తగ్గినట్లే తగ్గి.. ట్విస్ట్‌ ఇచ్చిన నెతన్యాహు | Netanyahu Big Twist Over Lebanon Ceasefire | Sakshi
Sakshi News home page

తగ్గినట్లే తగ్గి.. ట్విస్ట్‌ ఇచ్చిన నెతన్యాహు

Apr 10 2026 6:53 AM | Updated on Apr 10 2026 10:46 AM

Netanyahu Big Twist Over Lebanon Ceasefire

పశ్చిమాసియా యుద్ధంలో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. లెబనాన్‌పై దాడుల విషయంలో తగ్గినట్లే కనిపించిన ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు.. ఆ వెంటనే ‘తూచ్‌’ అనేశారు. ఓవైపు శాంతి చర్చలకు సిద్ధమంటూనే.. మరోవైపు దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. 

లెబనాన్‌తో ప్రత్యక్ష చర్చలకు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ఎట్టకేలకు అంగీకరించారు. వీలైనంత త్వరగా చర్చలు ప్రారంభించాలని సంబంధిత కేబినెట్‌ అధికారులకు సూచించారాయన. అదే సమయంలో.. లెబనాన్‌ విషయంలో కాల్పుల విరమణ అనేది ఉండబోదని కుండబద్ధలు కొట్టారు. హెజ్బోల్లా సంస్థను నామ రూపాలు లేకుండా చేసేంత వరకు ఐడీఎఫ్‌(ఇజ్రాయెల్‌ సైన్యం) సైనిక చర్య కొనసాగుతుందని పేర్కొన్నారాయన. 

‘‘అందరికీ ఒక్కటే చెప్పదల్చుకున్నా. లెబనాన్‌ విషయంలో కాల్పుల విరమణ అనేది ఉండబోదు. హెజ్బోల్లాపై మా శాయశక్తులు దాడులు కొనసాగిస్తాం. శాంతిని నెలకొల్పుతాం’’ అని ప్రకటించారు. 

లెబనాన్‌ నుంచి పదే పదే విజ్ఞప్తులు రావడంతోనే శాంతి చర్చలకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన నెతన్యాహు.. రెండు లక్ష్యాలను తమ ముందు పెట్టుకున్నామని చెప్పారు. ఒకటోది.. హెజ్బోల్లాకు ఆయుధాలు అందకుండా చేసి ఆ గ్రూప్‌ను అంతమొందించడం, రెండోది లెబనాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య శాశ్వతంగా శాంతి పరిస్థితులు నెలకొల్పడం అని ప్రకటించారు. 

రెండు వారాల యుద్ధ విరమణకు అమెరికా-ఇరాన్‌ ముందుకు వచ్చినప్పటికీ.. ఇజ్రాయెల్‌ మాత్రం లెబనాన్‌పై భీకర దాడులకు దిగింది. ఈ దాడుల్లో సుమారు 300 మంది మరణించారు. ఈ పరిణామంపై ఇరాన్‌ భగ్గుమంది. ఇది ఇస్లామాబాద్‌(పాక్‌) వేదికగా జరగబోయే శాంతి చర్చలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని చెబుతూ.. హర్ముజ్‌ను మళ్లీ మూసేసింది. లెబనాన్‌పై దాడులు కొనసాగితే.. తాము తిరిగి యుద్ధం ప్రారంభిస్తామని బెదిరించింది కూడా. అయితే కాల్పుల విరమణ అనేది లెబనాన్‌కు వర్తించబోదని అటు అమెరికా, ఇటు ఇజ్రాయెల్‌లు చెబుతున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో అమెరికా వేదికగా.. లెబనాన్‌-ఇజ్రాయెల్‌ శాంతి చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement