ఇరాన్‌కు ట్రంప్‌ ‘ఏఐ వార్నింగ్‌’.. | Trump AI War Warning Bing Bing Gone Posts AI Images Targeting Iran | Sakshi
Sakshi News home page

ఇరాన్‌కు ట్రంప్‌ ‘ఏఐ వార్నింగ్‌’..

May 12 2026 11:23 PM | Updated on May 12 2026 11:24 PM

Trump AI War Warning Bing Bing Gone Posts AI Images Targeting Iran

వాషింగ్టన్‌: మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి యుద్ధ మేఘాలను కమ్ముకొనేలా చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఇరాన్‌ను ఉద్దేశిస్తూ పోస్ట్ చేసిన ఏఐ (కృత్రిమ మేధ) చిత్రాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఇరాన్ యుద్ధ విమానాలపై అమెరికా దళాలు విరుచుకుపడుతున్నట్లు ఉన్న ఈ కాల్పనిక చిత్రాలు మళ్లీ యుద్ధం తప్పదా? అన్న సంకేతాలను పంపుతున్నాయి.

‘బింగ్‌.. బింగ్‌.. గాన్‌!’

ట్రంప్ షేర్ చేసిన ఒక చిత్రంలో.. అమెరికా యుద్ధనౌక హై-పవర్ లేజర్ ఆయుధంతో ఇరాన్ జెండా ఉన్న విమానాన్ని గాలిలోనే పేల్చివేస్తున్నట్లు ఉంది. దీనికి "లేజర్స్: బింగ్, బింగ్, గాన్!!" అనే శీర్షికను ఆయన జోడించారు. మరో చిత్రంలో ఇరాన్‌కు చెందిన 'ఫాస్ట్ బోట్ల' సమూహంపై అమెరికా డ్రోన్లు బాంబుల వర్షం కురిపిస్తున్నట్లు చిత్రీకరించారు. దీనికి "బై బై, ఫాస్ట్ బోట్స్" అని క్యాప్షన్ ఇచ్చారు.

‘లైఫ్ సపోర్ట్’పై కాల్పుల విరమణ!

గల్ఫ్ రీజియన్‌లో గత నెల రోజులుగా కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం ఇక ఎంతో కాలం నిలవదని ట్రంప్ పరోక్షంగా హెచ్చరించారు. చర్చల పునరుద్ధరణ కోసం ఇరాన్ పంపిన తాజా ప్రతిపాదనలను ఆయన పూర్తిగా తిరస్కరించారు. "ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం ‘లైఫ్ సపోర్ట్’ మీద ఉంది. తన ప్రియమైన వారు బతికే అవకాశం కేవలం ఒక శాతమే ఉందని డాక్టర్ చెప్పే పరిస్థితిలో ఆ ఒప్పందం ఉంది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

యుద్ధానికే మొగ్గు?

హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మాటిమాటికీ మూసివేయడం, చర్చల పట్ల టెహ్రాన్ మొండి వైఖరితో ట్రంప్ అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై అమెరికా 'పూర్తి విజయం' సాధిస్తుందని ఆయన నొక్కి చెప్పారు. ఇరాన్‌పై తిరిగి యుద్ధాన్ని ప్రారంభించే అంశాన్ని ట్రంప్ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్ (CNN) కథనాలు పేర్కొంటున్నాయి. అమెరికా శాంతి ప్రతిపాదనలను ఇరాన్ తోసిపుచ్చిన మరుసటి రోజే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement