Sakshi News home page

40 ఏళ్లుగా కెనాడాలోచాప కింద నీరులా ఉగ్రవాదం  

Published Wed, Sep 20 2023 2:21 AM

Terrorism has been under the carpet in Canada from 40 years  - Sakshi

కెనడాలో ఖలిస్తాన్‌ వేర్పాటువాద ఉగ్రవాదానికి 40 ఏళ్ల చరిత్ర ఉంది. చట్టవ్యతిరేక కార్యకలాపాలు, మానవ అక్రమ రవాణా, హత్యలు, వ్యవస్థీకృత నేరాలు వంటివి ఖలిస్తాన్‌ వేర్పాటు వాదులకు గత నాలుగు దశాబ్దాలుగా నిత్యకృత్యంగా మారాయి. అయినా అక్కడ ప్రభుత్వాలు ఖలిస్తాన్‌ వేర్పాటు వాదుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి దీనికి ఓటు బ్యాంకు రాజకీయాలే ప్రధాన కారణం. భారత్‌ తర్వాత ప్రపంచంలో కెనడాలో సిక్కు జనాభా అధికంగా ఉంది.

కెనడా జనాభా లెక్కల ప్రకారం దాదాపుగా 8 లక్షల మంది సిక్కులు (మొత్తం జనాభాలో 2%పైగా) ఉన్నారు. వీరి జనాభా శరవేగంతో పెరుగుతూ వస్తోంది. కెనడాలో న్యూ డెమోక్రాటిక్‌ పార్టీ (ఎన్‌డీపీ) పగ్గాలను సిక్కు నాయకుడైన జగ్మిత్‌ సింగ్‌ ధాలివాల్‌ 2017 సంవత్సరంలో చేపట్టిన తర్వాత ఖలిస్తాన్‌ వేర్పాటు వాదుల ఎజెండాకు మద్దతు పలికారు.

2021లో ప్రధానమంత్రి జస్టిస్‌ ట్రూడోకు చెందిన లిబరల్‌ పార్టీ మెజార్టీ స్థానాలను గెలవలేకపోవడంతో ఎన్‌డీసీ మద్దతు తీసుకోవాల్సి వచ్చింది.దీంతో ఖలిస్తాన్‌ వేర్పాటువాదులు మరింత చెలరేగిపోతున్నా ప్రధాని ట్రూడో ఏమీ చేయలేకపోతున్నారు. ఇక ప్రస్తుతం కెనడా పార్లమెంటులో 18 మంది సిక్కు ఎంపీలు ఉన్నారు. సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎఫ్‌జే) అనే సంస్థ ప్రత్యేక ఖలీస్తాన్‌పై రెఫరెండం చేపట్టి తమకు లక్ష మందికిపైగా మద్దతు పలుకుతున్నట్టుగా ప్రకటించింది.  

2019 నుంచి పెరిగిన దాడులు
♦ జగ్మిత్‌ సింగ్‌ బృందం ఖలిస్తాన్‌ విషయంలో మరింత చురుగ్గా ఉంటూ దాడులకుప్రోత్సహిస్తోంది. కెనడాతో పాటు అమెరికా, యూకే, ఆ్రస్తేలియాలో ఇటీవల కాలంలోవీరి దాడులు పెరిగిపోతున్నాయి.  

భారత కార్యాలయాలు, హిందూఆలయాలపై విచ్చలవిడిగా దాడులుజరుగుతున్నాయి. మార్చిలో లండన్‌లో భారత హైకమిషనర్‌ కార్యాలయంపై దాడి జరిగింది.  

2022 మేలో మొహాలిలో పంజాబ్‌ ఇంటెలిజెన్స్‌ హెడ్‌క్వార్టర్స్‌పై గ్రెనేడ్‌ దాడి వెనుక(ఎస్‌ఎఫ్‌జే) హస్తం ఉంది.  

♦ దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యను కీర్తిస్తూ జూన్‌ 4న ఖలీస్తాన్‌ ఉద్యమకారులువివిధ కార్యక్రమాలు చేపట్టారు.రక్తపు మడుగులో పడి ఉన్న ఇందిర, ఒక సిక్కు చేతిలో తుపాకీ ఉన్న చిత్రాలకి సంబంధించిన కటౌట్లు టొరాంటో వీధుల్లో వెలిశాయి. దర్బార్‌ సాహిబ్‌పై దాడులకు ప్రతీకారంగానే ఈ హత్య జరిగిందంటూ దానిపై రాశారు. ఒంటారియాలో భారీ ర్యాలీతో తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సంబరాల్ని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ తీవ్రంగా ఖండించారు.కెనడా ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వేర్పాటువాదుల ఆగడాలను చూసీచూడనట్టువదిలేస్తోందని ఆయన దుయ్యబట్టారు.  

♦ జులైలో ఆ్రస్టేలియాలోని సిడ్నీలో భారతీ విద్యార్థులపైఖలిస్తాన్‌ వేర్పాటువాదులు ఇనుపరాడ్లతో దాడి చేశారు.  

అప్పట్లో ట్రూడో తండ్రి  
ప్రస్తుత ప్రధాని జస్టిన్‌ ట్రూడో తండ్రి పియరే ట్రూడో 1980లో కెనడా ప్రధానిగా ఉన్నారు. అప్పట్లోనే ఖలిస్తాన్‌ కార్యకలాపాలపై భారత ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ ఆయనకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఆ నాటి ప్రభుత్వం కూడా ఉదాసీనంగానే వ్యవహరించిందని బ్లడ్‌ ఫర్‌ బ్లడ్‌ అనే పుస్తకంలో రచయిత టెర్రీ మిల్‌వెస్కీ పేర్కొన్నారు. అప్పట్లో ఖలిస్తాన్‌ ఉద్యమం కెనడాలో కూడా ఉవ్వెత్తున లేచింది.

ఇందిరాగాంధీ హత్య తర్వాత కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో మళ్లీ వేర్పాటువాదులు చెలరేగిపోతున్నారు. వాస్తవానికి ఖలిస్తాన్‌ ఉద్యమం ప్రజా మద్దతు ఉన్నది కాదన్న అభిప్రాయాలు ఉన్నాయి. ‘‘‘ఖలిస్తాన్‌ ఉద్యమం భౌగోళిక రాజకీయాలకు సంబంధించినది. చైనా, పాకిస్తాన్‌ వంటి దేశాలు తమ శత్రుదేశమైన భారత్‌కు ఇబ్బంది కలుగుతుందని ఖలిస్తాన్‌ వేర్పాటు వాదులకి సాయపడుతున్నాయి’’అని రచయిత టెర్రీ పేర్కొన్నారు.

ఇందిర హత్యని ఒక సంబరంగా పేర్కొంటూ 2002లో టొరాంటో ప్రధాన కేంద్రంగా ప్రచురితమయ్యే సంజా సవేరా మ్యాగజైన్‌ కథనాలు వండి వార్చింది. ఆలాంటి పత్రికకు ప్రభుత్వం అత్యధికంగా వాణిజ్య ప్రకటనలు ఇవ్వడం ద్వారా తన వైఖరి ఏంటో చెప్పకనే చెప్పింది. 

నిజ్జర్‌ హత్యతో రాజుకున్న చిచ్చు 
గత ఏడాది జూన్‌ 18న కెనడాలోని బ్రిటీష్‌ కొలంబియాలో నిషేధిత ఖలిస్తాన్‌ టైగర్‌ ఫోర్స్‌ చీఫ్‌ హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ను సర్రేలోని గురుద్వారాలో కాల్చి చంపడంతో భారత, కెనడాల మధ్య చిచ్చు రేగింది. ఈ హత్యలో భారత్‌ ప్రమేయం ఉందంటూ కెనడా చేసిన ఆరోపణలతో ఇరు దేశాలు తమ రాయబారుల్ని వెనక్కి పిలిపించేదాకా వెళ్లాయి. పంజాబ్‌లో జలంధర్‌కు చెందిన నిజ్జర్‌ 1997లో కెనడాకు వలస వెళ్లాడు.

ప్లంబర్‌గా పని చేస్తూనే ఖలిస్తాన్‌ వేర్పాటు వాదులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌లో కూడా సభ్యుడిగా ఉన్నాడు. 2020లో భారత్‌ నిజ్జర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించింది. 2007లో పంజాబ్‌లోని లూథియానాలో పేలుళ్లు, 2009లో పటియాలాలో రాస్ట్రీయ సిక్‌ సంగత్‌ అధ్యక్షుడు రూల్డా సింగ్‌ హత్యలో నిజ్జర్‌ ప్రమేయమున్నట్టు అనుమానాలున్నాయి. కెనడా, యూకే, అమెరికాలో భారత రాయబార కార్యాలయాల దాడుల వెనుక నిజ్జర్‌ హస్తం ఉన్నట్టుగా భారత్‌ విచారణలో తేలింది.  

Advertisement
Advertisement