మాస్క్‌ పెట్టుకోనందుకు ప్రధానికి రూ.14 వేల జరిమానా

Thailand PM Fined For Not Wearing Face Mask - Sakshi

బ్యాంకాక్‌: పెరుగుతున్న కరోనా కేసులను కట్టడి చేసేందుకు థాయ్‌లాండ్‌ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. మాస్కు లేకుండా బహిరంగ ప్రదేశాల్లోకి వస్తే 20 వేల భట్‌లు (భారత కరెన్సీలో దాదాపు 48 వేల రూపాయల) వరకు జరిమానా విధించాలని నిర్ణయించింది. సోమవారం నుంచే ఇది అమలులోకి రాగా... థాయ్‌ ప్రధాని ప్రయుత్‌ చాన్‌–ఓచాకు కూడా మాస్కు పెట్టుకోనందుకు జరిమానా పడింది. సోమవారం కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌పై సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాని చాన్‌–ఓచా ఫోటో ఆయన అధికారిక ఫేస్‌బుక్‌ పేజీలో పోస్టు చేశారు. అందులో ఇతరులంతా మాస్క్‌ పెట్టుకోగా... ప్రధాని మాత్రం మాస్కు లేకుండా కనిపించడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఉల్లంఘనకు పాల్పడ్డానేమో చూడాలని ప్రధాని.. బ్యాంకాక్‌ నగర గవర్నర్‌ అశ్విన్‌ క్వాన్‌మువాంగ్‌ను కోరారు. నిబంధనల ప్రకారం ఇది ఉల్లంఘనే కాబట్టి మేయర్‌... ప్రధానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిటీ పోలీసు కమిషనర్‌ వెళ్లి ప్రధానికి జరిమానా విధించారు. అయితే ప్రధానిది తొలి ఉల్లంఘన కాబట్టి ప్రస్తుతానికి 6 వేల భట్‌లు (దాదాపు 14.250 రూపా యలు) జరిమానా వసూలు చేశామని గవర్నర్‌ తెలిపారు. దర్యాప్తు అధికారులు జరిమానా మొత్తాన్ని నిర్ధారిస్తారని తెలిపారు. కాగా థాయ్‌లాండ్‌ మే 1 నుంచి భారత్‌ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top