
పాకిస్తాన్ ముఖం మాడిపోయింది
కడిగిపారేసిన యూఎన్ వాచ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
ఐరాస: ప్రపంచ వేదికపై పాకిస్తాన్‌కు మరోసారి తీవ్ర పరాభయం ఎదురైంది. హమాస్ రాజకీయ నాయకత్వమే లక్ష్యంగా ఖతార్‌పై ఇజ్రాయెల్ ఇటీవల చేపట్టిన దాడిపై ఐరాసలో చర్చ సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. మానవ హక్కుల న్యాయవాది, యూఎన్ వాచ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన హిల్లెల్ నోయర్ మాట్లాడుతూ..ఖతార్ ఉగ్రవాదులకు ఆశ్రయం కలి్పస్తోందని ఆరోపించారు.
ఆ దేశం ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోందన్నారు. అమెరికా ఉగ్ర సంస్థగా ప్రకటించిన హమాస్ రాజకీయ కార్యాలయం ఖతార్‌లో 2012 నుంచి కొనసాగుతుండటంపై హిల్లెల్ నోయర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఖతార్‌పై ఇజ్రాయెల్ దాడిని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఖండించడాన్ని సైతం ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. గతంలో 2011లో పాకిస్తాన్‌లోని రహస్య స్థావరంలో ఉంటున్న అల్ ఖాయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా అంతమొందించినప్పుడు ఐరాస అప్పటి చీఫ్ చివరికి న్యాయం జరిగిందంటూ వ్యాఖ్యానించారన్న విషయాన్ని హిల్లెల్ గుర్తు చేశారు.
పాకిస్తాన్, లాడెన్ ప్రస్తావన తేవడంతో ఆ దేశ ప్రతినిధి వెంటనే హిల్లెల్ ప్రసంగానికి అడ్డు తగిలారు. సభ్య దేశాల సార్వ¿ౌమత్వానికి భంగం కలిగించడం ఐరాస సూత్రాలకు విరుద్ధమని వాదించారు. హిల్లెల్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని అభ్యంతరం తెలిపారు. స్పందించిన ఐరాస మానవ హక్కుల కమిటీ చైర్మన్..హిల్లెల్ నోయర్‌కు మైక్‌ను పునరుద్ధరించారు. ప్రసంగం ముగించేందుకు కేవలం నాలుగే సెకన్ల సమయముందని తెల్చి చెప్పారు. దీంతో, ఆ లాయర్ ఆ సమయాన్నే సరిగ్గా వినియోగించుకుంటూ.. మిస్టర్ ప్రెసిడెంట్, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రేరేపించే మరో దేశం’అంటూ ప్రసంగాన్ని ముగించారు.
దీంతో, పాకిస్తాన్ ప్రతినిధి తెల్లబోయి చూస్తుండిపోయారు. ఇలాంటి అనుభవమే పాక్‌కు 2020లోనూ ఎదురైంది. ఫ్రాన్స్‌లో ఉపాధ్యాయుడొకరిని ఇస్లామిక్ ఉగ్రవాది తలనరికి చంపిన ఘటనపై పాకిస్తాన్ ప్రభుత్వం..‘స్వేచ్ఛ పేరుతో దైవ దూషణకు పాల్పడటం సహించరానిది’అంటూ ఎక్స్‌లో వ్యాఖ్యానించింది. దీనిపై జెనీవాకు చెందిన మానవ హక్కుల సంస్థ యూఎన్ వాచ్ దీటుగా ఇలా స్పందించింది... ‘ఐరాస మానవ హక్కుల కౌన్సిల్‌లో మీకు సభ్యత్వం ఇవ్వడం సహించదగిందే’అంటూ బదులిచ్చింది. ఆ సమయంలో పాకిస్తాన్ ఐరాస మానవ హక్కుల కౌన్సిల్‌లో సభ్యురాలిగా ఉండటం గమనార్హం.