వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ కార్యక్రమంలో కాల్పులు జరిపిన నిందితుడు కోల్ టొమాస్ ఎలెన్‌పై నేరాభియోగం నమోదు అయ్యింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపాలని ప్రయత్నించాడని దర్యాప్తు సంస్థలు తేల్చేశాయి. దీంతోపాటు మరో రెండు నేరాలను కూడా అతనిపై మోపారు. ఈ తీవ్ర నేరాల కింద ఫెడరల్ కోర్టులో ఎలెన్ విచారణను ఎదుర్కొబోతున్నాడు.
‘‘ఇది స్పష్టంగా అధ్యక్షుడిని హత్య చేయడానికి చేసిన ప్రయత్నం. నిందితుడు తన ఉద్దేశాన్ని కుటుంబానికి పంపిన మేనిఫెస్టోలో(మెసేజ్‌లో) స్పష్టంగా పేర్కొన్నాడు. అధ్యక్షుడిని కసితీరా చంపాలన్నదే అతని ఉద్దేశం. అయితే సీక్రెట్ సర్వీస్ తక్షణ చర్య తీసుకోవడంతో ఆయన సురక్షితంగా ఉండగలిగారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది’’ అని ప్రభుత్వం తరఫున అటార్నీలు వాషింగ్టన్ డీసీ ఫెడరల్ కోర్టులో వాదనలు వినిపించారు.
సోమవారం ఈ కేసు విచారణ జరిగింది. ఎలెన్ తరఫున వాదించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో.. ఇద్దరు ఇద్దరు పబ్లిక్ డిఫెండర్లు (ప్రభుత్వ న్యాయవాదులు) నియమించారు. ఎలెన్‌కు గతంలో ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదని.. కాబట్టి నేరం రుజువయ్యేంతదాకా అతన్ని నిర్దోషిగా పరిగణించాలని న్యాయవాది టెజిరా అబే వాదించారు. ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 30న జరగనుంది. జైలా? బెయిలా? అనేది ఆరోజే డిసైడ్ కానుంది.
ఇదిలా ఉంటే.. గతంలో ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఉండగా హత్యాయత్నం జరిగింది. 2024లో జరిగిన పెన్సిల్వేనియా ఘటనలో నిందితుడు థామస్ క్రూక్స్.. ట్రంప్‌పై కాల్పులు జరిపిన తర్వాత సీక్రెట్ సర్వీస్ స్నైపర్ల చేతిలో చనిపోయాడు. అయితే ప్రస్తుతం ట్రంప్ అధ్యక్షుడి హోదాలో ఉన్నారు. ఒకవేళ హత్యాయత్నం నేరం గనుక రుజువైతే కోల్ టొమాస్ ఎలెన్(31)కు జీవిత ఖైదు పడనుంది. ట్రంప్‌పై హత్యాయత్నంతో పాటు అనుమతి లేకుండా ఆయుధాన్ని కలిగి ఉండటం(illegal possession of a firearm), ఆ ఆయుధాన్ని ఉపయోగించి దాడి చేయాలని చూడడం.. ఈ రెండు నేరాలను కూడా నమోదు చేశారు. ఈ నేరాలకుగానూ ఒకదానికి భారీ జరిమానా, మరోదానికి 10 జైలు శిక్ష పడతాయి.
శనివారం రాత్రి వాషింగ్టన్‌లోని హిల్టన్ హోటల్‌లో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ఇతర ఉన్నతాధికారులు సహా పలువురు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. కాసేపట్లో ట్రంప్ మాట్లాడాల్సి ఉండగా.. అదే హోటల్‌లో బస చేసిన ఎలెన్ భద్రతా వలయాన్ని దాటుకుని మరీ వచ్చి కాల్పులకు తెగబడ్డాడు. అయితే మీటింగ్ జరుగుతున్న రూమ్ వైపు అతన్ని వెళ్లకుండా భద్రతా సిబ్బంది అదుపు చేయగలిగారు. అక్కడికక్కడే అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.
మేనిఫెస్టోలో ఏముందసలు..
కోల్ టొమాస్ ఎలెన్ బాగా చదువుకున్న వ్యక్తి. కాలిఫోర్నియాలో టీచర్‌గానూ పని చేస్తున్నాడు. అయితే దాడి యత్నానికి ముందు తన కుటుంబ సభ్యులకు రాసిన లేఖలో ట్రంప్‌పై అతడు పలు ఆరోపణలు చేశాడు. ‘ఒక పీడోఫైల్, రేపిస్ట్, దేశద్రోహిని అంగీకరించేది లేదు’ అని పేర్కొన్నాడు. అయితే ఆ ఆరోపణలన్నీ ట్రంప్ పేరు ప్రస్తావన లేకుండా పరోక్షంగానే ఉన్నాయి. ప్రభుత్వ ఉన్నత వర్గాలే తన టార్గెట్ అని అందులో పేర్కొన్నాడతను. అమెరికాలో అరాచక పాలనను భరించలేకనే దాడికి దిగుతున్నానని.. సాధ్యమైనంత వరకు ఇతరులను చంపే ప్రయత్నం చేయబోనని.. గత్యంతరం లేని పరిస్థితిలో అలా చేయాల్సి వస్తే తనను క్షమించాలని ఆ లేఖలో పేర్కొన్నాడు. అంతేకాదు హిల్టన్ హోటల్ భద్రత ఘోరంగా ఉందని.. తాను పెద్ద తుపాకీతో వచ్చినా ఎవరూ గుర్తించేవారు కాదేమో అంటూ సెటైర్ వేశాడు.
ట్రంప్ రియాక్షన్..
తనపై కోల్ టొమాస్ ఎలెన్ చేసిన ఆరోపణలను ట్రంప్ తోసిపుచ్చారు. సీబీఎస్ 60 మినిట్స్ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. అతడు తీవ్రవాద భావజాలం ఉన్న వ్యక్తి, ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని చెప్పారు. పైగా అతనో క్రైస్తవ వ్యతిరేకి అని ట్రంప్ ఆరోపించారు. కొందరు అనుకుంటున్నట్లు కాల్పులు జరిగిన సమయంలో తానేం భయపడలేదని.. ఏం జరుగుతుందో చూడాలనిపించిందని.. కానీ, సీక్రెట్ సర్వీస్ అధికారులు తనను బయటకు తీసుకెళ్లారని ట్రంప్ చెప్పుకొచ్చారు.


