కాన్‌బెర్రా: ఇరాన్‌లో సాధించాల్సింది ఇంకేముందంటూ అమెరికాను ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ ప్రశ్నించారు. ‘‘ఇరాన్ సంఘర్షణలో నిర్దేశించుకున్న ప్రాథమిక లక్ష్యాలు నెరవేరాయని.. ఇకపై అక్కడ సాధించాల్సింది ఏముందో స్పష్టంగా తెలియడం లేదు. యుద్ధం ముగింపు ఎలా ఉంటుంది’ అంటూ అల్బనీస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ వైమానిక దళం, నౌకాదళం, సైనిక పారిశ్రామిక కేంద్రాలు దెబ్బతిన్నాయన్నారు. ఉద్రిక్తతలను తగ్గించాలని అల్బనీస్ పిలుపునిచ్చారు.
రాజధాని కాన్‌బెర్రాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. ఒకటి మాత్రం స్పష్టం.. ఈ యుద్ధం ఎంత కాలం కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అంత తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌పై మరో రెండు మూడు వారాల పాటు అత్యంత కఠినమైన దాడులు కొనసాగుతాయని ప్రకటించిన నేపథ్యంలో అల్బనీస్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా, ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధంలోకి తమను ఎవరూ లాగలేరని బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఇప్పటికే తేల్చిచెప్పారు. ఈ యుద్ధంలో తాము పాల్గొనే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడమే లక్ష్యంగా దౌత్య, రాజకీయ చర్యలపై చర్చించడానికి ఈ వారంలోనే అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. నాటోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు.
పశ్చిమాసియా యుద్ధం బ్రిటన్ భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని స్టార్మర్ చెప్పారు. ఈ తుఫాను ఎంత తీవ్రమైనదైనా, తట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నాటో అనేది ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన సైనిక కూటమి అని తెలిపారు. ఈ కూటమి ఎన్నో దశాబ్దాలుగా తమను కాపాడుతోందని వెల్లడించారు. ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధంతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ యుద్ధాన్ని తాము ప్రారంభించలేదని, అందులోకి అడుగుపెట్టబోమని స్టార్మర్ స్పష్టంచేశారు.


