
వాషింగ్టన్:అమెరికాలోని ప్రసిద్ధ ఐజెన్‌హవర్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీ డైరెక్టర్ జాన్ హెన్రీను ట్రంప్ ప్రభుత్వం హఠాత్తుగా పదవి నుంచి తొలగించింది. ఈ నిర్ణయానికి కారణం..బ్రిటన్ రాజు చార్లెస్‌కు ఓ విలువైన చారిత్రక కత్తిని బహుమతిగా ఇవ్వాలన్న ట్రంప్ ఆదేశాలను ఆయన తిరస్కరించడం. ఈ ఘటన అమెరికా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
1945 నాటి రెండవ ప్రపంచ యుద్ధానికి చెందిన ఆ కత్తిని జాతీయ వారసత్వంగా భావించాల్సినదిగా జాన్ హెన్రీ అభిప్రాయపడ్డారు. ‘ఇది ప్రజల ఆస్తి. చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన వస్తువు. దీన్ని బహుమతిగా ఇవ్వడం సరైనది కాదు’అంటూ ఆయన ట్రంప్ విజ్ఞప్తిని తిరస్కరించారు.
అయితే, ట్రంప్ పరిపాలనలో ఉన్న ఉన్నతాధికారులు ఈ కత్తిని అమెరికా-బ్రిటన్ మధ్య స్నేహ బంధానికి ప్రతీకగా ఇవ్వాల్సిన బహుమతిగా పేర్కొన్నారు. కత్తి ఇవ్వండి, లేదంటే ఉద్యోగం నుంచి తొలగిస్తామని జాన్ హెన్రీకి హెచ్చరికలు జారీ చేశారు. ఉన్నతాదికారులు ఒత్తిడి చేస్తున్నప్పటికీ.. మ్యూజియంలో ఉన్న కత్తిని ట్రంప్‌కు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ట్రంప్ ఆదేశాల మేరకు ఆయన్ను పదవి నుంచి తొలగించారు.
ఈ చర్యపై చరిత్రకారులు, మ్యూజియం నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చారిత్రక సంపదను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదు. ఇది ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే చర్యగా అభివర్ణిస్తున్నారు. ఈ వివాదంపై ఇప్పటివరకు ట్రంప్ లేదా బ్రిటన్ రాజు చార్లెస్ స్పందించలేదు.