
వాషింగ్టన్: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై అమెరికా అదనపు సుంకాలు విధించిన దరిమిలా ఇరుదేశాల సంబంధాలు బీటలు వారాయి. అయితే యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరు దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించుకునేందుకు అమెరికా- భారత్‌లు తిరిగి చర్చలు ప్రారంభిస్తాయన్నారు.
తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ఒక పోస్ట్‌లో ‘భారత్- యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలు వాణిజ్య అడ్డంకులను తొలగించుకునేందుకు చర్చలు కొనసాగిస్తున్నాయని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. రాబోయే రోజుల్లో నా స్నేహితుడు, ప్రధాని మోదీతో మాట్లాడేందుకు నేను ఎదురుచూస్తున్నాను. ఇరు దేశాల మధ్య జరిగే వాణిజ్య చర్చలకు విజయవంతమైన ముగింపు వచ్చేందుకు ఎటువంటి ఇబ్బంది ఉండదని ఖచ్చితంగా అనుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.
రష్యా చమురు కొనుగోళ్లపై అదనంగా 25 శాతం జరిమానాతో పాటు భారతీయ వస్తువులపై అమెరికా 50 శాతం సుంకాన్ని విధించిన కొన్ని వారాల దరిమిలా ఈ ప్రకటన రావడం గమనార్హం. దీనికిముందు అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్‌లో ఒక ప్రకటన చేస్తూ, భారత్-అమెరికా సంబంధాలను చాలా ప్రత్యేకమైనవిగా పేర్కొన్నారు. తాను, ప్రధాని మోదీ ఎప్పటికీ స్నేహితులుగా ఉంటామని ధృవీకరించారు. ఆందోళన చెందేందుకు ఏమీ లేదని స్పష్టం చేశారు. అయితే ప్రదాని మోదీ తీరుపై అసంతృప్తి ఉందని కూడా కామెంట్ చేశారు.
ప్రస్తుత సమయంలో భారతదేశంతో సంబంధాలను పునరుద్ధరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?" అని ఏఎన్‌ఐఐ అడిగినప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ‘నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. నేను మోదీకి ఎప్పటికీ స్నేహితుడినే. ఆయన గొప్ప ప్రధానమంత్రి. అయితే ఈ నిర్దిష్ట సమయంలో ఆయన చేస్తున్నది నాకు నచ్చడం లేదు. కానీ భారత్- అమెరికా మధ్య చాలా ప్రత్యేకమైన సంబంధం ఉందన్నారు.