కమాండ్‌ నుంచి ఇండో తొలగింపు | Trump Administration Renames US Indo-Pacific Command to Pacific Command | Sakshi
Sakshi News home page

కమాండ్‌ నుంచి ఇండో తొలగింపు

Jun 18 2026 4:24 AM | Updated on Jun 18 2026 4:24 AM

Trump Administration Renames US Indo-Pacific Command to Pacific Command

యూఎస్‌ ఇండో–పసిఫిక్‌ కమాండ్‌ పేరు మార్చిన అమెరికా  

ఇకపై యూఎస్‌ పసిఫిక్‌ కమాండ్‌గానే..  

బాధ్యతల్లో ఎలాంటి మార్పు రాలేదన్న రక్షణ శాఖ  

మోదీ, డొనాల్డ్‌ ట్రంప్‌ భేటీకి ముందు అనూహ్య నిర్ణయం  
 

వాషింగ్టన్‌:  అమెరికా ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. యూఎస్‌ ఇండో–పసిఫిక్‌ కమాండ్‌ పేరును యూఎస్‌ పసిఫిక్‌ కమాండ్‌గా మార్చేసింది. ఈ నిర్ణయాన్ని అమెరికా రక్షణ శాఖ మంగళవారం ప్రకటించింది. 1947లో అప్పటి అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్‌ స్థాపించిన ఈ కమాండ్‌కు సంబంధించిన లోతైన చారిత్రక మూలాలను గౌరవించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అమెరికా పసిఫిక్‌ కమాండ్‌ పరిధి అమెరికా పశ్చిమ తీరం నుంచి భారతదేశ పశ్చిమ సరిహద్దు వరకు విస్తరించి ఉంది. ‘‘వాస్తవానికి 1947 జనవరి 1న అధ్యక్షుడు హ్యారీ ఎస్‌.ట్రూమన్‌ ఈ కమాండ్‌ను స్థాపించారు.

70 ఏళ్లకు పైగా యూఎస్‌ పసిఫిక్‌ కమాండ్‌ పేరుతో పనిచేసింది. యునైటెడ్‌ స్టేట్స్‌ ఏకీకృత పోరాట కమాండ్లలో పురాతనమైనదిగా, అతిపెద్దదిగా ఘనత సాధించింది’’అని రక్షణ శాఖ ఒకప్రకటనలో వెల్లడించింది. పేరు మారినప్పటికీ ఈ కమాండ్‌ బాధ్యతల్లో ఎలాంటి మార్పు రాలేదని పేర్కొంది. కమాండ్‌ ప్రాథమిక లక్ష్యంలో, ప్రాంతీయ మిత్రదేశాలు, భాగస్వాములతో కలిసి స్వేచ్ఛాయుత పరిస్థితులను కొనసాగించాలన్న నిబద్ధతలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. ‘‘యూఎస్‌ పసిఫిక్‌ కమాండ్‌ తిరిగి వచి్చంది’’అంటూ అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు.  

బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ వరకు..  
యూఎస్‌ పసిఫిక్‌ కమాండ్‌ పేరును 2018లో యూఎస్‌ ఇండో–ఫసిఫిక్‌ కమాండ్‌గా మార్చారు. అప్పట్లో డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు. హిందూ మహాసముద్రం, పసిఫిక్‌ మహాసముద్రాల మధ్య పెరుగుతున్న అనుసంధానతను గుర్తించి, ఈ కమాండ్‌ పేరును ఇండో–పసిఫిక్‌ కమాండ్‌గా మార్చినట్లు 2018లో అప్పటి రక్షణ శాఖ కార్యదర్శి జేమ్స్‌ మాటిస్‌ వెల్లడించారు.

ఈ కమాండ్‌ పరిధి బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ వరకు, పెంగి్వన్ల నుంచి ధ్రువపు ఎలుగుబంట్ల వరకు విస్తరించి ఉందని చమత్కరించారు. అమెరికా జాతీయ రక్షణ వ్యూహంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అయితే, ఎనిమిదేళ్ల తర్వాత పాత పేరును పునరుద్ధరించడం గమనార్హం. ఫ్రాన్స్‌లో జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ట్రంప్‌ సమావేశం అవుతున్న సమయంలోనే కమాండ్‌ నుంచి ఇండియా పేరును హఠాత్తుగా తొలగించడం చర్చనీయాంశంగా మారింది.  

చైనా ఆధిపత్యాన్ని అంగీకరిస్తున్న ట్రంప్‌?  
ఇండో–యూఎస్‌ పసిఫిక్‌ కమాండ్‌ పేరు మార్పు వెనుక అమెరికా వ్యూహం ఏమిటన్నదానిపై చర్చ మొదలైంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా దూకుడును అడ్డుకోవాలన్న తమ ప్రణాళికలను అమెరికా విరమించుకుంటోందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చైనా విషయంలో అమెరికా వైఖరిలో ఇటీవల మార్పు వస్తోంది. బలమైన చైనా బారి నుంచి తైవాన్‌ను రక్షించలేమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చెప్పారు. దాదాపుగా ఆయన చేతులెత్తేశారు. చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవడమే ధ్యేయంగా ఏర్పాటు చేసిన ‘క్వాడ్‌’కూటమిని కూడా ఆయన నిర్లక్ష్యం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇండో–యూఎస్‌ పసిఫిక్‌ కమాండ్‌ పేరును మార్చేసినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్‌ విషయానికొస్తే ఈ పరిణామం పేరు మార్పునకు సంబంధించిన విషయం కంటే కూడా మారుతున్న అమెరికా ప్రాధాన్యతల గురించి తెలియజేసే అంశంగా భావించాల్సి ఉంటుంది. అమెరికా జాతీయ రక్షణ వ్యూహాన్ని ఈ ఏడాది జనవరి 23న బహిర్గతం చేశారు. ‘‘ఉమ్మడి రక్షణ భారాన్ని మిత్రదేశాలు కూడా పంచుకోవాలి. భాగస్వామ్య దేశాల భద్రతకు దశాబ్దాలుగా మోస్తున్న ఆర్థిక భారాన్ని ఇకపై మోయలేం’’అని ఇందులో స్పష్టం చేశారు.

ఈ పరిణామాలను గమనిస్తే అమెరికా దృష్టిలో ఇండియాలో స్థానంపై సహజంగానే ప్రశ్నలు తలెత్తుతున్నాయని అంటున్నారు. చైనాతో సంబంధాలను బలోపేతం చేసుకోవడంతోపాటు ఈ ప్రాంతంలో పాకిస్తాన్‌కు మరింత ప్రాధాన్యం ఇవ్వాలన్నదే ట్రంప్‌ వ్యూహంగా అంచనా వేస్తున్నారు. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని ట్రంప్‌ పరోక్షంగా ఆమోదిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. పేరు మార్పుపై కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ కూడా స్పందించారు. ‘‘క్వాడ్‌ పతనానికి ఇది మరో అడుగు లాంటిదా?’’అని ‘ఎక్స్‌’లో ప్రశ్నించారు.  

పాకిస్తాన్‌లో అంతర్భాగం పీఓకే  
పసిఫిక్‌ కమాండ్‌ మ్యాప్‌పై వివాదం  
యూఎస్‌ పసిఫిక్‌ కమాండ్‌ వెబ్‌సైట్‌లోని ‘బాధ్యతాయుత ప్రాంతం’మ్యాప్‌ భారతదేశ సరిహద్దులను తప్పుగా చూపిస్తుండడం రాజకీయంగా వివాదాస్పదంగా మా రింది. పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే), అక్సాయ్‌ చిన్‌లు భారతదేశంలో అంతర్భాగం కాదన్నట్లుగా ఈ మ్యాప్‌ను రూపొందించారు. పీఓకేను పాకిస్తాన్‌లో అంతర్భాగంగా చిత్రీకరించారు. తప్పులతడక మ్యాప్‌ ఉన్న వెబ్‌సైట్‌లో సంబంధిత వెబ్‌ పేజీని చివరిసారిగా మార్చి నెలలో అప్‌డేట్‌ చేశారన్న సమాచారం కనిపిస్తోంది. 1947లో జమ్మూకశ్మీర్‌ భారతదేశంలో విలీనం కావడం అనేది సంపూర్ణమైన, చట్టబద్ధమైన, తిరుగులేని ప్రక్రియ అని భారత్‌ చెబుతోంది.

జమ్మూకశ్మీర్, లద్ధాఖ్‌ కేంద్రపాలిత ప్రాంతాలు తమ దేశంలో అంతర్భాగమని, వాటిని వేరు చేయలేమని స్పష్టం చేస్తోంది. తాజా పరిణామంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పవన్‌ ఖేరా తీవ్రంగా స్పందించారు. భారత్‌కు, భారతదేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించే అలవాటు నరేంద్ర మోదీ గారి మిత్రులకు ఉందని విమర్శించారు. సాక్షాత్తూ ప్రధానమంత్రి దేశాన్ని ఇలాంటి ప్రతికూల స్నేహబంధాల్లోకి నెట్టినప్పుడు, ఏ దేశానికైనా శత్రువుల అవసరం ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement