సౌదీ కొత్త వ్యూహం.. ప్రపంచానికే బిగ్‌ అలర్ట్‌ | Saudi Arabia Copying Iran Deadly Drone Strategy | Sakshi
Sakshi News home page

సౌదీ కొత్త వ్యూహం.. ప్రపంచానికే బిగ్‌ అలర్ట్‌

May 28 2026 1:45 PM | Updated on May 28 2026 1:56 PM

Saudi Arabia Copying Iran Deadly Drone Strategy

పశ్చిమాసియాలో ఇప్పుడు యుద్ధం అంటే కేవలం క్షిపణులు, ఫైటర్‌ జెట్లు కాదు.. “డ్రోన్ వార్‌” అనేది కొత్త భయంగా మారింది. ముఖ్యంగా ఇరాన్‌ ఉపయోగిస్తున్న “షాహెద్‌” కామికాజే డ్రోన్లు ప్రపంచ రక్షణ వ్యవస్థలకే సవాల్‌గా మారాయి. ఇప్పుడు అదే మోడల్‌ను సౌదీ అరేబియా కూడా అనుసరించే ప్రయత్నంలో ఉందన్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి.

ఇరాన్‌ తయారు చేసిన షాహెద్‌-136 డ్రోన్లు తక్కువ ఖర్చుతో తయారవుతాయి. కానీ వీటి దాడి ప్రభావం మాత్రం భారీగా ఉంటుంది. చాలా తక్కువ ఎత్తులో నెమ్మదిగా ప్రయాణించే ఈ డ్రోన్లు రాడార్‌లకు చిక్కకుండా టార్గెట్‌పై నేరుగా దూసుకెళ్తాయి. ఒకేసారి వందల సంఖ్యలో డ్రోన్లు ప్రయోగించడం వల్ల అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు కూడా ఓవర్‌లోడ్ అవుతున్నాయి. ఇదే ఇప్పుడు ఇరాన్‌ ప్రధాన యుద్ధ వ్యూహంగా మారింది.

ఇటీవల అమెరికా–ఇజ్రాయెల్‌–ఇరాన్‌ ఉద్రిక్తతల సమయంలో గల్ఫ్‌ దేశాలపై వరుసగా డ్రోన్‌, క్షిపణి దాడులు జరిగాయి. సౌదీ చమురు క్షేత్రాలు, రియాద్‌ సమీప ప్రాంతాలు, ప్రిన్స్‌ సుల్తాన్‌ ఎయిర్‌బేస్‌, అరాంకో ఆయిల్‌ ఫెసిలిటీలపై దాడుల ప్రయత్నాలు చోటుచేసుకున్నాయి. అనేక డ్రోన్లు, క్షిపణులను సౌదీ ఎయిర్ డిఫెన్స్ కూల్చివేసినప్పటికీ ఈ దాడులు రియాద్‌ను తీవ్రంగా ఆందోళనకు గురిచేశాయి.

ఈ నేపథ్యంలోనే సౌదీ అరేబియా కొత్త వ్యూహంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రియాద్‌ సమీపంలో భారీ డ్రోన్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసి, ఇరాన్‌ షాహెద్‌ తరహా లాంగ్ రేంజ్‌ అటాక్ డ్రోన్ల తయారీకి సన్నాహాలు చేస్తున్నట్లు అంతర్జాతీయ రక్షణ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అమెరికా–సౌదీ డిఫెన్స్ కంపెనీలు కలిసి ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. అయితే, ఇది కేవలం రక్షణ చర్య మాత్రమే కాదని నిపుణులు అంటున్నారు. ఇరాన్‌ “స్వార్మ్ డ్రోన్‌ స్ట్రాటజీ” ప్రపంచ యుద్ధ విధానాన్నే మార్చేసిందని వారు చెబుతున్నారు. తక్కువ ఖర్చుతో వేల డ్రోన్లు ప్రయోగించి శత్రువు రక్షణ వ్యవస్థను చేధించడం, ఆర్థిక నష్టం కలిగించడం, చమురు ఉత్పత్తిని దెబ్బతీయడం.. ఇదే కొత్త యుద్ధ ఫార్ములాగా మారుతోంది. ఇప్పుడు అదే పద్ధతిని సౌదీ కూడా అధ్యయనం చేస్తోందని విశ్లేషణలు సూచిస్తున్నాయి.

ఇక, ఇప్పటివరకు పూర్తిగా రక్షణాత్మక వైఖరిలో కనిపించిన సౌదీ.. ఇప్పుడు ప్రతీకార దాడుల దిశగా కూడా అడుగులు వేస్తోందని వార్తలు బయటకు వస్తున్నాయి. ఇరాన్‌ డ్రోన్‌, క్షిపణి లాంచ్‌ సైట్లపై సౌదీ సీక్రెట్‌గా వైమానిక దాడులు నిర్వహించిందని అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. ఇది మధ్యప్రాచ్య రాజకీయాల్లో పెద్ద వ్యూహాత్మక మార్పుగా భావిస్తున్నారు. ప్రస్తుతం గల్ఫ్‌ ప్రాంతం మొత్తం “డ్రోన్‌ కోల్డ్‌వార్‌” దిశగా వెళ్తోందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. భారీ యుద్ధ విమానాల కంటే ఇప్పుడు చౌకైన డ్రోన్లే ఎక్కువ ప్రమాదకరంగా మారుతున్నాయని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు కేవలం ఇరాన్‌ ప్రత్యేకతగా భావించిన డ్రోన్‌ వార్‌ఫేర్‌.. ఇప్పుడు సౌదీతో పాటు ఇతర దేశాలు కూడా అనుసరించే స్థాయికి చేరుకోవడం ప్రపంచ భద్రతా సమీకరణాల్లో పెద్ద మార్పుగా కనిపిస్తోంది.

డ్రోన్ స్వార్మ్ అంటే ఏమిటి?

  • ఒకేసారి డజన్ల నుంచి వందల సంఖ్యలో డ్రోన్లు ప్రయోగించడం

  • రాడార్‌, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లను గందరగోళానికి గురిచేయడం

  • ఒకటి కాదు.. వరుస దాడులతో శత్రువును అలసటకు గురిచేయడం

  • తక్కువ ఖర్చుతో భారీ నష్టం కలిగించే కొత్త యుద్ధ వ్యూహం


సౌదీకి అసలు భయం ఏంటి?

  • చమురు క్షేత్రాలపై దాడులు జరిగితే ప్రపంచ ఆయిల్ మార్కెట్ దెబ్బతింటుంది

  • అరాంకో వంటి కంపెనీలకు భారీ నష్టం వచ్చే ప్రమాదం

  • గల్ఫ్ ప్రాంత భద్రతపై ప్రపంచ పెట్టుబడిదారుల్లో భయం పెరుగుతుంది

  • సౌదీ ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం పడే అవకాశం


అమెరికా ఎందుకు అలర్ట్‌?

  • గల్ఫ్‌లో అమెరికా మిలిటరీ బేస్‌లు ఉన్నాయి

  • ఇరాన్‌ డ్రోన్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది

  • అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లకే సవాల్‌గా మారుతోంది

  • గల్ఫ్‌లో యుద్ధం పెరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే ప్రమాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement