
న్యూయార్క్: రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసే దేశాలపై వాషింగ్టన్, యూరోపియన్ యూనియన్‌లు మరిన్ని ద్వితీయ ఆంక్షలు విధించినట్లయితే రష్యా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని అని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ వ్యాఖ్యానించారు. ఎన్సీబీ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ సమావేశం నిర్వహించారని, దీనిలో అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ)లు రష్యాపై మరింత ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఏమి చేయవచ్చో చర్చించారని తెలిపారు.
ట్రంప్ యంత్రాంగం గతంలో ప్రకటించిన 25 శాతం పరస్పర సుంకాలకు అదనంగా భారత్ రష్యా చమురు కొనుగోలుచేస్తున్నందుకు మరో 25 శాతం సుంకాన్ని విధించింది. భారత్‌పై విధించిన మొత్తం సుంకాలు ఆగస్టు 27 నుండి అమలులోకి వచ్చాయి. కాగా రష్యాపై ఒత్తిడి పెంచడానికి అమెరికా సిద్ధంగా ఉందని, అయితే యూరోపియన్ భాగస్వాములు అందుకు సహకరించాలని స్కాట్ బెసెంట్ అన్నారు.తమ ఒత్తిడికి ఉక్రెయిన్ సైన్యం ఎంతకాలం నిలబడగలదు? రష్యన్ ఆర్థిక వ్యవస్థ ఎంతకాలం నిలుస్తుంది? అనే దాని మధ్య పోటీ జరుగుతున్నదన్నారు.
అమెరికా, ఈయూలు జోక్యం చేసుకుని రష్యన్ చమురు కొనుగోలు చేసే దేశాలపై మరిన్ని ఆంక్షలు, ద్వితీయ సుంకాలు విధించగలిగితే రష్యన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోతుందని, అప్పుడైనా అధ్యక్షుడు పుతిన్‌ను చర్చలకు వస్తారని స్కాట్ బెసెంట్ వ్యాఖ్యానించారు. కాగా అమెరికా విధించిన సుంకాలను భారత్ అన్యాయమైనవి, అసమంజసమైనవని పేర్కొంది.