బ్రిటన్ ప్రధాని నివాసంపైకి కారుతో దాడికి యత్నం?.. రిషి సునాక్‌ సేఫ్‌!

Rishi Sunak: Man arrested after crashing car into Downing Street Gates - Sakshi

బ్రిటన్ ప్రధాన మంత్రి అధికారిక నివాసం వద్ద ఓ వ్యక్తి కారుతో దాడికి యత్నించాడు. ఈ పరిణామం అందర్నీ షాక్ కి గురి చేసింది. వెంటనే అక్కడి భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆ వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకోగా.. ఆ సమయంలో సునాక్‌ తన కార్యాలయంలో ఉన్నట్లు తెలుస్తోంది. 

లండన్ లోని ప్రధాని అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ గేటును ఓ వ్యక్తి కారుతో ఢీకొట్టాడు. బ్రిటన్ కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నివాసం గేటును కారు ఢీకొన్న వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాస్త వయసున్న ఆ వ్యక్తిని సంకెళ్లతో బంధించి తీసుకెళ్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ అయ్యాయి. 

సాధారణంగా బ్రిటన్ ప్రధాని నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ వద్ద ఎప్పుడూ గట్టి సెక్యూరిటీ ఉంటుంది. రక్షణ వ్యవస్థలో భాగంగా బలమైన ఇనుప గేట్లు ఉంటాయి. దేశ పార్లమెంటుకు ఇది దగ్గరి మార్గం. ఇక్కడి ఎంట్రెన్స్ వద్ద గతంలోనే లోనే భారీ గేట్లను ఏర్పాటు చేశారు. 1991లో ఐరిష్ రిపబ్లిక్ ఆర్మీ లండన్‌లో బాంబు దాడులకు పాల్పడిన దృష్ట్యా ఇక్కడ భద్రతను పెంచారు. కాగా తాజా ఘటన వెనుక నిందితుడి ఉద్దేశం ఏంటన్నది తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే.. గురువారం సాయంత్రం బ్రిటన్‌ ప్రధాని నివాసం వద్ద జరిగింది ఉగ్ర దాడి కాకపోవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. క్రిమినల్ డ్యామేజ్, డేంజరస్ డ్రైవింగ్ ఆరోపణలపై అతడిని అరెస్టు చేసినట్టు వారు చెప్పారు. 

ఇదిలా ఉంటే.. అమెరికాలో అధ్యక్ష భవనం వైట్ హౌస్ వద్ద 19 ఏళ్ళ సాయివర్షిత్‌ కందుల ఓ అద్దె ట్రక్కుతో హల్‌ చల్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన మూడు రోజులకే బ్రిటన్‌ ప్రధాని నివాసం వద్ద అదే తరహా ఘటన చోటు చేసుకోవడగం గమనార్హం.

ఇదీ చదవండి: అడ్డొస్తే ఎవరినైనా లేపేస్తా: సాయివర్షిత్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top