
అది కూడా ఒక్కసారి మాత్రమే.. రెన్యూవల్స్‌కు పాత రుసుమే
ఈనెల 21 తర్వాత సమరి్పంచే దరఖాస్తులకే వర్తింపు
ఇప్పటికే వీసాలు ఉన్నవారికి, రెన్యూవల్స్‌కు ఎలాంటి అదనపు రుసుము ఉండదు
వారికి సాధారణ చార్జీలే వర్తిస్తాయి
వీసాదారులు నిక్షేపంగా స్వదేశాలకు వెళ్లిరావొచ్చు
హెచ్–1బీ వీసాలపై యూఎస్ సిటిజెన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ వివరణ
వాషింగ్టన్: విదేశీ వృత్తి నిపుణులు అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగాలు చేసుకోవడానికి వీలు కల్పించే హెచ్–1బీ వీసా దరఖాస్తు రుసుమును ఏకంగా లక్ష డాలర్లకు పెంచేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై రకరకాల సందేహాలు తలెత్తాయి. కొత్త దరఖాస్తులకేనా? లేక వీసాల పునరుద్ధరణకు కూడా ఈ రుసుము వర్తిస్తుందా? దరఖాస్తు చేసిన ప్రతిసారీ లక్ష డాలర్లు చెల్లించాలా? అనే అనుమానాలు విదేశీ ఉద్యోగుల్లో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తాజాగా స్పష్టతనిచ్చింది. హెచ్–1బీ వీసాలతో ఇప్పటికే అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నవారికి భారీ ఊరట కల్పించింది. కొత్త దరఖాస్తులకు మాత్రమే లక్ష డాలర్ల రుసుము వసూలు చేయనున్నట్లు తెలియజేసింది. అది కూడా ఒక్కసారి మాత్రమేనని, వారు వీసా రెన్యూవల్ చేసుకుంటే పాత రుసుములే వర్తిస్తాయని వెల్లడించింది. అంతేకాకుండా ప్రస్తుతం హెచ్–1బీ వీసాలు కలిగి ఉన్నవారిపై ఎలాంటి ప్రభావం ఉండబోదని పేర్కొంది. వారు వీసా రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ లక్ష డాలర్లు చెల్లించాల్సి అవసరం లేదని, పాత రుసుములే వర్తిస్తాయని వివరించింది.
ఈ మేరకు యూఎస్ సిటిజెన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్) శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. హెచ్–1బీ వీసా కోసం తొలిసారిగా దరఖాస్తు చేసేవారు మాత్రమే లక్ష డాలర్లు చెల్లించాలని తెలియజేసింది. ఈ నెల 21వ తేదీ కంటే ముందు సమర్పించిన వీసా దరఖాస్తులపై ఎలాంటి ప్రభావం ఉండబోదని, లక్ష డాలర్ల ఫీజు వారికి వర్తించదని వెల్లడించింది. 21వ తేదీ తర్వాత సమరి్పంచే దరఖాస్తులకు మాత్రమే లక్ష డాలర్లు చెల్లించాలని సూచించింది. ప్రస్తుతం అమెరికా బయట ఉన్న హెచ్–1బీ వీసాదారులు మళ్లీ తమ దేశంలోకి రావడానికి కొత్తగా వీసా ఫీజు చెల్లించాల్సి అవసరం లేదని స్పష్టంచేసింది.
దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికే భారీ రుసుము
లక్ష డాలర్ల ఫీజు అనేది వన్–టైమ్ చార్జీ మాత్రమేనని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి టేలర్ రోజర్స్ తెలిపారు. కొత్త దరఖాస్తులకే ఇది వర్తిసుందని పేర్కొన్నారు. లక్ష డాలర్లు చెల్లించి పొందిన హెచ్–1బీ వీసాను రెన్యూవల్ చేసుకోవడానికి మళ్లీ లక్ష డాలర్లు చెల్లించాల్సిన పనిలేదని, పాత చార్జీలు చెల్లిస్తే సరిపోతుందని వివరించారు. ఇప్పటికే హెచ్–1బీ వీసాలు పొందినవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వీసా రెన్యూవల్‌పై వారిపై అదనంగా ఎలాంటి భారం పడబోదని తేల్చిచెప్పారు.
2025లో లాటరీలో హెచ్–1బీ వీసాలు పొందినవారిపై భారమేమీ ఉండదన్నారు. త్వరలో జరగబోయే లాటరీలో పాల్గొని, మొట్టమొదటిసారిగా వీసాలు పొందేవారు లక్ష డాలర్లు చెల్లించక తప్పదని వివరణ ఇచ్చారు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల్లో స్థానిక అమెరికన్లకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానమని గుర్తుచేశారు. విదేశీయులను విచ్చలవిడిగా నియమించుకోకుండా అమెరికా కంపెనీలను నిరుత్సాహపర్చాలన్నదే ఆయన ఉద్దేశమని పేర్కొన్నారు.
అత్యధిక ప్రతిభాపాటవాలు కలిగిన ఉద్యోగులే ఉద్యోగాల్లో చేరితే తమ దేశానికి లబ్ధి కలుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. హెచ్–1బీ వీసా కార్యక్రమం దుర్వినియోగం అవుతోందని, దీనికి అడ్డుకట్ట వేసే దిశగానే కొత్త దరఖాస్తులపై లక్ష డాలర్ల రుసుము విధించినట్లు స్పష్టంచేశారు. ఈ నెల 21 కంటే ముందు హెచ్–1బీ వీసా దరఖాస్తులు సమరి్పంచినవారు, అవి ఆమోదం పొందినవారు లక్ష డాలర్లు చెల్లించనక్కర్లేదని యూఎస్‌సీఐఎస్ డైరెక్టర్ జోసెఫ్ ఎడ్‌లో వెల్లడించారు. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లెవిట్ సైతం స్పందించారు. ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
హెచ్–1బీ నాన్–ఇమ్మిగ్రెంట్ వీసాల విషయంలో లక్ష డాలర్లు అనేది వార్షిక రుసుము కాదని, వన్–టైమ్ ఫీజు మాత్రమేనని ఉద్ఘాటించారు. ఈ వీసా కోసం ప్రతిఏటా లక్ష డాలర్లు కట్టాల్సిన పని లేదని, మొదటిసారి చెల్లిస్తే సరిపోతుందని, ఆ తర్వాత సాధారణ చార్జీలే వర్తిస్తాయని తెలియజేశారు. ఇప్పటికే హెచ్–1బీ వీసాదారులు ఉన్నవారు ఎప్పటిలాగే నిక్షేపంగా వారి స్వదేశానికి వెళ్లి రావొచ్చని సూచించారు. ఇదిలా ఉండగా, వీసా రుసుములపై అమెరికా ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో భారతీయ ఐటీ నిపుణులు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. సంబంధిత ఉత్తర్వుపై అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేసిన తర్వాత వారు ఆందోళనకు గురైన సంగతి తెలిసిందే.