
సైజ్‌లో కుతుబ్‌మినార్ కంటే పెద్దది
భూమికి సమీపంగా వెళ్లనున్న ఆస్టరాయిడ్
నిశితంగా గమనించనున్న ఖగోళ శాస్త్రవేత్తలు
వాషింగ్టన్: మరో ఖగోళ అద్భుతానికి అంతరిక్షం వేదికకానుంది. ఈ నెలలోనే త్వరలో ఒక గ్రహశకలం సమీపంగా వచ్చి మన పుడమిని పలకరించి వెళ్లనుంది. 2025 ఎఫ్‌ఏ22 పేరున్న ఈ గ్రహశకలం పథాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ‘నియర్ ఎర్త్ అబ్జెక్ట్ స్టడీస్’ కేంద్రం నుంచి పరిశీలిస్తోంది. దీంతో పాటు అమెరికాలోని క్రిసెంటీ వ్యాలీలోని జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ నుంచీ సైతం దీని గమనాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు నిశితంగా గమనిస్తున్నారు.
సెప్టెంబర్ 18వ తేదీ ఉదయం 8.33 గంటలకు భూమికి అత్యంత చేరువగా ఇది పయనించనుందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఆ సమయంలో ఇది కేవలం 8,41,988 కిలోమీటర్ల దూరం నుంచి దూసుకు పోనుంది. భూమికి ఇంత దగ్గరగా వెళ్తుండటంతో ఖగోళ శాస్త్ర వేత్తలు, అంతరిక్ష ఔత్సాహికుల్లో ఆసక్తి రెట్టింపైంది. అత్యంత శక్తివంతమైన రాడార్లు, ఆప్టికల్ టెలిస్కోప్‌ల సాయంతో దీనిని వీక్షించేందుకు ఉబలాటపడు తున్నారు.
ఈ గ్రహ శకలం చుట్టుకొలత 163.88 మీటర్లు. పొడవు 280 మీటర్లు. అంటే ఇది ఢిల్లీలోని ప్రఖ్యాత కుతుబ్ మినార్ కంటే పెద్దది. ఇది 1.85 సంవత్సరాల్లో మన సూర్యుడిని ఒక చుట్టు చుట్టేస్తోంది. భూమికి అత్యంత సమీపంగా దూసుకుపోతున్నప్పటికీ గురు త్వాక ర్షణ ప్రభావ పరిధిలో ఇది లేదు. ఈ గ్రహశకలాన్ని ఈ ఏడాది తొలి నాళ్లలో తొలిసారిగా గుర్తించింది. హవాయీలోని పనోరమిక్ సర్వే టెలిస్కోప్, ర్యాపిడ్ రెస్పాన్స్ సిస్టమ్(పాన్–స్టార్2) ఈ గ్రహశ కలాన్ని మార్చి 29వ తేదీన గుర్తించింది. 2173 సెప్టెంబర్ 21వ తేదీన ఇది భూమికి అత్యంత చేరువగా వచ్చే ప్రమాదముంది.