Auto Theft: కెనడాలో చోరీ, అఫ్రికాలో ప్రత్యక్ష్యం.. ఈ కార్లు ఎలా వస్తున్నాయబ్బా?

Stolen Canadian Cars are Ending up in Africa - Sakshi

కెనడాలో చోరీ అయిన వాహనాలు చివరికి ఆఫ్రికాలో ప్రత్యక్షం అవుతున్నాయి. కెనడాలో చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు ఈ సమస్యను పట్టించుకోకపోవడమే దీనికి కారణమని ఆఫ్రికా దేశాల్లోని అధికారులు ఆరోపిస్తున్నారు. సీబీసీ మీడియా ఇటీవల జరిపిన పరిశోధనలో పశ్చిమ ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన ప్రాంతమైన ఘనాలో డజన్ల కొద్దీ చోరీకి గురయిన వాహనాలు అంటారియో, క్యూబెక్ లైసెన్స్ ప్లేట్‌లతో కనిపించాయి. ఈ వాహనాలలోని కొన్నింటికి కెనడియన్ రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయి. కొనుగోలుదారులు మార్కెట్ ధరకు దగ్గరగా వీటికి ధరను చెల్లిస్లున్నారని తేలింది. సోషల్ మీడియాతో సహా వివిధ ఆన్‌లైన్ ఛానళ్ల ద్వారా  ఈ కార్ల విక్రయాలకు సంబంధించిన ప్రకటలు వెలువడుతున్నాయి. 

కెనడాలో 2022లో పెరిగిన కార్ల చోరీలు
‘తాము చోరీ అయిన వాహనాల విషయంలో ప్రపంచ దాతగా మారామని కెనడియన్ ఫైనాన్సింగ్ అండ్‌ లీజింగ్ అసోసియేషన్ ప్రతినిధి మైఖేల్ రోత్ సీబీసీకి చెప్పారు. కాగా బీమా పరిశ్రమ గ్రూప్‌ ఈక్విటీ అసోసియేషన్ తెలిపిన వివరాల ప్రకారం కెనడాలో వాహనాల దొంగతనాలు 2022లో పెరిగాయి. క్యూబెక్, అంటారియోలో దాదాపు 50 శాతం మేరకు కార్ల చోరీలు పెరిగాయి. అట్లాంటిక్ కెనడాలో కార్ల చోరీ 34 శాతానికిపైగా పెరిగింది. దీనివెనుక మాంట్రియల్‌లోని వ్యవస్థీకృత నేరగాళ్లు కారణమనే ఆరోపణలున్నాయి. చోరీ అయిన వాహనాలు మాంట్రియల్ పోర్ట్ నుంచి విదేశాలలోని గమ్యస్థానాలకు తరలిపోతున్నాయి.

గ్రేటర్ టొరంటో ఏరియాలో వరుస చోరీలు
ఈ సంవత్సరం ప్రారంభంలో పీల్ ప్రాంతీయ పోలీసులు కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ సంయుక్తంగా పోర్ట్ ఆఫ్ మాంట్రియల్ అండ్‌  ఎక్విట్ అసోసియేషన్ సహాయంతో 10 మిలియన్ డాలర్లకు మించి విలువచేసే వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గ్రేటర్ టొరంటో ఏరియాలో వరుస దొంగతనాల నేపధ్యంలో ప్రాజెక్ట్ ఆర్‌ అండ్‌ ఆర్‌ పేరుతో విచారణ మొదలయ్యింది. ఈ వాహనాలను షిప్పింగ్ కంటైనర్లలోకి ఎక్కించి, ట్రక్కులు లేదా రైళ్ల ద్వారా మాంట్రియల్ పోర్ట్‌కు తరలిస్తున్నట్లు విచారణతో తేలింది. 

300 శాతం మేరకు పెరిగిన వాహన చోరీలు
నెల రోజుల క్రితం హాల్టన్ పోలీసులు చోరీకి గురయిన  35 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి ఆరు నిమిషాలకు ఒక వాహనం చోరీకి గురవుతుండటంతో రికవరీలు సమస్యగా పరిణమిస్తున్నాయి. గత జూన్‌లో కెనడియన్ ఫైనాన్స్ అండ్ లీజింగ్ అసోసియేషన్ అందించిన వచ్చిన ఒక నివేదిక ప్రకారం టొరంటోలో 2015 నుండి 2022 వరకు వాహనాల దొంగతనాలు 300 శాతం మేరకు పెరిగాయి. ప్రతి సంవత్సరం ఈ సమస్య క్రమంగా పెరుగుతోంది. 2022లో ఒక్క టొరంటోలోనే 9,600 వాహనాలు చోరీ అయ్యాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి మరింత సమన్వయంతో జాతీయస్థాయిలో ప్రయత్నాలు జరగాలని నివేదిక పిలుపునిచ్చింది.

వెహికల్ సేఫ్టీ రెగ్యులేషన్స్‌ను అప్‌డేట్ చేయాలి
కెనడాలో వాహనాల దొంగతనాలు విపరీతంగా పెరుగుతున్నాయి. వ్యవస్థీకృత నేరాగాళ్లు చోరీ చేసిన వాహనాలతో తమ ఆదాయాన్ని పెంచుకోవడంలో మరింత ప్రవీణులుగా మారారు. దొంగతనాల నివారణకు తక్షణమే పబ్లిక్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లు నిర్వహించడం అవసరం అని సీఎఫ్‌ఎల్‌ఏ ప్రెసిడెంట్ మైఖేల్ రోతే అన్నారు. అలాగే ఈక్విట్‌ అసోసియేషన్ వంటి ఇతర సంస్థలు.. కెనడాలోని ఫెడరల్ మోటార్ వెహికల్ సేఫ్టీ రెగ్యులేషన్స్‌ను అప్‌డేట్ చేయాలని కెనగా ట్రాన్స్‌పోర్ట్ విభాగానికి పిలుపునిచ్చాయి. 

విచారణ కోసం ప్రాసిక్యూషన్ బృందాలు
నేరస్తులు ఇప్పుడు పాత ప్రమాణాలను సద్వినియోగం చేసుకుంటున్నారని విచారణాధికారి బ్రయాన్ గాస్ట్ పేర్కొన్నారు. వారు వ్యవస్థలోని లోపాలను త్వరగా , సులభంగా ఉపయోగించుకుంటున్నారని, ఇది కెనడా అంతటా వాహనాల దొంగతనాల పెరుగుదలకు దారితీస్తున్నదన్నారు. అంటారియో ప్రభుత్వం వాహనాల దొంగతనాలను ఎదుర్కొనేందుకు రాబోయే మూడు సంవత్సరాల్లో 51 మిలియన్‌ డాలర్లను పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. దీనిలో భాగంగా క్రిమినల్ సంస్థలపై దర్యాప్తు , విచారణ కోసం ప్రాసిక్యూషన్ బృందాలు ఏర్పాటు చేస్తామని తెలిపింది.

చాలా తక్కువ మాత్రమే రికవరీ
కెనడియన్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్‌కు చెందిన హువ్ విలియమ్స్ మాట్లాడుతూ కెనడాలో గృహాలు, డీలర్‌షిప్‌ షోరూమ్‌ల నుండి కార్లు చోరీకి గురవుతున్నాయని చెప్పారు. వీటిలో చాలా తక్కువ  మాత్రమే రికవరీ అవుతున్నాయని తెలిపారు. యూఎస్‌ హోంల్యాండ్ సెక్యూరిటీ తమ పనిని సమర్థవంతంగా చేస్తోంది. కానీ కెనడాలో అలా జరడం లేదన్నారు. కాగా ఘనాకు చెందిన ఎకనామిక్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఆఫీస్ డిప్యూటీ డైరెక్టర్ అబ్దులై బషీరు దపిలా మాట్లాడుతూ వాహన దొంగతనాలకు సంబంధించి  ఏ కెనడియన్ ఏజెన్సీ కూడా మమ్మల్ని నేరుగా సంప్రదించలేదని, నేరుగా అధికారిక ఫిర్యాదు చేయలేదని తెలిపారు.

కార్లను వెదుక్కుంటున్న వాహనయజమానులు
కొన్ని సందర్భాల్లో కెనడియన్లు చోరీకి గురయిన కారు కోసం తామే ప్రయత్నిస్తున్నారు. గత జూలైలో టొరంటోకు చెందిన ఒక వ్యక్తికి చెందిన రేంజ్ రోవర్‌ చోరీ జరిగాక అతను దానిని ట్రాక్ చేసి, మాంట్రియల్‌లో ఉందని,  దానిని స్వాధీనం చేసుకునేందుకు అక్కడికి వెళ్లారు. 64 ఏళ్ల స్టీఫెన్ టౌబ్ రేడియో-ఫ్రీక్వెన్సీ ట్రాకింగ్ పరికరం సాయంతో తన కారు వాహనం టొరంటో తూర్పు చివరలో ఉందని తెలుసుకున్నారు. తరువాత పోర్ట్ ఆఫ్ మాంట్రియల్ వద్ద షిప్పింగ్ కంటైనర్‌లోకి చేరుకుందని తెలిపారు. 

ట్రాకింగ్ డివైజ్ ప్రొవైడర్ కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ  కారు లొకేషన్‌ను షేర్ చేసిందని టౌబ్ కెనడియన్ ప్రెస్‌కు తెలిపారు. అయితే సిబ్బంది కొరత కారణంగా కంటైనర్‌ను తెరవడానికి నాలుగు నెలల సమయం పట్టవచ్చని, ఈలోపునే కంటైనర్‌ను రవాణా జరగవచ్చని టౌబ్‌ పేర్కొన్నాడు. ఈ నేపధ్యంలో టౌబ్ మాంట్రియల్‌లోని సంబంధింత కార్యాలయానికి వెళ్లి అక్కడి ఏజెన్సీని కలిశాడు. మరుసటి రోజు తన రేంజ్ రోవర్‌ను స్వాధీనం చేసుకునేందుకు  ఏర్పాట్లు చేసుకున్నారు. తాను అక్కడికి వెళ్లకపోతే తన కారును తిరిగి పొందేవాడిని కాదని టౌబ్‌ మీడియాకు తెలిపారు.
ఇది కూడా చదవండి: విటమిన్‌ టాబ్లెట్‌ అనుకుని ఎయిర్‌పాడ్‌ మింగేసింది.. తరువాత? 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top