అక్కడ ఉల్లి మహా ఘాటు..ధర వింటే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి

Onions Became Luxury In The Philippines - Sakshi

మన దేశంలో ఎప్పుడైన పెట్రోల్‌ ధరలు పెరిగినప్పుడో లేక అనావృష్టి సమయాల్లోనో ధరలు అధికమవుతాయి. అప్పుడే మనకు ఉల్లి ధర ఆకాశన్నంటుతుంది. పైగా అది కూడా మహా అయితే కేజి 30 నుంచి 70 మధ్యలో పెరుగుతుంది. దానికే మనవాళ్లు చేసే హడావిడి అంతా ఇంతకాదు. ఇదే అదనుగా రెస్టారెంట్‌ నుంచి చిన్న కాక హోటల్‌ వరకు రేట్లు పెంచేయడం, ఉల్లి లేని వంటకాలు అందించడం వంటివి చేస్తారు. కానీ ఇక్కడ ఈ దేశంలోని ఉల్లి పాయాల ధర వింటే అమ్మ బాబోయ్‌ అంటారు. కచ్చితంగా కొనేందుకు ముందుకు రావడానికి కూడా జంకుతారు. అందులో ఏ మాత్రం సందేహం లేదు. 

వివరాల్లోకెళ్తే...ఫిలిప్పీన్స్‌లో ఉల్లిపాయాల ధర చాలా ఘోరంగా ఉంటుంది. ఏకంగా కేజీ ఉల్లిపాయాలు సుమారు వెయ్యి రూపాయాలు వరకు పలుకుతోంది.  అక్కడ ప్రస్తుతం ఉల్లి చాలా విలాసవంతమైన వస్తువుగా మారింది. ఇంతకు మునుపు అక్కడ ప్రజలు మూడు నుంచి నాలుగు కేజీల ఉల్లిపాయాలు కొనేవారు. ప్రస్తుతం అక్కడ ఎంతో అవసరం అనుకుంటే గానీ, అదికూడా కేవలం అరకేజీనే కొనుగోలు చేస్తున్నారు ప్రజలు. గత మూడు నెలల నుంచే ఈ దారుణమైన ధర పలుకుతోందని చెబుతున్నారు.

వాస్తవానికి ఫిలిప్పీన్స్‌ వాసులు ఆహారంలో ప్రధానంగా ఉల్లిని విరివిగా ఉపయోగిస్తారు. ఇప్పుడు వారంతా దాని ప్లేస్‌లో మరోదాన్ని జోడించి తినాల్సి వస్తోందని వాపోయారు. ఈ మేరకు అక్కడ వ్యవసాయ కార్యదర్శి ప్రెసిడెంట్ ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ఈ పెరుగతున్న ఆహార ధరల పరిస్థితిని అత్యవసర పరిస్థితిగా పేర్కొన్నారు. ఆయన ఉత్పత్తిని పెంచే దిశగా పలు ప్రత్యామ్నాయ పద్ధతుల కోసం అన్వేషిస్తున్నట్లు తెలిపారు. కొన్ని నెలల క్రితం ఫిలిప్పీన్స్‌ రెండు భారీ తుపాన్‌లను ఎదుర్కొంది. దీంతో అక్కడ ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతింది.

అక్కడ ప్రజలు పెళ్లిళ్లకు ఉపయోగించే డెకరేషన్‌లో ఉల్లిని ఉపయోగించాలని చూస్తున్నారు కొందరూ. ఎందుకంటే ఆ తతంగం తర్వాత ఆ ఉల్లిపాయాలు కొందరూ పేద ప్రజలకు ఉపయోగపడతాయని, అదే పూలు అయితే వాడిపోతాయి ఉపయోగం ఉండదు అనేది వారి ఆలోచన. దీనిని బట్టి అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. పాపం అక్కడి ప్రభుత్వం సైతం ప్రజలకు  భారం తగ్గించేలా...ధరల పెరుగుదలను నియంత్రించటానికి నానా అగచాట్లు పడుతోంది. 

(చదవండి:  పాక్‌లో భూకంపం)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top