పశ్చిమాసియా యుద్ధంలో తమది శాంతిదూత పాత్ర అని పాకిస్తాన్ మొదటి నుంచి చెబుతోంది. అటు అమెరికా, ఇటు ఇరాన్ మాత్రం కేవలం మధ్యవర్తిగానే చూస్తున్నాయి. ఇజ్రాయెల్ అయితే ఓ అడుగు ముందుకేసి పాక్ పాత్రపై అనుమానాలు సైతం వ్యక్తం చేసింది. ఈ తరుణంలో ఇప్పుడు సంచలన ఆరోపణలు తెరపైకి వచ్చాయి.
యుద్ధంలో ఇరాన్‌కు పాకిస్తాన్ సహాయం చేసిందనేది ప్రధాన ఆరోపణ. ఇందుకోసం తన కీలక ఎయిర్‌బేస్ నూర్ ఖాన్‌ను ఇరాన్ సైనిక విమానాలకు ఉపయోగించుకునే అవకాశం ఇచ్చిందని ఓ సంచలనాత్మక కథనం తెరపైకి వచ్చింది. పైగా అమెరికా అధికారులే ఈ విషయాన్ని వెల్లడించినట్లు సీబీఎస్ న్యూస్ ఓ కథనం ఇచ్చింది. ఆ కథనం ప్రకారం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ ప్రారంభంలో కాల్పుల విరమణ ప్రకటించారు. ఆ తర్వాత ఇరాన్‌కు చెందిన కొన్ని సైనిక విమానాలను పాకిస్తాన్‌లోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ (రావల్పిండి)కి తరలించిందని సమాచారం. వాటిలో ఒకటి RC-130 రికానైసెన్స్ విమానం కూడా ఉందని తెలుస్తోంది. ఈ తరలింపులు అమెరికా దాడుల నుంచి మిగిలిన ఇరాన్ సైనిక ఆస్తులను రక్షించడమే లక్ష్యమని అంచనా వేస్తున్నాం అని అధికారులు వెల్లడించినట్లు సీబీఎస్ న్యూస్ కథనం పేర్కొంది.

ఈ సమాచారం వెలుగులోకి రావడంతో ఇస్లామాబాద్ మధ్యవర్తి పాత్రపై కొత్త ప్రశ్నలు తలెత్తాయి. తాజా నివేదికపై అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహమ్ స్పందించారు. ‘‘ఈ సమాచారం నిజమైతే, పాకిస్తాన్ మధ్యవర్తి పాత్రను మళ్లీ సమీక్షించాల్సి ఉంటుంది’’ అని వ్యాఖ్యానించారు.
ట్రంప్ ఊరుకుంటారా?
ఇప్పటికే ఇరాన్ పంపిన ప్రతిపాదనలను ట్రంప్ తిరస్కరించారు. దీంతో శాంతి చర్చలపై అనిశ్చితి కొనసాగుతోంది. ఈ తరుణంలో ఇరాన్‌కు సాయం తేలిందని ట్రంప్ భావిస్తే పాక్‌కు చిక్కులు తప్పకపోవచ్చనే విశ్లేషణ నడుస్తోంది. ఇరాన్–అమెరికా చర్చల్లో దాని పాత్రను తగ్గించే అవకాశమో లేదంటే ఆంక్షలు విధించడమో చేయొచ్చని భావిస్తున్నారు. పాక్–చైనా సన్నిహిత సంబంధాల కారణంగా.. ట్రంప్ దీనిని వ్యూహాత్మకంగా కూడా పరిశీలించే అవకాశం లేకపోలేదు.
పాక్ వివరణ..
పాకిస్తాన్ అధికారులు మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. నూర్ ఖాన్ బేస్ నగర మధ్యలో ఉంది. అక్కడ పెద్ద సంఖ్యలో విమానాలు నిలిపితే ప్రజల కంటికి దూరంగా ఉంచడం అసాధ్యం అని ఓ సైనికాధికారి సీబీఎస్ న్యూస్‌కు స్పష్టం చేశారు. మరోవైపు.. ఇరాన్ కొన్ని పౌర విమానాలను ఆఫ్ఘానిస్తాన్‌కు తరలించినట్లు కూడా ఆ కథనం పేర్కొంది. తాలిబాన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ఈ వార్తలను కొట్టిపారేశారు. అయితే అఫ్గన్ సివిల్ ఏవియేషన్ అధికారులు మాత్రం ఒక ఇరాన్ సివిలియన్ విమానం (మహాన్ ఎయిర్) కాబూల్‌లో నిలిచిందని.. తర్వాత హెరాత్‌కి తరలించబడిందని చెప్పారు.
వ్యూహాత్మక సమీకరణాలు
ఇరాన్ యుద్ధంలో చైనా కూడా పాక్ తరహాలోనే ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందా? అనే చర్చ జోరందుకుంది. ఒకవైపు చర్చలు జరగాలని అంటూనే.. మరోవైపు ఇరాన్‌తో ఉన్న వర్తక వాణిజ్య సంబంధాల దృష్ట్యా ఆయుధాల్ని సరఫరా చేస్తోందన్న ఆరోపణలను చైనా ఎదుర్కొంటోంది. అయితే.. పాకిస్తాన్ మాత్రం అమెరికాతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూనే.. ఇరాన్–చైనా అనుబంధాన్ని దూరం పెట్టకుండా జాగ్రత్త పడుతోంది.
స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రకారం.. 2020–2024 మధ్య పాకిస్తాన్ ప్రధాన ఆయుధ దిగుమతుల్లో 80% చైనా నుంచే వచ్చాయి. చైనా కూడా పాకిస్తాన్ మధ్యవర్తిత్వాన్ని ప్రశంసించింది. అయితే.. ఇరాన్‌తో మాత్రం సంబంధాలు కొంతకాలంగా చెడిపోతూ వస్తున్నాయి. సరిహద్దు ఉగ్రవాదం, గ్యాస్ పైప్‌లైన్ వివాదాలు, సైనిక ఘర్షణలు ఇరాన్-పాక్ సంబంధాలను దెబ్బతీస్తున్నాయి. అందుకే ఇరాన్ పాక్ మధ్యవర్తిత్వంపై పూర్తి నమ్మకం చూపడం లేదు.
నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ ఆరోపణలు నిజమా కాదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఈ వార్తలు దక్షిణాసియా భూభౌగోళిక రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. పశ్చిమాసియా సంక్షోభంలో పాక్ “శాంతిదూత” ఇమేజ్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
ఇరాన్ యుధ్ధం.. ప్రస్తుత పరిస్థితి
కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ.. దాడులు, ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్ అమెరికా నుంచి యుద్ధ పరిహారం, హర్ముజ్ జలసంధిపై సార్వభౌమాధికార గుర్తింపు, ఆంక్షల తొలగింపు వంటి డిమాండ్లు చేస్తోంది. ట్రంప్ ఈ ప్రతిపాదనలను “అంగీకరించలేనివి” అని తిరస్కరించారు. అణు ఒప్పందానికి దిగి రావాల్సిందేనని హెచ్చరిస్తున్నారు.


