సూడాన్‌: 400 మందికి పైగా మృతి.. వేల మందికి గాయాలు.. యూనిసెఫ్‌ ఆందోళన

Sudan Fighting So Far Death Toll Continues UNICEF concerned Children - Sakshi

న్యూయార్క్‌: సూడాన్‌ అంతర్యుద్ధంలో 413 మంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఆర్మీకి, పారామిలిటరీ రాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్సెస్‌(RSF)కు నడుమ అక్కడ భీకర యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.  అయితే ఈ అంతర్యుద్ధంలో చిన్నారులే ఎక్కువగా బాధితులవుతున్నట్లు ఐరాస మరో విభాగం యూనిసెఫ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. 

డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి మార్గరేట్‌ హ్యారిస్‌ మీడియాతో మాట్లాడుతూ.. సూడాన్‌ ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ అంతర్యుద్ధంలో 413 మంది సాధారణ పౌరులు మృతి చెందారని, అలాగే 3,551 మంది గాయపడ్డారని వెల్లడించారు. అలాగే.. అక్కడి ఆరోగ్య కేంద్రాలపైనా దాడులు జరుగుతున్నాయని ఆమె వెల్లడించారు. 

ఇదే సమావేశంలో యూనిసెఫ్‌ ప్రతినిధి జేమ్స్‌ ఎల్డర్‌ మాట్లాడుతూ.. ఈ పోరులో పిల్లలే ఎక్కువగా బాధితులైనట్లు వెల్లడించారు. తొమ్మిది మంది చిన్నారులు మరణించారు, 50 మందికిపైగా గాయపడ్డారని వెల్లడించారాయన. అలాగే.. చాలామంది ఇళ్లలోనే చిక్కుకుపోయారని, చాలా ప్రాంతాలు అంధకారంలో కూరుకపోయాయని తెలిపారు. ఆహారం, మంచి నీరు, మందులు లేక వాళ్లు అల్లలాడుతున్నారని, మరోవైపు చికిత్స అందించాల్సిన ఆస్పత్రులే నాశనం అవుతున్నాయంటూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

సూడాన్‌ ప్రపంచంలోనే పిల్లలో పోహకాహారలోపం రేటు అత్యధికంగా ఉన్న దేశమని యూనిసెఫ్‌ ఈ సందర్భంగా గుర్తు చేసింది. ప్రస్తుత పరిస్థితులతో యాభై వేలకు పైగా చిన్నారుల జీవితం ప్రమాదంలో పడిందని తెలిపింది.

సూడాన్‌లో 2021 అక్టోబర్‌ నుంచి ప్రభుత్వం లేకుండానే ఎమర్జెన్సీలో నడుస్తోంది. మిలిటరీ అప్పటి ప్రధాని అబ్దల్లా హందోక్‌ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. గత శనివారం నుంచి సూడాన్‌ రాజధాని ఖార్తోమ్‌, చుట్టు పక్కల ప్రాంతాల్లో ఆర్మీకి, పారామిలిటరీ రాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌కు నడుమ పోరాటం నడుస్తోంది.

అధికార దాహం నుంచి పుట్టిందే ఈ అంతర్యుద్ధం

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top