ఇరాన్‌లోని ఈ ప్రాంతాల్లో బాంబులు వేస‍్తాం!: పెంటగాన్‌ | Pentagon Chief Hegseth warns Iran | Sakshi
Sakshi News home page

ఇరాన్‌లోని ఈ ప్రాంతాల్లో బాంబులు వేస‍్తాం!: పెంటగాన్‌

Apr 16 2026 8:15 PM | Updated on Apr 16 2026 8:22 PM

 Pentagon Chief Hegseth warns Iran

వాషింగ్టన్: ఇరాన్‌కు పెంటగాన్‌ చీఫ్‌ పీట్ హెగ్‌సెత్ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఇరాన్ ప్రజలు, ప్రపంచ ప్రయోజనాల కోసం సరైన ఒప్పందాన్ని, సమర్థంగా కుదుర్చుకోకపోతే పోర్టుల నిర్బంధం, ఆర్థికపరంగా ఒత్తిడి కొనసాగుతాయని తెలిపారు. అవసరమైనంతకాలం నిర్బంధం కొనసాగుతుందని చెప్పారు. ఇరాన్ తప్పుడు నిర్ణయం తీసుకుంటే మౌలిక వసతులు, విద్యుత్, ఎనర్జీ రంగాలపై బాంబులు పడతాయంటూ హెచ్చరించారు. 

శాంతి ఒప్పందాన్ని ఇరాన్‌ తిరస్కరిస్తే సైనిక దాడులను మళ్లీ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని హెగ్‌సెత్ హెచ్చరించారు. అమెరికా ఇంతకు ముందుకంటే ఎక్కువ శక్తితో మళ్లీ సిద్ధమవుతోందని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

హార్మూజ్ జలసంధిపై అమెరికా నిర్బంధానికి గురువారం నాటికి మూడో రోజు. అనేక వాణిజ్య నౌకలను వెనక్కి మళ్లించగా, ఇరాన్ పోర్టులకు వెళ్లే, వచ్చే సముద్ర రవాణాపై పూర్తిగా నియంత్రణ సాధించామని అమెరికా దళాలు పేర్కొన్నాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టాలని ఈ నిర్బంధాన్ని అమలు చేస‍్తున్నారు.

అంతా గమనిస్తున్నాం: హెగ్‌సెత్‌ 
తాజాగా నిర్వహించిన పెంటగాన్ సమావేశంలో హెగ్‌సెత్‌తో పాటు సంయుక్త సైన్యాధిపతుల కమిటీ చైర్మన్ జనరల్ డాన్ కేన్, అమెరికా సెంట్రల్ కమాండ్ అధిపతి అడ్మిరల్ బ్రాడ్ కూపర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెగ్‌సెత్ మాట్లాడుతూ.. ఇరాన్ సైనిక కదలికలను నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు.

“మీరు ఏ సైనిక వనరులను ఎక్కడికి తరలించారో మాకు తెలుసు” అని ఇరాన్ సైన్యం, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌ను ఉద్దేశించి హెగ్‌సెత్‌ చెప్పారు. ఇరాన్ కీలక శక్తి మౌలిక వసతులు బలహీనంగా ఉన్నాయని అన్నారు. ఇరాన్‌ ఎనర్జీ సెక్టార్‌ను తాము ఇంకా ధ్వంసం చేయలేదని, కానీ అమెరికా అమలు చేస్తున్న నిర్బంధం ఇరాన్‌ ఎగుమతులను నిలిపివేయడంతో చమురు ఆదాయం బాగా తగ్గుతోందని తెలిపారు. అదే సమయంలో ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోందని చెప్పారు.

వ్యూహాత్మక సముద్ర మార్గాలపై దృష్టి సారిస్తూ హార్ముజ్‌లోకి వచ్చే, వెళ్లే రవాణాను అమెరికా నౌకాదళం నియంత్రిస్తోందని తెలిపారు. ఇది తమ మొత్తం నౌకాదళ సామర్థ్యంలో కేవలం 10 శాతంతోనే చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు పరిమితమని, మరింత తీవ్ర చర్యలకు దిగే అవకాశం ఉందని సూచించారు. ఇరాన్‌కు నౌకాదళం, సముద్ర పరిస్థితులపై అవగాహన లేదని, వారు దేన్నీ నియంత్రించలేరని తెలిపారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement