ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టుకు రంగం సిద్ధం.. నివాసం వద్ద భారీగా పోలీసులు.. తీవ్ర ఉద్రిక్తత

Toshakhana Case Police May Arrest Pakistan EX PM Imran Khan - Sakshi

లాహోర్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం  లాహోర్‌లోని జమాన్‌ పార్క్‌లో ఉన్న ఆయన నివాసం వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. తోషాఖానా కేసులో ఆయన్ని అరెస్ట్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో పీటీఐ కార్యకర్తలు అక్కడికి భారీ ర్యాలీతో చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ఇదిలా ఉంటే.. పీటీఐ నేత, పాక్‌ మాజీ మంత్రి ఫవాద్ చౌద్రి, ఇమ్రాన్‌ ఇంటి వద్దకు భారీగా చేరుకోవాలని కార్యకర్తలకు ట్విటర్‌ ద్వారా పిలుపు ఇచ్చారు. అంతేకాదు ఖాన్‌ను అరెస్ట్‌ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పాక్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారాయన. 

ఇదిలా ఉంటే.. తోషాఖానా కేసులో ఇస్లామాబాద్‌ అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి జఫర్‌ ఇక్బాల్‌ నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ను జారీ చేశారు. ఫిబ్రవరి 28వ తేదీతో ఆ వారెంట్‌ ఉంది. కోర్టుకు గైర్హాజరు అవుతుండడంపై మండిపడ్డ న్యాయస్థానం ఈ వారెంట్‌ జారీ చేసినట్లు తెలుస్తోంది.

పీడీఎం ప్రభుత్వం పాక్‌లో కొలువు దీరాక.. ఇమ్రాన్‌ ఖాన్‌ హయాంలో జరిగిన అవినీతి కూపి లాగడం ప్రారంభించింది. ఇందులో భాగంగా..  ప్రభుత్వానికి దక్కిన కానుకలను ఇమ్రాన్‌ ఖాన్‌ సొంతంగా ఉపయోగించుకున్నారని, వాటి వివరాలను.. లెక్కలను కూడా  ఎక్కడా రికార్డుల్లో భద్రపరచ్చలేదని తేల్చింది. పాక్‌ ఎన్నికల సంఘం  సైతం ఇదే విషయాన్ని నిర్ధారించింది. తోషాఖానా(కేబినెట్‌ పర్యవేక్షణలోని ప్రభుత్వానికి దక్కిన కానుకలను పర్యవేక్షించే విభాగం) కేసుగా ఇది ప్రాముఖ్యత దక్కించుకుంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top