అవును నా ఇంట్లో దెయ్యాలున్నాయి.. తరిమేశాను: నటి

Salma Hayek Haunted house in London revelation - Sakshi

సంచలన విషయాలు వెల్లడించిన ఎటర్నల్స్‌ నటి

వాషింగ్టన్‌: వెనకటి రోజుల్లో అంటే ఏమో కానీ.. ప్రస్తుతం మాత్రం దెయ్యాలు, భూతాలు అంటే చాలామంది కొట్టి పారేస్తారు. కేవలం సినిమాల్లో తప్ప వాస్తవంగా దెయ్యాలు ఉండవు అనే వారు చాలా మంది. అయితే దెయ్యాల ఉనికిని నమ్మేవారు కూడా కొకోల్లలు. ఇప్పుడు ఈ టాపిక్‌ ఎందుకంటే.. ప్రముఖ హాలీవుడ్‌ నటి ఒకరు తాను చాలా ఏళ్ల పాటు దెయ్యాలతో కలిసి జీవించానని.. చివరకు ఒకరోజు వాటిని తరిమే వ్యక్తిని తీసుకువచ్చి.. దెయ్యాల గోల నుంచి విముక్తి పొందానని తెలిపారు. సామాన్యులు ఎవరైనా ఇలాంటి మాటలు చెబితే పెద్దగా పట్టించుకోం.. కానీ ఏకంగా హాలీవుడ్‌ నటే వెల్లడించడంతో.. ఈ టాపిక్‌ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆ వివరాలు.. 

ఇటీవలే క్లో జావో 'ఎటర్నల్స్'తో అజాక్‌గా తన సూపర్ హీరో అరంగేట్రం చేసిన ప్రముఖ నటి సల్మా హాయక్, తన లండన్ ఇల్లు దెయ్యాలతో నిండిపోయిందని తెలిపారు. ది ఎల్లెన్ డిజెనెరెస్ షోకు హాజరైన సందర్భంగా హాయక్‌ సంచలన విషయాలు వెల్లడించారు. ఇంట్లో తాను ఎదుర్కొన్న విచిత్ర పరిస్థితుల గురించి.. దెయ్యాలను తరిమికొట్టిన విధానం గురించి వెల్లడించారు. 


(చదవండి: ఆ ఇంట్లో సంకెళ్ల దెయ్యం.. రాత్రయితే..)

ఈ సందర్భంగా హాయక్‌ మాట్లాడుతూ.. ‘‘లండన్‌లో ఉన్న నా ఇంట్లో చిత్ర, విచిత్రమైన, ఒళ్లు గగుర్పొడిచే సంఘటనలు చోటు చేసుకునేవి. పియానో దానంతట అదే మోగేది. మూడో అంతస్తులో ఉన్న లైట్లు.. వాటంతట అవే వెలిగేవి.. ఆరిపోయేవి. ప్రారంభంలో ఇవన్ని చూసి బెదిరిపోయాను. మనుషులు ఎవరు కనిపించే వారు కారు. ఆ తర్వాత ఇది దెయ్యాల పనే అని నాకు అర్థం అయ్యింది. కాకపోతే నేను ఎప్పుడు వాటిని ప్రత్యక్షంగా చూడలేదు’’ అని తెలిపారు.


(చదవండి: వైరల్‌: ఈమె మనిషా.. దెయ్యామా?!)

‘‘ఈ బాధ నుంచి బయటపడటానికి ఓ వ్యక్తిని తీసుకువచ్చాను. నాకు మా ఇంట్లో ఎప్పుడు దెయ్యం కనిపించలేదు. కానీ విచిత్ర సంఘటనలు చోటు చేసుకునేవి. అందుకే దెయ్యాలను తరిమే వ్యక్తిని తీసుకువచ్చాను. దెయ్యాలు ఉన్నాయో లేవో తెలియదు. కానీ నా ఈ ప్రయత్నం వల్ల వాటిని ఇంటి నుంచి తరిమేశాను అనే తృప్తి కలుగుతుంది.. భయం తగ్గి ప్రశాంతంగా ఉంటాను. ఇక నేను తీసుకువచ్చిన వ్యక్తి దగ్గర దగ్గర 20 దెయ్యాలను పట్టుకున్నట్లు తెలిపాడు’’ అని వెల్లడించారు. హాయక్‌ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం రేకెత్తిస్తున్నాయి. 

చదవండి: ఇంట్లో దెయ్యం.. కాలనీ మొత్తం ఖాళీ

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top