ఉక్రెయిన్‌ తిప్పికొడుతోంది

Russia-Ukraine war: Russian troops retreat from Ukraine - Sakshi

యుద్ధంలో ఉక్రెయిన్‌పై చేయి?

30 పట్టణాలు తిరిగి స్వాధీనం

వెనకడుగు వేస్తున్న రష్యా దళాలు 

కీవ్, ఇతర నగరాల నుంచి వెనక్కు

వేధిస్తున్న ఆయుధాల కొరత?

నగరాలపై బాంబుల వర్షం

ఏమీ తేల్చని తాజా వీడియో చర్చలు

కీవ్‌: ఉక్రెయిన్‌పై నెలకు పైగా సాగిస్తున్న యుద్ధంలో రష్యా సేనలు క్రమంగా వెనకడుగు వేస్తున్న సూచనలు కన్పిస్తున్నాయి. రష్యా సైన్యం ఆక్రమించిన చాలా పట్టణాలు, గ్రామాలను ఉక్రెయిన్‌ దళాలు తిరిగి స్వాధీనం చేసుకుంటున్నాయి. కీవ్, చెర్నిహివ్‌ ప్రాంతాల్లో, ఇతర చోట్ల కనీసం 30కి పైగా సెటిల్మెంట్లను ఇప్పటికే విముక్తం చేసినట్టు ఉక్రెయిన్‌ సైన్యం ప్రకటించింది. కీవ్, పరిసర ప్రాంతాల నుంచి రష్యా దళాలు భారీ స్థాయిలో వెనక్కు వెళ్లడం శనివారం కూడా కొనసాగింది.

700కు పైగా సాయుధ వాహనాలు కీవ్‌ నుంచి బెలారస్‌ దిశగా వెనుదిరుగుతూ కన్పించాయి. అయితే అవి వెనక్కు వెళ్లడం లేదని, తూర్పున డోన్బాస్‌పై భారీ దాడి కోసమే బయల్దేరుతున్నాయని ఉక్రెయిన్, పశ్చిమ దేశాలు అనుమానిస్తున్నాయి. పైగా రష్యా దళాలు వెనక్కు వెళ్తూ వీలైన చోటల్లా మందుపాతరలు అమర్చాయని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. ఉక్రెయిన్‌కు మరో 30 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను అందజేయనున్నట్టు అమెరికా ప్రకటించింది. వీటిలో లేజర్‌ గైడెడ్‌రాకెట్‌ సిస్టమ్స్, మానవరహిత విమానాలు, నైట్‌ విజన్‌ పరికరాలు, సాయుధ వాహనాలు తదితరాలుంటాయని పేర్కొంది.

మరోవైపు శుక్రవారం రష్యా, ఉక్రెయిన్‌ బృందాల మధ్య జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌ చర్చలు ఏ మేరకు పురోగతి సాధించిందీ తెలియరాలేదు. కానీ ఉక్రెయిన్‌ తమ దేశంపై దాడులు చేస్తోందన్న వార్తలు చర్చలకు ఆటంకం కలిగిస్తాయని పుతిన్‌ అధికార ప్రతినిధి ద్మత్రీ పెస్కోవ్‌ అన్నారు. కీవ్‌ను సందర్శించాలని ఆలోచిస్తున్నట్టు పోప్‌ ఫ్రాన్సిస్‌ తెలిపారు. ఇక మారియుపోల్‌ సహా పలు నగరాల్లో రష్యా విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. యువకులను ఏడాది పాటు సైనిక విధుల్లోకి తీసుకునే వార్షిక కార్యక్రమానికి రష్యా శుక్రవారం శ్రీకారం చుట్టింది. లక్షన్నర మందిని రిక్రూట్‌ చేసుకోవాలన్నది లక్ష్యమని చెప్తున్నారు.

రష్యాకు ఆయుధాల కొరత
రష్యా వద్ద పలు కీలక ఆయుధాలు దాదాపుగా నిండుకున్నాయని ఇంగ్లండ్‌ రక్షణ వర్గాలు చెబుతున్నాయి. వాటిని ఇప్పుడప్పుడే భర్తీ చేసుకునే అవకాశాలు కూడా లేవంటున్నాయి. హెలికాప్టర్లు, ఫైటర్‌ జెట్లు, క్రూయిజ్‌ మిసైళ్ల కొరత రష్యాను తీవ్రంగా వేధిస్తున్నట్టు చెప్పాయి. పలు కీలక విడి భాగాలను ఉక్రెయిన్‌ నుంచే రష్యా దిగుమతి చేసుకుంటోందని సమాచారం. 2014 క్రిమియా యుద్ధానంతరం రష్యాకు ఆయుధాల ఎగుమతిని ఉక్రెయిన్‌ బాగా తగ్గించింది. యుద్ధ నేపథ్యంలో నెలకు పైగా అవి పూర్తిగా ఆగిపోయాయి.

ఇంగ్లండ్‌ స్టార్‌స్ట్రీక్‌ మిసైల్‌తో రష్యా హెలికాప్టర్‌ కూల్చివేత
ఇంగ్లండ్‌లో తయారైన స్టార్‌స్ట్రీక్‌ మిసైల్‌ సాయంతో రష్యా ఎంఐ–28ఎన్‌ హెలికాప్టర్‌ను లుహాన్స్‌క్‌ ప్రాంతంలో ఉక్రెయిన్‌ కూల్చేసింది. మిసైల్‌ ఢీకొట్టడంతో హెలికాప్టర్‌ రెండు ముక్కలై నేలకూలిన వీడియో వైరల్‌గా మారింది. ధ్వని కంటే మూడు రెట్ల వేగంతో దూసుకెళ్లే ఈ లేజర్‌ గైడెడ్‌ మిసైల్‌ సిస్టమ్‌ తక్కువ ఎత్తులో వెళ్లే హెలికాప్టర్లను 100 శాతం కచ్చితత్వంతో నేలకూలుస్తుంది. పైగా ఇది చాలా తేలిగ్గా ఉంటుంది గనుక ఎక్కడికైనా సులువుగా మోసుకెళ్లవచ్చు. భుజం మీది నుంచి కూడా ప్రయోగించవచ్చు. స్టార్‌స్ట్రీక్‌ ప్రయోగంపై రష్యా మండిపడింది. ఇకపై ఇంగ్లండ్‌ ఆయుధ సరఫరాల నౌకలు, వాహనాలను లక్ష్యం చేసుకుని దాడులకు దిగుతామని హెచ్చరించింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top