్పష్టం చేశారు. కాగా, శాంతి మండలిలో చేరాలని 50 మందికిపైగా ట్రంప్ దేశాధినేతలకు ఆహ్వానాలు పంపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహా పలు దేశాల అధినేతలకు ఆహ్వానాలు అందాయి.
మధ్యప్రాచ్యంలో శాంతిని సుస్థిరం చేయడానికి, ప్రపంచ సంఘర్షణల పరిష్కారానికి కొత్త మార్గాన్ని అన్వేషించడానికి ఉద్దేశించిన ఈ బోర్డులో చేరాలని ప్రధాని నరేంద్ర మోదీకి ట్రంప్ లేఖ రాశారు. ఈ బోర్డులో చేరిన దేశాల్లో ప్రస్తుతం పాకిస్థాన్‌తో పాటు బహ్రెయిన్, మొరాకో, అర్జెంటీనా, అర్మేనియా, అజర్బైజాన్, బల్గేరియా, హంగేరి, ఇండోనేషియా, జోర్డాన్, కజకిస్థాన్, కొసోవో, పరాగ్వే, ఖతార్, సౌదీ అరేబియా, టర్కీ, యూఏఈ, ఉజ్బెకిస్థాన్, మంగోలియా ఉన్నాయి.
గాజా శాంతి మండలిలో చేరాలంటూ ట్రంప్ ఆహ్వానంపై భారత్ ఇప్పటివరకు స్పందించలేదు. ఈ మండలిలో పాకిస్థాన్ చేరికను ఇజ్రాయెల్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పాక్ గడ్డపై పని చేస్తున్న లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలకు, హమాస్‌కు మధ్య సంబంధాలు పెరుగుతున్నాయని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, ఐక్యరాజ్యసమితి స్థానంలో ట్రంప్ ఈ గాజా శాంతి మండలిని తీసుకువస్తున్నారనే చర్చ కూడా సాగుతోంది.
ఈ బోర్డుకు ట్రంప్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ మండలిలో ఉప విభాగాలు ఏర్పాటు, రద్దు చేసే సర్వాధికారాలు ఆయనకే ఉంటాయిట్. ట్రంప్ ఎంపిక చేసే ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు రెండేళ్ల పదవీకాలం కలిగి ఉంటారు. వైట్ హౌస్ (అధ్యక్ష పదవి) నుండి వైదొలిగినా, ట్రంప్ స్వచ్ఛందంగా రాజీనామా చేసే వరకు ఆయనే ఛైర్మన్‌గా కొనసాగేలా నిబంధనలు రూపొందించారు.


