కఠ్మాండూ: నేపాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత(జెన్-జీ) చేపట్టిన ఆందోళనల్లో దహనమైన కార్లను ఇప్పుడు ప్రభుత్వం తుక్కు కింద జమకట్టి.. కిలోల్లా అమ్మేస్తోంది. ఆగస్టు నెలలో జెన్-జీ ఉద్యమం తారాస్థాయికి చేరుకోవడంతో యువత పార్లమెంట్ భవనం, సుప్రీంకోర్టు, ప్రభుత్వ అధినేతల ఇళ్లు, రోడ్లపై పార్క్ చేసిన వాహనాలను దహనం చేసిన విషయం తెలిసిందే..! ఆందోళనలతో దెబ్బతిన్న వాహనాలను ఇప్పుడు తుక్కు కింద అమ్మడం తప్పితే.. ఎలాంటి ఉపయోగం ఉండదని, వాటి శకలాలను పార్లమెంట్, ఇతర ప్రభుత్వ భవనాల ఆవరణలో పెట్టడం వల్ల స్థలాభావం తప్పదని ప్రభుత్వ ఇంజనీర్లు పేర్కొన్నారు.
కిలోకు రూ.45 రూపాయలు
అగ్నికి ఆహుతైన వాహనాల నుంచి ఇనుమును వేరు చేసే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఇంజన్లు సక్రమంగా ఉన్న వాహనాలను వేలం వేయాలని నిర్ణయించింది. అయితే.. ఎందుకూ పనికిరాకుండా ఉన్న వాహనాల నుంచి సేకరించిన ఇనుమును తుక్కుగా అమ్మేయడానికి రంగం సిద్ధం చేసింది. బన్వేశ్వర్‌లో నిర్ణయించిన వేలంలో ఓ స్క్రాప్ వ్యాపారి కిలోకు రూ.45 చొప్పున చెల్లించి, కార్ల తుక్కును కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
తొలి దశలో ఈ వాహనాల వేలం..
తొలి దశలో సింఘా దర్భార్ వద్ద ఉన్న 145 కార్లు, 256 ద్విచక్ర వాహనాలు, రెండు బస్సుల స్క్రాప్‌ను వేలం వేయాలని నిర్ణయించినట్లు పట్టణాభివృద్ధి శాఖ సెక్షన్ ఆఫీసర్ కేశవ్ శర్మ మీడియాకు తెలిపారు. ప్రధాని కార్యాలయం, అధికారిక నివాసం సహా.. 22 చోట్ల వాహనాల శకలాలు పడి ఉన్నాయని ఆయన చెప్పారు. వాటన్నింటినీ దశల వారీగా వేలం వేస్తామని పేర్కొన్నారు. పార్లమెంట్ ప్రాంగణంలో 500 వాహనాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, మునిసిపల్ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ల వద్ద దహనమైన కార్లు, వాహనాల తుక్కును తదుపరి దశలో వేలం వేయాల్సి ఉందని వివరించారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకే తుక్కుగా కార్ల విక్రయం ప్రారంభమైందన్నారు.


