త్వరలోనే ఖేల్‌ ఖతం  | Donald Trump says US forces will bring Iran back to the Stone Ages | Sakshi
Sakshi News home page

త్వరలోనే ఖేల్‌ ఖతం 

Apr 3 2026 4:58 AM | Updated on Apr 3 2026 5:48 AM

Donald Trump says US forces will bring Iran back to the Stone Ages

మరో మూడు వారాల్లో ఇరాన్‌పై భీకర దాడులు

లక్ష్యాలు పూర్తి కావొస్తున్నాయి  

మా దళాలు పని పూర్తిచేస్తాయి  

ఇరాన్‌ను రాతియుగంలోకి తిరిగి తీసుకెళ్తాం

జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టీకరణ  

వాషింగ్టన్‌: ఇరాన్‌లో కీలక వ్యూహాత్మక లక్ష్యాలు పూర్తి కావొస్తున్నాయని, తమ సైనిక దళాలు త్వరలోనే అక్కడ పని పూర్తి చేస్తాయని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తేల్చిచెప్పారు. ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధాన్ని గట్టిగా సమర్థించారు. ట్రంప్‌ బుధవారం రాత్రి జాతినుద్దేశించి దాదాపు 20 నిమిషాలపాటు ప్రసంగించారు. పశ్చిమాసియాలో కల్లోలం మొదలైన తర్వాత ఆయన ప్రైమ్‌–టైమ్‌ ప్రసంగం చేయడం ఇదే మొదటిసారి. అమెరికా సైన్యం ఇప్పటికే ఎన్నో ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేసిందని అన్నారు. 

తమ లక్ష్యాలన్నీ ఇప్పటివరకు నెరవేరాయని, కొన్నిసార్లు లక్ష్యం కంటే ఎక్కువే సాధించామని చెప్పారు. స్వల్పకాలంలో ఇరాన్‌ వరుస దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. రాబోయే రెండు మూడు వారాల్లో ఇరాన్‌పై భీకర స్థాయిలో దాడులకు దిగబోతున్నామని హెచ్చరించారు. రెండు వారాల్లో యుద్ధం ముగిసిపోవచ్చని సంకేతాలిచ్చారు. శత్రువును ఈసారి గట్టిగా దెబ్బ కొడతామన్నారు. వారిని(ఇరాన్‌) రాతియుగంలోకి తిరిగి తీసుకెళ్తామని, ఎందుకంటే వారు ఆ యుగానికి చెందినవారేనని వ్యాఖ్యానించారు. 

ఇరాన్‌పై యుద్ధంలో తమ జవాన్లు సైతం మరణిస్తున్నారని ట్రంప్‌ గుర్తుచేశారు అయినప్పటికీ వెనక్కి తగ్గబోమని, చేయాల్సిన పనిని చాలా వేగంగా, కచ్చితంగా పూర్తి చేస్తామన్నారు. లక్ష్యానికి చాలా చేరువలోకి వచ్చేశామని ఉద్ఘాటించారు. అయితే, ఇరాన్‌పై భూతల దాడుల గురించి ట్రంప్‌ ప్రస్తావించలేదు. నాటో కూటమి తీరుపైనా స్పందించలేదు. నాటో దేశాలు తమకు సహకరించడం లేదని ఆయన కొన్నిరోజులుగా అసంతృప్తి వ్యక్తంచేస్తున్న సంగతి తెలిసిందే. ఇరాన్‌తో చర్చల గురించి కూడా మాట్లాడలేదు. ట్రంప్‌ తన ప్రసంగంలో ఇంకా ఏం చెప్పారంటే..  

హార్మూజ్‌ను స్వాధీనం చేసుకోండి  
‘‘అమెరికా సైన్యం గతంలో ఎన్నో యుద్ధాల్లో పోరాటం సాగించింది. ఇరాన్‌పై పోరు 32 రోజులకు చేరింది. ఈ యుద్ధం ముగించడానికి కొంత సమయం పడుతుంది. రెండు ప్రపంచ యుద్ధాలు, కొరియా, వియత్నాం, ఇరాక్‌ యుద్ధాలు సంవత్సరాలపాటు కొనసాగాయి. ఇరాక్‌ యుద్ధభూమిలో అమెరికా సాయుధ బలగాలు వేగవంతమైన, నిర్ణయాత్మకమైన, తిరుగులేని విజయాలు సాధించాయి. అమెరికా సైనిక చర్య చాలా శక్తివంతమైనది, అద్భుతమైనది. అమెరికా అత్యంత శక్తివంతమైన దేశం అనే సంగతి మర్చిపోవద్దు. 

ఇరాన్‌లోని యురేనియం స్వా«దీనం చేసుకోవడానికే ఈ యుద్ధం ప్రారంభించామన్న వాదనలో నిజం లేదు. ఇరాన్‌ అణు కేంద్రాలను చాలావరకు ధ్వంసం చేశాం. అక్కడున్న అణు ధూళి దగ్గరికి చేరడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. ఇరాన్‌ అణు కార్యక్రమాలపై ఉపగ్రహాలతో నిఘా కొనసాగుతుంది. మరోసారి అణ్వ్రస్తాల ఆలోచన చేస్తే క్షిపణులతో చావుదెబ్బ కొడతాం. హార్మూజ్‌ విషయంలో ప్రపంచదేశాలు ఇప్పటిదాకా వాయిదా వేసుకున్న ధైర్యాన్ని కూడగట్టుకోవాలి. వెంటనే వెళ్లి ఆ జలసంధిని చేజిక్కించుకోవాలి.  

ఈ యుద్ధం.. భవిష్యత్‌ తరాల కోసం పెట్టుబడి  
నా అధ్యక్ష పదవీకాలంలో గత ఐదేళ్లుగా అమెరికా విజయాలు సాధిస్తూనే ఉంది. ఇప్పుడు మునుపెన్నడూ లేనట్టి ఘన విజయం సాధించబోతున్నాం. అమెరికాతోపాటు ప్రపంచ భద్రత కోసమే ఆపరేషన్‌ ఎపిక్‌ క్యూరీ ప్రారంభించాం. ఇరాన్‌ వద్ద అణ్వాయుధాలు ఉండడానికి ఎంతమాత్రం వీల్లేదు. అలాంటి ఆయుధాలు ఉండడం మనకు భరించలేని ముప్పు అవుతుంది. గత ఏడాది ఇరాన్‌ అణు కేంద్రాలను ధ్వంసం చేశాం. 

అయినా సరే అక్కడ అణ్వాయుధ కార్యకలాపాలు ఆగడం లేదు. మరోచోట అణు కేంద్రాలు నిర్మించాలని చూస్తున్నారు. అణ్వాయుధాలపై ఇరాన్‌కు ఆశలు చావడం లేదు. నేరుగా అమెరికా భూభాగంపై దాడిచేసేలా బాలిస్టిక్‌ క్షిపణులను ఇరాన్‌ తయారు చేస్తోంది. ఇరాన్‌పై యుద్ధంతో అమెరికాకు తప్పనిసరిగా మేలు జరుగుతుంది. అమెరికా మరింత మెరుగైన స్థితిలో ఉంటుంది. ఇది మీ పిల్లలు, మీ మనవళ్ల భవిష్యత్తు కోసం పెడుతున్న నిజమైన పెట్టుబడి’’అని ట్రంప్‌ తమ దేశ పౌరులకు తేల్చిచెప్పారు.  

అమెరికన్లకు అంత ఓపిక ఉందా?  
ఇరాన్‌పై యుద్ధం కొనసాగించడానికి అమెరికా ప్రజలకు ఓపిక ఉందో లేదో తనకు తెలియదని ట్రంప్‌ అన్నారు. బుధవారం వైట్‌హౌస్‌లో ఈస్టర్‌ విందు కార్యక్రమంలో అతిథులతో ఆయన ముచ్చటించారు. ఇరాన్‌ చమురును అత్యంత సులభంగా స్వా«దీనం చేసుకోగల సత్తా అమెరికాకు ఉందని చెప్పారు. కానీ, అలాంటి ప్రయత్నం పట్ల అమెరికన్లలో తగినంత సహనం ఉన్నట్లు కనిపించకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. యుద్ధం ముగిసిపోవాలని వారు కోరుకుంటున్నారని ఆక్షేపించారు. ఇరాన్‌ చమురును తీసుకురావడానికే తాను ఇష్టపడుతున్నానని తెలిపారు. కానీ, తమ ప్రజలు మాత్రం ఇరాన్‌లో గెలిచేసి, ఇంటికి తిరిగి రండి అంటున్నారని విమర్శించారు. వారే అలా అంటే ఇక తాను చేసేది ఏముంటుందని నిర్వేదం వ్యక్తంచేశారు.  

నాటో ఒకకాగితం పులి  
హార్మూజ్‌ను తెరిపించడానికి చైనా, జపాన్, దక్షిణ కొరియా దేశాలు చొరవ తీసుకోవాలని ట్రంప్‌ సూచించారు. కొన్ని ఆసియా దేశాలు అమెరికా చమురు కంటే గల్ఫ్‌ చమురుపై అధికంగా ఆధారపడుతున్నాయని అసంతృప్తి వ్యక్తంచేశారు. నాటో కూటమిని సైతం దూషించారు. అందులో పనికిమాలిన భాగస్వామ్య దేశాలు ఉన్నాయని మండిపడ్డారు. నాటో ఒక పేపర్‌ టైగర్‌ అంటూ ఎద్దేవా చేశారు. నాటోతో తమకు అవసరం లేదని, తమ అవసరమే వారికి ఉంటుందని తేల్చిచెప్పారు. అసలు అమెరికా లేకపోతే నాటో పట్టుకొచ్చేదా? అని ప్రశ్నించారు. ఈస్టర్‌ విందులో ట్రంప్‌ మాట్లాడిన వీడియోను ఓ వార్తా సంస్థ సోషల్‌ మీడియాలో పోస్టుచేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement