
నిరసనలతో దద్దరిల్లిన అమెరికా
దేశవ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు
లక్షలాదిగా రోడ్లపైకి ఆందోళనకారులు
ట్రంప్ వ్యతిరేక నినాదాల హోరు
ఫిలడెల్ఫియా: ట్రంప్ సర్కారు వలస వ్యతిరేక చర్యలపై అమెరికావ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ఆందోళనలు క్రమంగా దేశమంతటికీ విస్తరిస్తున్నాయి. శనివారం దేశవ్యాప్తంగా వందలాది చోట్ల నిరసన కార్యక్రమాల్లో లక్షలాదిగా ప్రజలు పాల్గొన్నారు. న్యూయార్క్, టెక్సాస్, మిసిసిపి, పోర్ట్‌లాండ్, మిన్నెసొటా, నార్త్ కరొలినా తదితర ప్రాంతాలు ఆందోళనలతో అట్టుడికిపోయాయి.
వీధులు, పార్కు లు, ప్లాజాలు... ఇలా అన్ని చోట్లా జనం నిరసనలకు దిగారు. ట్రంప్ నియంతృత్వ పోకడలను దుయ్యబట్టారు. ‘నో కింగ్స్ (నియంతృత్వం వద్దు)’ అంటూ నినదించారు. ప్రజాస్వామ్యా న్ని, వలసదారుల హక్కు లను కాపాడుకుంటామని ప్రతినబూనారు. ప్రభుత్వం దిగొచ్చేదాకా ఆందోళనలు ఆగబోవని ‘నో కింగ్స్ కోయెలిషన్’ నిర్వాహకులు తెలిపారు. ప్రజలు హింసాత్మక ఘటనలకు పాల్పడవద్దని రాష్ట్రాల గవర్నర్లు కోరారు. పలు ప్రాంతాల్లో నేషనల్ గార్డులను మోహరించారు. ఫెడరల్ ఇమిగ్రేషన్ అధికారుల దాడులకు నిరసన్ఛఠి వారం క్రితం లాస్‌ఏంజెలెస్‌లో మొదలైన నిరసనలు హింసాత్మక రూపం దాల్చడం తెల్సిందే.
రగడ, ఉద్రిక్తతలు
శనివారం లాస్‌ఏంజెలెస్‌లో ర్యాలీలో పాల్గొన్న నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. పోర్ట్‌ల్యాండ్‌లో ఇమిగ్రేషన్ కార్యాలయం వద్ద టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఉటాహ్‌లోని సాల్ట్‌లేక్ సిటీలో ర్యాలీలో కాల్పుల్లో ఒకరు గాయపడ్డారు. వర్జీనియాలో నిరసనకారులపై వాహనం నడిపి ఒకరిని గాయపరిచిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆర్మీ డే, ట్రంప్ బర్త్ డే!
అమెరికా ఆందోళనలతో అట్టుకుతుంటే ట్రంప్ మాత్రం ఆర్మీ 250వ అవతరణ దినోత్సవాల్లో పాల్గొన్నారు. శనివారం ఆయన 79వ పుట్టినరోజు కావడం విశేషం. ఈ సందర్భంగా ఏకంగా 4.5 కోట్ల డాలర్ల వ్యయంతో వాషింగ్టన్‌లో అట్టహాసంగా జరిగిన సైనిక పరేడ్‌లో భార్య మెలానియాతో కలిసి ఆయన పాల్గొన్నా రు. ఉక్రెయిన్‌కు అందజేసిన అత్యాధునిక సైనిక సంపత్తిని ఈ సందర్భంగా ప్రదర్శించారు.
పరేడ్ మార్గంపై 9 అపాచీ హెలికాప్టర్లు జనానికి కనువిందు చేశాయి. ‘‘అమెరికా కంటే సాహసోపేతమైన సైన్యం భూ ప్రపంచంలోనే లేదు. మమ్మల్ని బెదిరించాలని చూసేవారికి హెచ్చరిక. మా సైన్యం మీ అంతు చూస్తుంది. దుర్మార్గ దేశాల గుండెల్లో బాయ్‌నెట్లు గుచ్చుతుంది’’ అని ట్రంప్ హెచ్చరించారు.
మెక్సికో జెండాలు
న్యూయార్క్, డెన్వర్, షికాగో, ఆస్టిన్, లాస్‌ఏంజెలెస్ నగరాల్లో జనం ‘నో కింగ్స్’ బ్యానర్లు, మెక్సికో జెండాలు చేబూనారు. సియాటెల్‌లో జరిగిన అతిపెద్ద ర్యాలీలో 70 వేల మందికి పైగా పాల్గొన్నట్లు నిర్వాహకులు చెప్పారు. అట్లాంటా ర్యాలీకి 5 వేల మంది వచ్చారు. మిన్నెసొటాలో మాత్రం తగు కారణం లేకుండా నిరసనల్లో పాల్గొవద్దని గవర్నర్ టిమ్ వాల్జ్‌తోపాటు భద్రతాధికారులు ప్రజలను కోరారు. అయినా స్టేట్ కాపిటల్ భవన సముదాయం సహా పలుచోట్ల నిరసనలు జరిగాయి. నార్త్ కరొలినాలో ‘నో కింగ్స్. నో క్రౌన్స్. వియ్ విల్ నాట్ బౌ డౌన్’ అంటూ నినదించారు. ‘ట్రంప్ మస్ట్ గో నౌ’ అనే బ్యానర్‌ను ప్రదర్శించారు.