ఇస్ఫహాన్, కరాజ్, టెహ్రాన్‌లపై  క్షిపణుల వాన  | Massive strikes hit Isfahan in central Iran | Sakshi
Sakshi News home page

ఇస్ఫహాన్, కరాజ్, టెహ్రాన్‌లపై  క్షిపణుల వాన 

Apr 3 2026 5:16 AM | Updated on Apr 3 2026 5:16 AM

Massive strikes hit Isfahan in central Iran

దాడుల్లో ధ్వంసమైన ఇస్ఫహాన్‌ సిటీ క్షిపణి నిల్వ కేంద్రం 

దీటుగా ప్రతిదాడులతో విరుచుకుపడుతున్న ఇరాన్‌

దుబాయ్‌/టెహ్రాన్‌/ఇస్లామాబాద్‌: ఇరాన్‌ అణ్వాయుధ తయారీ ప్రయత్నాల అంతమే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్‌ ఆరంభించిన పశ్చిమాసియా యుద్ధం హార్మూజ్‌ జలసంధి దిగ్బంధంతో కొత్త మలుపు తీసుకుని ఇప్పుడు అతి క్షిపణుల ప్రయోగాలతో మరింత ఉధృతమైంది. దాడులకు ఇరాన్‌ ప్రతిదాడులతో సమాధానం చెబుతోంది. ఇజ్రాయెల్, గల్ఫ్‌ దేశాలపై గురువారం సైతం క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. 

అగ్రనాయకత్వాన్ని అంతమొందించినా ఇరాన్‌ తన శక్తిసామర్థ్యాలతో హార్మూజ్‌ను ఇంకా గుప్పిటపట్టి తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. దీంతో ఆగ్రహించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ బుధవారం జాతినుద్దేశించి ప్రసంగించారు. ‘‘గతంలో ఎన్నడూలేనంత భీకరంగా దాడి చేసి హార్మూజ్‌ను మేం హస్తగతం చేసుకోగలం.కానీ అమెరికా ఒంటరిగా అలా చేయాలని అనుకోవట్లేదు. హార్మూజ్‌పై ఆధారపడిన దేశాలన్నీ ఇప్పటికైనా ధైర్యం కూడదీసుకుని,కలసికట్టుగా రణరంగంలోకి దూకండి. హార్మూజ్‌ను చేజిక్కించుకోండి’’అని పిలుపునిచ్చారు. 

అపార ఆయుధ సంపత్తి మా సొంతం
ఇస్ఫహాన్‌ సమీప క్షిపణి నిల్వ కేంద్రంపై అమెరికా దాడులుచేసింది. నిల్వకేంద్రంలో భారీగా పేలుళ్లు జరిగాయి. కొన్ని నిమిషాలపాట ఆగకుండా నిల్వకేంద్రం నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. కరాజ్, టెహ్రాన్‌ నగరాలపైనా అమెరికా దాడులను కొనసాగించింది. అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్‌ మాజీ విదేశాంగ మంత్రి కమల్‌ ఖరాజీ(81) తీవ్రంగా గాయపడ్డారు. ఆయన భార్య చనిపోయింది. ప్రతిగా ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడులను ఉధృతంచేసింది. ఇరాన్‌ క్షిపణులను కూల్చేపనిలో పడ్డామని ఇజ్రాయెల్‌ తెలిపింది. బహ్రెయిన్‌లోని అమెరికా 5వ ఫ్లీట్‌ స్థావరంపై ఇరాన్‌ దాడులుచేసింది.

 యూఏఈపై ఇరాన్‌ డజన్ల కొద్దీ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. వీటిలో 19 క్షిపణులు, 26 డ్రోన్లను నేలమట్టంచేశామని యూఏఈ తెలిపింది. ట్రంప్‌ వ్యాఖ్యలపై ఇరాన్‌ దీటుగా స్పందించింది. ‘‘అపార ఆయుధ సంపత్తి మా సొంతం. మీరు ఇప్పటిదాకా దాడిచేసినవి మా అసలైన స్థావరాలు కావు. అవి ఎక్కడున్నాయో మీ నిఘా వర్గాలకు కనీసం అవగాహన కూడా లేదు. మాపై ఎంతగా బాంబుల వర్షం కురిపించి నష్టం చేకూర్చినా ఇంకా ఎంతో మందుగుండు, ఆయుధ నిల్వలున్నాయి’’అని ఇరాన్‌ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఇబ్రహీం జోల్ఫఘరీ అన్నారు. 

70 లక్షల మంది సిద్ధం... 
అమెరికా భూతల దాడులకు దిగితే వారిని మా గడ్డ మీదనే అంతంచేసేందుకు 70 లక్షల మంది ఇరానియన్లు సిద్ధంగా ఉన్నారని ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మొహమ్మద్‌ బఘేర్‌ ఖాలీబాహ్‌ హెచ్చరించారు. ఇరాన్‌ జనాభా 9 కోట్లు. దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఆయుధం పట్టాలని ఇరాన్‌ ప్రభుత్వం విస్తృతస్తాయిలో ప్రచారంచేస్తోందని వార్తలొచ్చాయి.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement