
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పరిపాలనలో మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా రక్షణ శాఖను ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్’గా నామకరణ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు త్వరలో ఎగ్గిక్యూటీవ్ ఆర్డర్‌ను పాస్ చేయనున్నారు. అనంతరం, ప్రస్తుతం రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్‌సెత్ ఇకపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్ మినిస్టర్‌గా పిలిపించుకోనున్నారు.
వైట్ హౌస్ ప్రకటన ప్రకారం.. ట్రంప్ త్వరలోనే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేయనున్నారు. తద్వారా ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్’ అనే పదాన్ని అధికారికంగా ఉపయోగించేందుకు అనుమతి లభిస్తుంది. దీంతో పాటు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థగా పేరొందిన పెంటగాన్ (Pentagon) రక్షణ కార్యాలయం అధికారిక పోర్టల్స్, సైన్య సంబంధిత బోర్డులు, మీడియా రూమ్‌లు కూడా ఈ మార్పుకు అనుగుణంగా కార్యకలాపాలు కొనసాగనున్నాయి.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ కాస్తా.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్ మారుస్తూ తీసుకున్న నిర్ణయంపై ట్రంప్, రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్‌సెత్ మీడియాతో మాట్లాడారు. ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్’ అనే పేరుతో అమెరికా గతంలో ప్రపంచ యుద్ధాల్లో విజయాలు సాధించింది. ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్’ అనే పేరు మారిన తర్వాత ఆ పోరాట స్పూర్తి తగ్గిపోయిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. హెగ్‌సెత్ కూడా ఈ మార్పును సాంస్కృతిక మార్పుగా అభివర్ణించారు. మేము కేవలం రక్షణ మాత్రమే కాదు.. దాడులు కూడా చేస్తాం. వాటికి అనుగుణంగా పేర్లు ఉండటం చాలా ముఖ్యమని వ్యాఖ్యానించారు.
పేరు మార్పు దేనికి సంకేతం
1949 వరకు అమెరికా ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్’ అనే పేరుతోనే సైనిక వ్యవహారాలను నిర్వహించేది. తరువాత నేషనల్ సెక్యూరిటీ చట్టం ద్వారా ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్’గా మార్పు జరిగింది. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం మళ్లీ ఆ చారిత్రక పేరును తిరిగి తీసుకురావాలని భావిస్తోంది. ఈ మార్పు అమెరికా రాజకీయాల్లో, సైనిక విధానాల్లో కొత్త దిశకు సంకేతమా? అనేది కాలమే నిర్ణయించాల్సి ఉంది.
ట్రంప్ వ్యూహమా
రక్షణ శాఖ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్) పేరును యుద్ద శాఖ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్)గా మార్చడంలో ట్రంప్ వ్యూహం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్‌లో ‘వార్’ అనే పదం రక్షణ కంటే దాడి, శక్తి సూచిస్తుంది. అదే సమయంలో ప్రపంచదేశాల ఎదుట తమ దేశ యుద్ధ సామర్థ్యాన్ని బహిరంగంగా వ్యక్తం చేస్తున్నట్లేనని భావించవచ్చు. ఈ పేరు మార్పు రాజకీయ నాయకుడిగా దేశ భద్రతపై అతని దృష్టిని ప్రతిబింబించవచ్చు. ట్రంప్ ఈ మార్పును ప్రతిపాదించినప్పుడు, ఆయన ఉద్దేశం అమెరికా సైన్యానికి మరింత దృఢత్వాన్ని ఇవ్వడమే అని చెప్పారు. మరికొందరు మాత్రం.. ట్రంప్ యుద్ధాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగమేనంటూ పెదవి విరుస్తున్నారు.