వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై నెలకొన్న సందేహాలకు వైట్ హౌస్ తెరదించింది. త్వరలో 80వ వసంతంలోకి అడుగుపెట్టనున్న ట్రంప్.. తన విధులను నిర్వహించేందుకు పూర్తిస్థాయి ఆరోగ్యంతో ఉన్నారని తాజాగా విడుదలైన వైద్య నివేదిక వెల్లడించింది. అయితే దీర్ఘకాలం పాటు ఆయన ఉత్సాహంగా ఉండాలంటే బరువు తగ్గడంతో పాటు వ్యాయామంపై దృష్టి సారించాలని వైద్యులు సూచించారు.
పూర్తిగా ఫిట్.. కానీ జాగ్రత్తలు అవసరం
వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్‌లో ట్రంప్‌నకు వైద్య పరీక్షలు జరిగిన అనంతరం, వైట్ హౌస్ ఫిజీషియన్ డాక్టర్ సీన్ బార్బబెల్లా అధికారిక నివేదక విడుదల చేశారు. ట్రంప్ తన కమాండర్ ఇన్ చీఫ్ విధులను నిర్వహించడానికి ఎటువంటి శారీరక ఇబ్బందులు లేవని నివేదిక తెలిపింది. ఆయన బరువు 238 పౌండ్లు ఉండగా, గుండె కొట్టుకునే వేగం నిమిషానికి 73 సార్లుగా నమోదైంది. వైద్యపరంగా అన్ని అవయవాల పనితీరు సాధారణ స్థితిలోనే ఉన్నదని, క్యాన్సర్ స్క్రీనింగ్‌తో పాటు గుండె సంబంధిత పరీక్షలన్నీ సజావుగా సాగాయని అధికారులు తెలిపారు.
మేధో శక్తికి పక్కా స్కోరు
వయసు రీత్యా ట్రంప్ మేధస్సుపై వస్తున్న విమర్శలకు ఈ నివేదిక గట్టి సమాధానం ఇచ్చింది. పూర్తిస్థాయి నాడీ సంబంధిత పరీక్షలు నిర్వహించగా, ట్రంప్ 30కి 30 మార్కులు సాధించి, తన మానసిక పదునును నిరూపించుకున్నారు. గతంలో పలుమార్లు ఆయన సభల్లో కళ్లు మూసుకోవడంపై వచ్చిన విమర్శలను ట్రంప్ కొట్టిపారేశారు. అలసట వల్ల కాకుండా, కేవలం విశ్రాంతి కోసమే అలా చేస్తానని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. ఏది ఏమైనప్పటికీ, ప్రస్తుత ఆరోగ్య స్థితిని కాపాడుకునేందుకు ఆయనకు వ్యక్తిగత ఆహార నియమాలు, వ్యాయామాలపై ప్రత్యేక సూచనలు చేశారు.
నిరంతర పర్యవేక్షణలో ఆరోగ్యం
నివేదికలో పేర్కొన్నట్లుగా, ట్రంప్ చేతులపై ఉన్న స్వల్ప రంగు మార్పులు తరచుగా షేక్‌హ్యాండ్స్ ఇవ్వడం, గుండె ఆరోగ్యం కోసం తీసుకునే ఆస్ప్రిన్ మందుల ప్రభావమేనని వైద్యులు వివరించారు. ఈ చిన్నపాటి సమస్యలు మినహా, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని వెల్లడించారు. గతంలో ఆరోగ్యంపై వచ్చిన వదంతులను పక్కనపెట్టి, ఇప్పుడు సూచించిన జీవనశైలి మార్పులను ట్రంప్ పాటించాలని డాక్టర్లు కోరారు.


