దాదాపు మూడు నెలలుగా ప్రపంచాన్ని వణికించిన అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు ఇప్పుడు కీలక దశకు చేరుకున్నాయి. అయితే కాల్పుల తీవ్రత కొంత తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.
“డీల్ కోసం తొందరపడొద్దు.. సమయం మాకే అనుకూలంగా ఉంది” అంటూ ట్రంప్ చెప్పడం వెనుక అసలు వ్యూహం ఏంటనేది అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ట్రంప్ చేసిన ఆ ఒక్క వ్యాఖ్యతో మళ్లీ ప్రపంచ మార్కెట్లు, చమురు దేశాలు, దౌత్య వర్గాల్లో టెన్షన్ మొదలైంది.
ట్రంప్ వ్యాఖ్యలను పరిశీలిస్తే.. అమెరికా ఇప్పుడు కేవలం యుద్ధాన్ని ఆపడం మాత్రమే కాదు. ఇరాన్‌పై దీర్ఘకాల వ్యూహాత్మక ఒత్తిడి కొనసాగిస్తూ భారీ రాజకీయ-ఆర్థిక ఒప్పందాన్ని సాధించాలని చూస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమంపై పూర్తి నియంత్రణ, హర్ముజ్ జలసంధిలో స్వేచ్ఛాయుత నౌకా రవాణా, మధ్యప్రాచ్యంలో అమెరికా ప్రభావాన్ని మరింత బలపరచడం వంటి లక్ష్యాలతో వాషింగ్టన్ ముందుకెళ్తోందని నిపుణులు చెబుతున్నారు. అయితే అసలు ప్రశ్న ఇప్పుడు ఒక్కటే.. ఇరాన్ ట్రంప్ ప్రతిపాదనలకు ఒప్పుకుందా?..
ప్రస్తుతం అందుతున్న సంకేతాల ప్రకారం సమాధానం “పాక్షికంగానే” ఒప్పుకుంది. చర్చలకు సిద్ధమని టెహ్రాన్ వర్గాలు చెబుతున్నా.. అమెరికా షరతులకు పూర్తిగా గ్రీన్‌సిగ్నల్ మాత్రం ఇవ్వలేదు. ముఖ్యంగా అణు కార్యక్రమాన్ని పూర్తిగా పరిమితం చేయడం, యురేనియం నిల్వలను తగ్గించడం, అంతర్జాతీయ అణు సంస్థ (IAEA) తనిఖీలకు పూర్తి అనుమతి ఇవ్వడం వంటి అంశాల్లో ఇప్పటికీ విభేదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
ఇరాన్ వైఖరి ప్రస్తుతం ‘‘ముందు ఆంక్షలు సడలించండి.. తర్వాత మేం నిర్ణయం చెబుతాం’’ అన్నట్టుగా కనిపిస్తోంది. అమెరికా ఆంక్షలు ఎత్తివేయడం, విదేశాల్లో నిలిచిపోయిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం, యుద్ధం అధికారికంగా ముగిసిందన్న హామీ ఇవ్వడం వంటి అంశాలను టెహ్రాన్ ప్రధాన షరతులుగా పెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి అంశాన్ని ఇరాన్ ఇప్పటికీ ఒత్తిడి సాధనంగానే ఉపయోగిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదే సమయంలో ట్రంప్ కూడా వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. “పూర్తి ఒప్పందం కుదిరే వరకు బ్లాకేడ్ అలాగే కొనసాగుతుంది” అని ఆయన స్పష్టం చేశారు. అంటే కాల్పులు తగ్గినా.. ఆర్థిక, వ్యూహాత్మక ఒత్తిడి మాత్రం కొనసాగుతుందన్న సంకేతాలు అమెరికా ఇస్తోంది. అందుకే ట్రంప్ అసలు లక్ష్యం యుద్ధాన్ని ఆపడం కంటే.. ఇరాన్‌ను బలహీన స్థితిలో చర్చల టేబుల్‌పై ఉంచడమేనా? అనే చర్చ మొదలైంది.
అంతర్జాతీయ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఒక తాత్కాలిక అవగాహన ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. ఇందులో యుద్ధాన్ని అధికారికంగా ముగించడం, హర్ముజ్ మార్గాన్ని తిరిగి తెరవడం, తదుపరి 30 లేదంటే 60 రోజులపాటు అణు చర్చలు కొనసాగించడం వంటి అంశాలు ఉండొచ్చని తెలుస్తోంది. ఈ చర్చల్లో పాకిస్థాన్, ఖతార్, ఒమన్ వంటి దేశాలు మధ్యవర్తిత్వం చేస్తుండటం గమనార్హం.
ఇక అమెరికా లోపల కూడా ట్రంప్‌పై ఒత్తిడి పెరుగుతోంది. “మూడు నెలల క్రితం ఇరాన్ సామర్థ్యాన్ని పూర్తిగా ధ్వంసం చేశామని చెప్పి.. ఇప్పుడు మళ్లీ అదే దేశంతో రాజీ చర్చలు ఎందుకు?” అంటూ కొందరు రిపబ్లికన్ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ అణు కేంద్రాలను పూర్తిగా నిర్వీర్యం చేయాలన్న డిమాండ్‌ను కొనసాగిస్తోంది.
ఇప్పటికైతే యుద్ధం కాస్త చల్లారినట్లే కనిపిస్తున్నా.. అసలు గేమ్ ఇప్పుడు మొదలైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ట్రంప్ “టైమ్ మా వైపే ఉంది” అంటుంటే.. ఇరాన్ మాత్రం “మా షరతులు ముందుగా నెరవేర్చాలి” అని పట్టుబడుతోంది. ఈ బేరసారాలు ఎటు దారి తీస్తాయన్నదే ఇప్పుడు ప్రపంచ రాజకీయాలు, చమురు మార్కెట్లు, అంతర్జాతీయ భద్రత భవిష్యత్తును నిర్ణయించబోతోంది. ట్రంప్ ఆ ఒక్క మాటతో మళ్లీ ప్రపంచంలో టెన్షన్ పెరిగిందనే అభిప్రాయాలు ఇప్పుడు గట్టిగానే వినిపిస్తున్నాయి.


