
వాషింగ్టన్: అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికాలో చైనా విద్యార్థుల వీసాలు రద్దు చేయడానికి ట్రంప్ యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో ఓ ప్రకటనలో వెల్లడించారు. దీంతో, చైనా విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది.
మంత్రి మార్కో రూబియో తాజాగా ట్విట్టర్ వేదికగా..‘అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో చైనా విద్యార్థుల వీసాలను రద్దు చేయడానికి అమెరికా విదేశాంగ శాఖ హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖతో కలిసి పని చేస్తుంది. చైనా విద్యార్థుల వీసాలను రద్దు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తాం.వీరిలో చైనా కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలు ఉన్నవారు, కీలక రంగాలలో చదువుతున్నవారు కూడా ఉన్నారు. దీనికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఇక, అమెరికాలో భారత్, తర్వాత చైనా విద్యార్థులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అంతర్జాతీయ విద్యార్థుల్లో చైనా విద్యార్థులే రెండో స్థానంలో కొనసాగుతున్నాయి. 2023-2024 విద్యా సంవత్సరానికి గాను చైనా నుండి 2,70,000 మంది విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారు.
The U.S. will begin revoking visas of Chinese students, including those with connections to the Chinese Communist Party or studying in critical fields.
— Secretary Marco Rubio (@SecRubio) May 28, 2025
ట్రంప్ vs హార్వర్డ్
మరోవైపు.. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో కొత్త అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకోకుండా తాత్కాలికంగా నిలిపివేసింది. వర్సిటీలోని పరిశోధన భాగస్వామ్యాల ద్వారా విద్యార్థులు.. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీతో సమన్వయం చేసుకుంటున్నట్టు ఆరోపించింది. హార్వర్డ్ ఒక చైనీస్ పారామిలిటరీ గ్రూప్ సభ్యులకు శిక్షణ ఇస్తోందని డీహెచ్‌ఎస్ వ్యాఖ్యానించింది. చైనా విద్యార్థులు వామపక్ష భావజాలంతో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపణలు చేసింది.
ఇదిలా ఉండగా.. అమెరికా వీసాల విషయంలో ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. యూఎస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అమెరికన్లు చేసే పోస్టులను, కామెంట్లను సెన్సార్ చేయడానికి ప్రయత్నించే విదేశీ అధికారులపై కొత్తగా వీసా నిషేధాన్ని ప్రకటించింది. అంతేకాకుండా తమ దేశానికి చెందిన సామాజిక మాధ్యమాలకు కంటెంట్‌ను తీసేయమని నోటీసులు పంపడం, ఒత్తిడికి గురిచేసిన వారిపైనా ఈ వీసా నిషేధం అమలుకానున్నట్లు అమెరికా పేర్కొంది. ఇటీవల పలు దేశాల ప్రభుత్వాల నుంచి యూఎస్ సోషల్ మీడియా కంపెనీలకు ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
‘అమెరికా పౌరులు లేదా నివాసితులు తాము సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌లను, కామెంట్లను తొలగించమని ఒత్తిడికి గురిచేయడం, అరెస్టు వారెంట్లు జారీ చేయడం, యూఎస్ టెక్ కంపెనీలను సైతం ఒత్తిడికి గురిచేసే విదేశీ అధికారులను లక్ష్యంగా చేసుకొని ఈ కొత్త పాలసీ తీసుకొచ్చాం’ అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు. ఈ సందర్బంగా విదేశీ అధికారులు ఇలా అమెరికా పౌరులను, టెక్ కంపెనీలను ఒత్తిడికి గురిచేయడం అనైతికం అన్నారు. అంతేకాకుండా గ్లోబల్ కంటెంట్ మోడరేషన్ విధానాలు అవలంభించడం లేదా వారి అధికార పరిధి దాటి సెన్సార్‌షిప్ కార్యకలాపాల్లో పాల్గొనాలని ఇతర దేశాల అధికారులు యూఎస్ టెక్ కంపెనీలను డిమాండ్ చేయడం ఆమోదయోగ్యం కాదన్నారు. అయితే ఏ దేశం పేరును గానీ, అధికారులను గానీ ఆయన నేరుగా ప్రస్తావించలేదు.