ఏం ఆటలా?.. 47 ఏళ్లుగా అదే మోసమా? | Middle East Crisis: Trump Slams Iran obama Over Deal | Sakshi
Sakshi News home page

ఏం ఆటలా?.. 47 ఏళ్లుగా అదే మోసమా?

May 11 2026 7:21 AM | Updated on May 11 2026 8:44 AM

Middle East Crisis: Trump Slams Iran obama Over Deal

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. దశాబ్దాలుగా ఇరాన్‌ అమెరికాతో ఆటలాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. ఇరు దేశాలు తమ ప్రతిపాదనలను పరస్పరం తిరస్కరించుకున్న గంటల వ్యవధిలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతో పశ్చిమాసియా యుద్ధం తీవ్రతరం కావొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ట్రూత్‌ సోషల్‌లో ట్రంప్‌ తాజాగా చేసిన మెసేజ్‌ సారాంశం ఇలా ఉంది.. ఇరాన్ 47 సంవత్సరాలుగా అమెరికాతో పాటు ప్రపంచాన్ని మోసం చేస్తోంది. వారు ఎప్పటికప్పుడు ఆటలాడుతూ ఆలస్యం(మూడుసార్లు నొక్కి.). చేస్తున్నారు’’ అని న్యూక్లియర్‌ డీల్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారాయన. అదే సమయంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఒబామా చారిత్రక తప్పిదం చేశారని ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న ఇరాన్‌పై “సడలింపు” చూపారని.. ఆయన హయాంలో అమెరికా నుంచి ఇరాన్‌కు విమానాల్లో పెద్ద మొత్తంలో(400 మిలియన్‌ డాలర్లు) నగదు వెళ్లిందని ఆరోపించారు. ఒబామా కుదిర్చిన 2015 అణు ఒప్పందం ‘‘అత్యంత చెత్త ఒప్పందం’’. దాని వల్లే మిడిల్‌ ఈస్ట్‌లో ఇరాన్‌కు అనవరసమైన ప్రాధాన్యం పెరిగింది. ఒబామా ప్రభుత్వం ఈ నగదు పంపిణీని 1979లో విఫలమైన ఆయుధ ఒప్పందం కారణంగా చెల్లించాల్సిన డబ్బు అని చెప్పింది. కానీ, అది ఎంతమాత్రం కాదు. ఈ చర్యతో ఒబామా ప్రపంచంలోనే అత్యంత దుర్మార్గమైన పాలనను బలపరిచారు’’ అని మండిపడ్డారు. 

గతంలో నేను ఈ ఒప్పందాన్ని రద్దు చేశానని..  లేకపోతే ఇరాన్ ఇప్పటికే అణు ఆయుధం తయారు చేసి ఇజ్రాయెల్‌పై వాడేదని అన్నారు. అలాగే, తన బలమైన నాయకత్వంలోనే జనరల్ ఖాసీం సోలేమానీని హతమార్చానని.. ఆ చర్యను “అత్యవసరమైన రక్షణ చర్య”గా ప్రకటించారు. (ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) లోని క్వాడ్స్‌ ఫోర్స్‌ కమాండర్. 2020 జనవరి 2న ఇరాక్‌ బాగ్దాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద అమెరికా జరిపిన డ్రోన్‌ దాడిలో మరణించాడు. అప్పటి ఇరాన్‌ సుప్రీం అయతొల్లా ఖమేనీకి ఖాసీం సోలేమానీ కుడి భుజంగా ఉండేవాడు.)

ఇరాన్ నుంచి ఒక లేఖ రావొచ్చు, చూద్దాం ఎలా ఉంటుందో అని రెండ్రోజుల కిందటే ట్రంప్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అదే రోజు ఇరాన్ తన ప్రతిస్పందనను పాకిస్తాన్ ద్వారా అమెరికాకు అందజేసిందని ఇరాన్ రాష్ట్ర మీడియా తెలిపింది. అయితే.. ఇరాన్‌ తాజా ప్రతిపాదనలను ట్రంప్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ, అందులో ఏ అంశాలు అంగీకరించలేనివిగా ఉన్నాయో మాత్రం ఆయన బయటకు చెప్పడం లేదు. మరోవైపు.. ఇరాన్‌ మాత్రం దిగి రామంటోంది. అమెరికా చెప్పినట్లు ఒప్పందం చేసుకోవడం అంటే.. లొంగిపోవడం కిందకే వస్తోందని అంటోంది.  

ఇరాన్ డిమాండ్లు:

  • అమెరికా నుంచి యుద్ధ పరిహారం (war reparations) 

  • హర్ముజ్‌ జలసంధిపై పూర్తి ఇరాన్‌ సార్వభౌమాధికారం

  • ఇరాన్‌పై ఆంక్షల ఎత్తివేత

  • ఫ్రీజ్‌ చేసిన ఆస్తుల విడుదల, వీటికి అదనంగా..

  • అమెరికా నావికాదళ ఆంక్షలు తొలగించాలి

  • భవిష్యత్తులో దాడులు జరగవని హామీ ఇవ్వాలి

  • ఇరాన్‌ చమురు అమ్మకాలపై నిషేధం తొలగించాలి

అయితే ఈ డిమాండ్లు, యుద్ధం మొత్తం కాలంలో అమెరికా ప్రకటించిన ప్రధాన లక్ష్యాలకు విరుద్ధంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. తమ ప్రతిపాదనలకు ఒప్పుకోకపోతే యుద్ధం మరింత తీవ్రతరం అవుతుందని ట్రంప్‌ హెచ్చరిస్తున్నారు. 

కమ్యూనికేషన్‌ లోపం వల్లే.. 

అమెరికా-ఇరాన్‌ చర్చల్లో పాక్‌ మధ్యవర్తిత్వం ఎంత పేలవంగా ఉందో అమెరికా మాటలతో బయటపడింది. యూఎస్‌ ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్ ఎన్‌బీసీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమెరికా ప్రధాన లక్ష్యం హర్ముజ్ జలసంధిలో స్వేచ్ఛా నావిగేషన్.. అలాగే ఇరాన్ అణు కార్యక్రమంపై నియంత్రణ. ఇరాన్ నుంచి ఇంకా స్పష్టమైన సమాధానం రాలేదు. ప్రభుత్వంలో వర్గాల ఒత్తిడి, మధ్యవర్తితత్వం వహిస్తున్న కమ్యూనికేషన్ సమస్యల వల్ల ఆలస్యం జరుగుతోంది’’ అని చెప్పారు.

ఒకవైపు పాక్‌తో పాటు ఈజిప్ట్‌ కూడా పశ్చిమాసియా ఉద్రిక్తతలను చల్లార్చే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలు, ఇరాన్ ప్రతిస్పందన.. ఈ ఘర్షణను మరింత క్లిష్టం చేస్తున్నాయి. హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలతో పాటు.. పర్షియన్‌ గల్ఫ్‌ రీజియన్‌లో యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఇజ్రాయెల్‌-హెజ్‌బొల్లా దాడులతో లెబనాన్‌ వణికిపోతోంది. దీంతో దౌత్య ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. అదే సమయంలో.. ఇంధన ధరలు పెరుగుతూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement