
పుతిన్ చేతిలో మోసపోయా
యుద్ధం ఆపకుండా ఎంతో మందిని బలితీసుకుంటున్నాడు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్య
అక్రమ వలసల కట్టడికి ఆర్మీని వాడాలని బ్రిటన్ ప్రధానికి హితవు
లండన్: ఉక్రెయిన్‌పై దురాక్రమణ జెండా ఎత్తి భీకరయుద్ధం చేస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ చర్చల వేళ సమరానికి స్వస్తి పలుకుతానని చెప్పి తనను నమ్మించి మోసంచేశాడని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బ్రిటన్‌లో రెండ్రోజుల పర్యటనలో రాజు ఛార్లెస్ కుటుంబం, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌లతో వరుస భేటీలతో బిజీగా గడిపిన ట్రంప్ మరోవైపు ‘ఎక్స్’లో పుతిన్‌పై విమర్శలుచేశారు.
‘‘పుతిన్ ఎంతో మందిని చంపేస్తున్నారు. అంత కంటే ఎక్కువ మందిని దూరంచేసుకుంటున్నారు. మోసం చేసి నన్ను కూడా ఆయన దూరం చేసుకుంటున్నారు. చర్చల వేళ యుద్ధం ఆపేస్తానని చెప్పి పుతిన్ నన్ను దారుణంగా మోసంచేశారు. ఎంతో మనస్తాపానికి గురయ్యా’’అని ట్రంప్ అన్నారు. ఈ ఏడాది ఆగస్ట్‌లో అలాస్కా భేటీలో ట్రంప్, పుతిన్ అత్యంత ఆర్భాటంగా కలిసినా ఎలాంటి సంయుక్త ప్రకటన విడుదలచేయకపోవడంతో ప్రపంచదేశాలు ఉసూరుమన్న విషయం తెల్సిందే.
రష్యాపై ఒత్తిడి పెంచేందుకు భారత్‌పై టారిఫ్‌ల భారం మోపడాన్ని ట్రంప్ సమరి్థంచుకున్నారు. ‘‘సులభమైన పద్ధతిలో చెప్పాలంటే ఒకవేళ ముడిచమురు ధరలు భారీగా తగ్గిపోతే చమురును అమ్ముకుంటున్న రష్యాకు లాభాలు అడుగంటిపోతాయి. ఆయుధాలకు డబ్బుల్లేక చివరకు యుద్ధాన్ని ఆపుతుంది. చమురు ధర అంతర్జాతీయంగా దిగివస్తోంది. మరింతగా దిగవచ్చేలా నేను చేస్తా’’ అని అన్నారు.
బ్రిటన్ ప్రధాని స్టార్మర్‌తో భేటీ తర్వాత మీడియాతో ట్రంప్ మాట్లాడారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలా ఆపుతారన్న మీడియా ప్రశ్నకు ట్రంప్ సమాధానం దాటవేసి పాత కయ్యాలకు రాజీ కుదిర్చానని చెప్పారు. ‘‘ పరిష్కారం కనుగొనడం అసాధ్యం అనుకునే 7 సంక్షోభాలకు ముగింపు పలికా. ఇకమీదటా మరో శుభవార్త వినగలమనే అనుకుంటున్నా. ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం ప్రత్యక్షంగా అమెరికాపై పడట్లేదు. ఉక్రెయిన్ యుద్ధం అంతానికి ఒక అవరోధం అడ్డుపడుతోంది’’ అని అన్నారు.
స్టార్మర్‌తో చర్చలు
బకింగ్‌షైర్‌లో చెకర్స్‌లోని 16వ శతాబ్దినాటి పురాతన భవంతిలో బ్రిటన్ ప్రధాని స్టార్మర్‌తో చర్చలు జరిపాక మీడియాతో ట్రంప్ మాట్లాడారు. ఇంగ్లిష్ ఛానల్, సరిహద్దు గుండా అక్రమ చొరబాట్లపై స్టార్మర్‌కు మీరేం సలహా ఇస్తారని ట్రంప్‌ను మీడియా ప్రశ్నించింది. ‘‘అమెరికాలోకి అయితే చట్టవ్యతిరేకంగా లక్షలాది మంది చొరబడుతున్నారు. ఇలాంటి అక్రమవలసదారులు ఎన్నో దేశాలను నాశనంచేశారు. అలా చూస్తూ ఊరుకోలేను. వాళ్లను బహిష్కరించి పంపేయడం తప్ప మరో మార్గంలేదు. స్టార్మర్‌కూ అదే చెప్పా. సైన్యాన్ని సరిహద్దులకు రప్పించి అక్రమ వలసలను కట్టడిచేయండి. సైన్యాన్ని ఎలా సద్వినియోగం చేస్తున్నామనేదే ముఖ్యం’’అని అన్నారు.
మోదీ, భారత్‌తో నాకెంతో సాన్నిహిత్యం
బుధవారం మోదీ బర్త్‌డే వేళ ఫోన్‌చేసి శుభాకాంక్షలు చెప్పిన ట్రంప్ మరుసటి రోజు సైతం పొగిడారు. ‘‘భారత ప్రధాని మోదీ, ఇండియాతో నాకెంతో సాన్నిహిత్యం ఉంది. హ్యాపీబర్త్‌డే చెప్పేందుకు నిన్ననే ఫోన్‌చేసి మాట్లాడా. మా మధ్య సత్సంబంధాలున్నాయి. అయినాసరే భారత్‌పై అధిక టారిఫ్ మోపాల్సి వచి్చంది’’అని అన్నారు.
బ్రిటన్‌తో టెక్ డీల్
ట్రంప్ పర్యటన వేళ బ్రిటన్‌తో అమెరికా సాంకేతిక ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సాంకేతికత శ్రేయస్సు ఒప్పదం అని పేరు పెట్టారు. కృత్రిమమేథ, క్వాంటమ్ కంప్యూటింగ్, అణువిద్యుత్ రంగాల్లో సహకారంతోపాటు బ్రిటన్‌లో సాంకేతికరంగాల్లో బడా అమెరికన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఈ ఒప్పందం బాటలు వేయనుంది. మైక్రోసాఫ్ట్ ఏకంగా 30 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతానని ప్రకటించింది. మరో రెండేళ్లలో ఏఐ పరిశోధన, మౌలిక సదుపాయాల రంగాల్లో 5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తానని గూగుల్ తెలిపింది.
అఫ్గానిస్తాన్ స్థావరాన్ని తిరిగి సాధిస్తాం
‘‘అఫ్గానిస్తాన్‌లోని బాగ్రామ్ వైమానికస్థావరాన్ని తిరిగి చేజిక్కించుకుంటాం. అది జరిగితే నిజంగా ఇది సంచలన వార్తే అవుతుంది. దానిని కైవసం చేసుకోవాలన్న ఉద్దేశం వెనుక పెద్ద కారణం ఉంది. అక్కడి నుంచి కేవలం గంట సేపు విమానంలో ప్రయాణిస్తే చైనా అణ్వాయుధాల తయారీ కేంద్రాన్ని చేరుకోవచ్చు’’అని ట్రంప్ అన్నారు. 1950దశకంలో సోవి యట్ రష్యా ఈ స్థావరాన్ని తొలిసారిగా ఏర్పాటు చేసింది. 1980లలో అది ప్రధానస్థావరంగా వెలుగొందింది. 2001లో తాలిబన్ ప్రభుత్వాన్ని అమెరికా కూలదోసి ఆ స్థావరాన్ని తమ వశంచేసుకుంది. చిన్నబేస్‌ను దశలవారీగా ఏకంగా 77 చదరపు కిలోమీటర్ల స్థాయికి పెంచింది. ఇటీవల అఫ్గాన్ నుంచి అమెరికా సేనలు పూర్తిగా ని్రష్కమించడం తెల్సిందే.