పడగ విప్పిన కరువు, జాడలేని వాన చినుకు.. అల్లాడిపోతున్న యూరప్‌.. 500 ఏళ్ల విపత్తు!

Serious drought hitting Europe, wider world - Sakshi

విపరీతమైన ఎండలు, కార్చిచ్చులు

అతలాకుతలమవుతున్న పలు దేశాలు

8 ప్రాంతాల్లో కరువు: ఇంగ్లండ్‌ ప్రకటన

500 ఏళ్లకోసారి వచ్చే విపత్తు: సైంటిస్టులు

ఆఫ్రికా, అమెరికాల్లోనూ కరువు ఛాయలు

బ్రిటన్‌లో థేమ్స్‌ నది ఎండిపోతోంది. ఫ్రాన్స్‌లో ఎండ వేడిమికి కార్చిచ్చులు ఎగసిపడుతున్నాయి. నదుల్లో నీళ్లు లేక చచ్చిపోయిన చేపలు గుట్టలుగుట్టలుగా పడుతున్నాయి. స్పెయిన్‌లో రిజర్వాయర్లు నీళ్లు లేక బోసిపోతున్నాయి. మొత్తంగా యూరప్‌లో సగభాగాన్ని కరువు కమ్మేస్తోంది. 

లండన్‌: వాతావరణంలో మార్పుల ప్రభావం యూరప్‌ను అల్లాడిస్తోంది. బ్రిటన్, ఫ్రాన్స్, హంగేరి, సెర్బియా, స్పెయిన్, పోర్చుగల్, జర్మనీ తదితర దేశాల్లో కరువు ముంచుకొస్తోంది. పశ్చిమ, మధ్య, దక్షిణ యూరప్‌లో రెండు నెలలుగా వాన చినుకు జాడ కూడా లేదు! దాంతో యూరప్‌లోని సగం ప్రాంతాల్లో కరువు పడగ విప్పింది. యూరోపియన్‌ యూనియన్‌లో 46% ప్రాంతాల్లో ప్రమాదకంగా కరువు పరిస్థితులున్నాయి.

వాటిలో 11% ప్రాంతాల్లోనైతే అతి తీవ్ర కరువు నెలకొంది! దక్షిణ ఇంగ్లండ్‌లో థేమ్స్‌ నదిలో ఏకంగా 356 కి.మీ. మేర ఇసుక మేటలు వేసింది. నది జన్మస్థానం వద్ద వానలు కురవకపోవడం, ఎగువ నుంచి నీళ్లు రాకపోవడంతో ఎన్నడూ లేనంతగా ఎండిపోయింది! ఫ్రాన్స్‌లోని టిల్లె నదిలో సెకనుకు సగటున 2,100 గాలన్లు నీరు ప్రవహించే చోట్ల కూడా ఇప్పుడు చుక్క నీరు కనిపించడం లేదు. దక్షిణ, మధ్య, తూర్పు ఇంగ్లండ్‌లో ఏకంగా 8 ప్రాంతాలను కరువు ప్రభావితమైనవిగా బ్రిటన్‌ ప్రకటించింది.

1935 తర్వాత ఇలాంటి పరిస్థితులు రావడం ఇదే తొలిసారి! ఇంగ్లండ్‌లో కొద్ది వారాలుగా ఉష్ణోగ్రతలు ఏకంగా 40 డిగ్రీల సెల్సియస్‌ పైగానమోదవుతున్నాయి. ఈ ఏడాది జూలై అత్యంత పొడి మాసంగా రికార్డులకెక్కింది. ఇవే పరిస్థితులు తూర్పు ఆఫ్రికా,  మెక్సికోల్లో కనబడుతున్నాయి. 500 ఏళ్లకోసారి మాత్రమే ఇంతటి కరువు పరిస్థితులను చూస్తామని నిపుణులు చెబుతున్నారు.

నదులు ఎండిపోతూ ఉండడంతో జల విద్యుత్కేంద్రాలు మూతపడుతున్నాయి. 2018లో కూడా కరువు పరిస్థితులు వచ్చినా ఇంత టి పరిస్థితులను ఎదుర్కోలేదని అధ్యయనవేత్లలు అంటున్నారు. అక్టోబర్‌ దాకా ఇవే పరిస్థితులు కొనసాగుతాయన్న అంచనాలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితులు తీవ్రమైతే ఇళ్లల్లో తోటలకు నీళ్లు పెట్టడం, కార్లు శుభ్రం చేయడం, ఇంట్లోని పూల్స్‌లో నీళ్లు నింపడంపై నిషేధం విధిస్తారు.
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

ప్రమాద ఘంటికలు...
► బ్రిటన్‌లో జూలైలో సగటు వర్షపాతం 35% మాత్రమే నమోదైంది.  
► దాంతో ఆవులు తాగే నీళ్లపై కూడా రోజుకు 100 లీటర్లు అంటూ రేషన్‌ విధిస్తున్నారు.
► మొక్కజొన్న ఉత్పత్తి 30%, పొద్దుతిరుగుడు ఉత్పత్తి 16 లక్షల టన్నులకు తగ్గనుందని అంచనా.
► బంగాళదుంప రైతులంతా నష్టపోయారు.
► జర్మనీలోని రైన్‌ నదిలో నీటి ప్రవాహం  తగ్గిపోతూ వస్తోంది. చాలాచోట్ల 5 అడుగుల నీరు మాత్రమే ఉంది. ఈ నదిపై రవాణా ఆగిపోతే∙8 వేల కోట్ల డాలర్ల నష్టం సంభవిస్తుంది.
► ఇటలీలో గత 70 ఏళ్లలో చూడనంతటి    అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయి.  
► ఇటలీలోని అతి పెద్ద నది పో సగం వరకు           ఎండిపోయింది.  
► ఫ్రాన్స్‌లో 100కు పైగా మున్సిపాల్టీల్లో           ట్యాంకర్ల ద్వారా నీళ్లు పంపిణీ చేస్తున్నారు.
► ఎండ తీవ్రతకు ఫ్రాన్స్‌లో గిర్నోడ్‌ లో 74 చదరపు కిలోమీటర్ల మేర కార్చిచ్చు వ్యాపించింది.
► స్పెయిన్‌లో ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టాలు భారీగా పడిపోయాయి.
► హంగరీలో నదులన్నీ బురద గుంతలుగా మారిపోతున్నాయి.

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top