Sri Lanka Economic Crisis: లంకకు అండగా నిలిచిన ప్రధాని మోదీ.. భారీ సాయం

Sri Lanka Foreign Minister Said India Will Give Fuel Aid - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అన్నిరకాలుగా సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. పెట్రో ధరల పెంపును నిరసిస్తూ సెంట్రల్‌ లంకలోని రంబుక్కన వద్ద హైవేను, రైల్వే ట్రాక్‌ను దిగ్బంధించారు. వారిపై పోలీసుల కాల్పుల్లో ఒకరు మరణించారు. పలువురు గాయపడ్డారు. కాగా, లీటర్‌ పెట్రోల్‌ మంగళవారం ఏకంగా 84 రూపాయలు పెరిగి రూ.338కి చేరింది. బస్సు చార్జీలు కూడా ఏకంగా 35 శాతం పెరిగాయి. దీంతో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉండగా.. సంక్షోభంలో ఉన్న లంకు మరోసారి భారత్‌ భారీ సాయాన్ని అందించనుంది. చమురు కొనుగోలు కోసం అదనంగా 500 మిలియన్ డాలర్లు (సుమారు రూ.3800 కోట్లు) అందించనుందని శ్రీలంక విదేశాంగ మంత్రి జీఎల్ పిరిస్ వెల్లడించారు. అంతకు ముందు కూడా భారత్‌.. శ్రీలంకకు భారీ మొత్తంలో డీజిల్‌, ధాన్యాన్ని పంపించింది. అలాగే, ఐఎంఎఫ్‌ నుండి(అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ) నుండి వచ్చే సాయం ప్రస్తుతం దశల వారీగా అందుతోందన్నారు.  ఇదే సమయంలో బంగ్లాదేశ్ నుండి అందే ఆర్థిక సాయం 450 మిలియన్ డాలర్లు కొంత ఆలస్యం కానున్నట్టు ఆయన తెలిపారు.

మరోవైపు.. ఆర్థిక సంక్షోభం, దేశవ్యాప్త నిరసనలతో సతమతమవుతున్న శ్రీలంకలో సోమవారం పాత ప్రధాని మహింద రాజపక్స సారథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మొత్తం 17 మందితో అధ్యక్షుడు గొటబయ రాజపక్స కొత్త కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు, ప్రధాని విడివిడిగా జాతినుద్దేశించి మాట్లాడారు. సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుని వ్యవస్థలో సమూల మార్పు తీసుకొస్తామని గొటబయ ధీమా వెలిబుచ్చారు. స్వచ్ఛమైన, సమర్థమైన పాలన అందించేందుకు సహకరించాల్సిందిగా మహింద కోరారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top