వ్యోమగాములకు చంద్ర వాహనం  | NASA plans to build a permanent Moon base with robots and rovers | Sakshi
Sakshi News home page

వ్యోమగాములకు చంద్ర వాహనం 

May 28 2026 2:46 AM | Updated on May 28 2026 2:46 AM

NASA plans to build a permanent Moon base with robots and rovers

చందమామపై సులభంగా ప్రయాణించడానికి నాసా ఏర్పాట్లు  

‘సీఎల్‌వీ–1’వాహనాన్ని తయారు చేయనున్న ఆస్ట్రోలాబ్‌  

2028 నాటికి సాసాకు అందజేసే అవకాశం  

వాహనం డిజైన్‌ చిత్రాలను విడుదల చేసిన నాసా  

వాషింగ్టన్‌:  చందమామపై మానవుడు అడుగుపెట్టి దశాబ్దాలు గడిచిపోయాయి. ఎన్నో దేశాలు రోవర్లను పంపించాయి. ఆ ఉపగ్రహం రహస్యాలు ఛేదించడానికి నిరంతరం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. చంద్రుడి ఉపరితలంపై వ్యోమగాముల కోసం శాశ్వత ఆవాసం నిర్మించాలని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’నిర్ణయించింది. ఇందుకోసం ఒక రోడ్‌మ్యాప్‌ సిద్ధంచేసింది. 

చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద మానవుల నివాసానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని గుర్తించారు. ఎందుకంటే అక్కడ దాదాపు నిరంతరంగా సూర్యరశ్మి లభిస్తుంది. మంచు రూపంలో నీటి నిల్వలు ఉన్నాయి. మనుషులు అక్కడే దీర్ఘకాలం ఉంటూ తమ పరిశోధనలు సాగించవచ్చు. తొలుత చందమామపై స్థావరాలు ఏర్పాటు చేసుకొని, అక్కడి నుంచి భవిష్యత్తులో అంగారక గ్రహానికి మానవ సహిత యాత్రలు చేయాలన్నది నాసా ప్రణాళిక. కఠినమైన రాళ్లు రప్పలు, దుమ్ముధూళి, తీవ్రమైన వేడి, చలితో కూడిన చంద్రుడి ఉపరితలంపై తిరగడం అనుకున్నంత సులభం కాదు. 

ఒకటి ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించాల్సి ఉంటుంది. బరువైన యంత్రాలు, సామగ్రిని కూడా మోసుకెళ్లాలి. ఈ సమస్య పరిష్కారంపై నాసా దృష్టి పెట్టింది. లూనార్‌ టెరైన్‌ వెహికల్‌ సర్వీసెస్‌(ఎల్‌టీవీఎస్‌) కార్యక్రమంలో భాగంగా మానవ సహిత రోవర్లను నిర్మించడానికి కాలిఫోర్నియాకు చెందిన ఆస్ట్రోలాబ్‌ సంస్థను ఎంపిక చేసింది. చందమామపై వ్యోమగాములు సులభంగా తిరగడానికి వీలుగా వాహనాలు తయారు చేసి ఇవ్వాలని సూచించింది. ఈ కాంట్రాక్ట్‌ విలువ 219 మిలియన్‌ డాలర్లు. చంద్రుడి ఉపరితలంపై ప్రయాణించడానికి ‘సీఎల్‌వీ–1’వాహనాన్ని ఆస్ట్రోలాబ్‌ సంస్థ నిర్మించి 2028 నాటికి నాసాకు అందజేసే అవకాశం ఉంది.  

ఏమిటీ చంద్ర వాహనం?  
ఆస్ట్రోల్యాబ్‌ మొదట్లో ఫ్లెక్స్‌ అనే రోవర్‌ను తయారు చేసింది. ఇది సరుకు రవాణా, శాస్త్రీయ పరిశోధనలు, సాధారణ పనుల కోసం తోడ్పడుతుంది. కానీ, ఇది తమ అవసరాలకు సరిపోదని సానా తేల్చిచెప్పింది. అందుకే ఫ్లెక్స్‌ రోవర్‌లో భారీ మార్పులు చేశారు. సీఎల్‌వీ–1గా డిజైన్‌ చేశారు. ఇది కేవలం సామగ్రి రవాణా చేయడానికి కాకుండా.. ప్రధానంగా సూట్లు ధరించిన ఇద్దరు వ్యోమగాములను, వారి పరికరాలను రవాణా చేయడానికి వీలుగా మార్చారు. చంద్రుడి ఉపరితలంపై శాశ్వత స్థావరం నిర్మాణానికి, సిబ్బందిని ఒకచోటు నుంచి మరో చోటుకు చేరవేయడానికి సీఎల్‌వీ–1 చక్కగా తోడ్పడుతుందని నాసా అధికారులు వెల్లడించారు.

 ఈ వాహనం చిత్రాలను తాజాగా నాసా విడుదల చేసింది. ఇది నాలుగు చక్రాలతో కూడిన కారులాంటి వాహనం. స్పేస్‌ సూట్లు ధరించిన ఇద్దరు వ్యోమగాములు సులభంగా ఎక్కడానికి, దిగడానికి అనుకూలంగా డిజైన్‌ రూపొందించారు. గాలి లేని టైర్లు ఉంటాయి. చందమామపై వదులుగా ఉన్న నేలపై ఇవి బలమైన పట్టును అందిస్తాయి. కొంత వాలుగా ఉన్న ప్రాంతాలను, రాతి అడ్డంకులను అధిగమించడంలో సహాయపడతాయి. ఆస్ట్రోలాబ్‌ సంస్థ వెంటూరీ స్పేస్‌ అనే సంస్థతో కలిసి ఈ చంద్ర వాహనాలను అభివృద్ధి చేస్తోంది.  

గరిష్ట వేగం గంటకు 9 కిలోమీటర్లు  
అపోలో లూనార్‌ రోవింగ్‌ వెహికల్‌ను స్ఫూర్తిగా తీసుకొని మొదట రోవర్‌ను తయారుచేశారు. కానీ, ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా మరింత సమర్థవంతంగా పనిచేసేలా మార్పులు చేశారు. సీఎల్‌వీ–1 సమతల భాగంపై గంటకు 9 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించగలదు. నిటారైన వాలులను అధిగమించగల సామర్థ్యం కలిగి ఉంది. 

ఇది వ్యోమగాములు చందమామ ఉపరితలంపై ఇంతకుముందు చేరుకోలేని లోతైన బిలాలను, నీడ ఉన్న ప్రాంతాలను, శాస్త్రీయంగా ఆసక్తికరమైన ప్రదేశాలను అన్వేషించడానికి వీలు కల్పిస్తుంది. చంద్రుడిపై శాశ్వత నివాసం, అక్కడి నుంచే పరిశోధనలు చేయడం అనేది దశాబ్దాలుగా ఒక కలగానే మిగిలిపోయింది. అది వాస్తవరూపం దాల్చే సమయం వచ్చింది. ఈ కీలకమైన మిషన్‌లో సీఎల్‌వీ–1 ఒక ముఖ్యమైన భాగమని చెబుతున్నారు. మనం భూమిపై ఇంటి నుంచి ఆఫీసుకు కారులో వెళ్లినంత సులభంగా చందమామపై ఇల్లు నిర్మించుకొని, కారులో షికారు చేసే రోజు రాబోతోందని పరిశోధకులు అంటున్నారు.

శాశ్వత ఆవాసానికిమూడు మిషన్లు  
ఈ ఏడాది ఏప్రిల్‌లో చేపట్టిన ఆర్టిమిస్‌–2 ప్రయోగం విజయవంతం కావడంతో చంద్రుడిపై మరిన్ని ప్రయోగాలకు నాసా ఉత్సాహంగా సిద్ధమవుతోంది. చంద్రుడిపై శాశ్వత ఆవాస నిర్మాణం కోసం మూడు మిషన్లను ప్రకటించింది. నాసా ప్రతినిధి జేర్డ్‌ ఐజాక్‌మాన్‌ మంగళవారం మీడియాతో మాట్లాడారు. చందమామపై పర్మినెంట్‌ బేస్‌ నిర్మాణానికి 20 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేయబోతున్నట్లు తెలిపారు. ఇందులో లూనార్‌ రోవర్లు, డ్రోన్లు ఉంటాయన్నారు.‘‘అమెరికా మళ్లీ చంద్రుడిపైకి తిరిగి వెళ్తోంది. 

మూన్‌ బేస్‌ అనేది ఖగోళ ప్రపంచంలో అమెరికాకు, మానవాళికి మొట్టమొదటి శాశ్వత స్థారం అవుతుంది’’అని వెల్లడించారు. 2028లో చంద్రుడిపైకి వ్యోమగాములను పంపించాలని నాసా లక్ష్యంగా పెట్టుకుంది. మూడు మిషన్లలో భాగంగా చంద్రుడిపై ఆవాసం నిర్మాణానికి మొదట ఈ ఏడాది, వచ్చే ఏడాది కొన్ని ల్యాండర్ల ద్వారా సామాగ్రిని, పరికరాలను పంపిస్తారు. 2029 నుంచి 2032 వరకు రెండో దశలో విద్యుత్‌ గ్రిడ్‌తో సహా శాశ్వత నివాసాన్ని చంద్రుడిపై నిర్మించడం ప్రారంభిస్తారు. 2032 నుంచి ప్రారంభమయ్యే మూడో దశలో అక్కడ కార్యకలాపాలు మొదలవుతాయి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement