హర్మూజ్‌పై ఇరాన్‌ సుప్రీం లీడర్‌ సంచలన ప్రకటన | Moving To New Stage In Managing Strait Of Hormuz: Mojtaba Khamenei | Sakshi
Sakshi News home page

హర్మూజ్‌పై ఇరాన్‌ సుప్రీం లీడర్‌ సంచలన ప్రకటన

Apr 10 2026 8:29 AM | Updated on Apr 10 2026 11:06 AM

Moving To New Stage In Managing Strait Of Hormuz: Mojtaba Khamenei

టెహ్రాన్: హర్మూజ్‌ నిర్వహణను కొత్త దశలోకి తీసుకువెళ్తామంటూ ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో ఇప్పటివరకు మేమే విజయం సాధించాం. ఇరాన్‌ యుద్ధాన్ని కోరుకోవడం లేదు. అలాగని మా హక్కులను వదులుకోం. అలీ ఖమేనీతో పాటు ఇరాన్‌ అమరవీరుల కోసం ప్రతీకారం తీర్చుకుంటాం’’ అని ప్రభుత్వ మీడియా ద్వారా ఆయన హెచ్చరించారు.

హోర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ తన వ్యూహాన్ని మార్చుకోబోతోందని మొజ్తబా ఖమేనీ సంకేతాలు ఇచ్చారు. ప్రపంచంలోని అత్యంత కీలకమైన జలమార్గాలలో ఒకటైన హోర్ముజ్ నిర్వహణలో ఇది ఒక ముఖ్యమైన అధ్యాయంగా ఆయన అభివర్ణించారు. అలాగే తమకు జరిగిన నష్టాలకు పరిహారం కోరాలని టెహ్రాన్ భావిస్తోందని కూడా స్పష్టం చేశారు.

కాగా, హర్మూజ్‌ జలసంధిలో నౌకలపై ఇరాన్‌ ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయితే, కాస్తంత మెత్తబడిన ఇరాన్‌.. అంతర్జాతీయ సరుకు రవాణా నౌకలు హార్మూజ్‌ గుండా వెళ్లేందుకు తాత్కాలికంగా అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. రోజుకు 15 నౌకలను మాత్రమే అనుమతిస్తామన్న ఇరాన్‌.. పన్నులు కట్టిన నౌకలను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఇరాన్‌ తీరును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ఇరాన్‌ తప్పుడు నిర్ణయాలు తీసుకుందంటూ ట్రంప్‌ పోస్ట్‌ చేశారు. ‘‘ఇరాన్‌ చర్య అగౌరవమైనది. మన మధ్య ఉన్న ఒప్పందం ఇదికాదు. ఇరాన్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి’’ ట్రంప్‌ హెచ్చరించారు.

ఇదిలా ఉండగా.. యుద్ధంవేళ అనుమతిలేకుండా హార్మూజ్‌ గుండా వెళ్లే నౌకలను నాశనంచేసేందుకు పర్షియన్‌ గల్ఫ్‌ జలాల్లో అమర్చిన సముద్ర మందుపాతరల జాడను వెల్లడిస్తూ ఇరాన్‌ తాజాగా ఒక చిత్రపటాన్ని విడుదల చేసింది. నలుపు, తెలుపురంగుల్లో ఉన్న ఈ చిత్రపటంలో పేర్కొన్న వృత్తాకార ప్రాంతం(డేంజర్‌ జోన్‌) నుంచి కాకుండా కాస్తంత దూరంగా జరిగి నౌకలు రాకపోకలు సాగించాలని ఇరాన్‌ ప్రకటించింది.

చార్జ్‌ ప్రకారం చూస్తే సీమైన్స్‌ను ఇరాన్‌ తీరంవైపు కాకుండా ఆవలివైపునకు అత్యధికంగా అమర్చినట్లు స్పష్టమవుతోంది. ఇరాన్‌ తీరం వెంబడి దాడుల నుంచి తప్పించుకునేందుకు తీరానికి దూరంగా నౌకలు వెళ్తాయని ముందే ఊహించి, వాటి రాకపోకలను అడ్డుకునేందుకే ఇరాన్‌ ఇలాంటి ఎత్తుగడ వేసిందని స్పష్టమవుతోంది.

 

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement