ఎలిజబెత్‌-2 మరణానికి ముందు రాజకుటుంబంలో ఏం జరిగింది? హ్యారీ భార్య మేఘన్‌ను రావొద్దన్నారా?

King Charles Told Harry Meghan Wont Welcome To See Dying Queen - Sakshi

లండన్‌: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్-2 గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆమె చనిపోవడానికి ముందు రాజకుటుంబ నివాసం బల్మోరల్‌ కాస్టిల్‌లో జరిగిన విషయాలపై  బ్రిటీష్ మీడియా ఆసక్తికర కథనాలు ప్రచురించింది. ఎలిజబెత్‌ కుమారుడు ప్రిన్స్ చార్లెస్ తన చిన్న కూమారుడు హ్యారీకి ఓ విషయం తేల్చిచెప్పినట్లు పేర్కొంది. ఎలిజబెత్‌ను చివరి క్షణాల్లో చూసేందుకు హ్యారీ తన భార్య మెర్కెల్‌ను తీసుకురావద్దని చార్లెస్ చెప్పారని వెల్లడించింది.

'మహారాణి చనిపోయే ముందు అతి తక్కువ మంది దగ్గరి బంధువులే పరిమిత సంఖ్యలో ఆమెతో పాటు ఉంటున్నారు. ఇలాంటి బాధాకరమైన సమయంలో మెర్కెల్‌ను ఇక్కడకు తీసుకురావడం సరికాదు. అందుకే ఆమెను తీసుకురావొద్దు' అని ప్రిన్స్ చార్లెస్ తన కుమారుడు హ్యారితో చెప్పినట్లు ది సన్, స్కై న్యూస్‌ వార్తా సంస్థలు తెలిపాయి.  ఈ కారణంతోనే గురువారం ఎలిజబెత్ చనిపోవడానికి ముందు హ్యారీనే బల్మోరల్‌ క్యాస్టిల్‌కు చివరగా చేరుకున్నట్లు తెలుస్తోంది. ఆమె మరణాంతరం శుక్రవారం రోజు క్యాస్టిల్‌ను వీడిన తొలి వ్యక్తి కూడా హ్యారీనే అని సమాచారం. దీంతో బ్రిటన్‌ రాజకుటుంబంలో వివాదాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.

నానమ్మతో అన్యోన్యంగా..
గతంలో ఎలిజబెత్ ఆమె మనవడు హ్యారీల మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. 2016లో బరాక్ ఒబామా, మిచేలీ ఒబామా దివ్యాంగుల కోసం ఇన్‌విక్టస్ గేమ్స్ కాంపిటీషన్‌ను ప్రారంభించినప్పుడు ఎలిజబెత్‌, హ్యారీల రియాక్షన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. ఈ గేమ్స్‌కు హ్యారీనే ప్రమోటర్‌గా వ్యవహరించారు.

ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు..
అయితే అమెరికాకు చెందిన మేఘన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత హ్యారికి రాజకుటుంబంతో సంబంధాలు బలహీనపడ్డాయి. ఈ దంపతులు 2021 మార్చిలో ఓప్రా విన్‌ఫ్రేకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మేఘన్ సంచలన ఆరోపణలు చేశారు. రాజకుటుంబంలో తాను జాతివివక్షను ఎదుర్కొన్నట్లు చెప్పారు. అది భరించలేక తనకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయని పేర్కొన్నారు. అంతేకాదు తాను గర్భవతిగా ఉన్నప్పుడు తనకు పుట్టబోయే బిడ్డ ఏ రంగులో ఉంటాడా? అని రాజకుటుంబంలో చర్చించుకునేవారని తెలిపారు. మేఘన్ తల్లి నల్లజాతీయురాలు కాగా.. తండ్రి శ్వేతజాతీయుడు.

అప్పటి నుంచి మరింత దూరం
ఈ ఇంటర్వ్యూ అనంతరం రాజకుటుంబంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే బకింగ్‌హామ్ ప్యాలెస్ వీటిని తోసిపుచ్చింది.  మేఘన్ ఆరోపణలు ఆందోళన కల్గించాయని పేర్కొంది. అప్పటినుంచి హ్యారీ దంపతులకు రాజకుటుంబంతో సంబంధాలు తెగిపోయాయి. ఇద్దరూ ఆమెరికాలో నివాసముంటున్నారు. తమకు రాజకుటుంబం హోదా వద్దని ప్రకటించారు. 

అయితే తల్లి మృతి అనంతరం కొత్త రాజుగా బాధ్యతలు చేపట్టిన కింగ్ చార్లెస్ తన మొదటి ప్రసంగంలో హ్యారీ, మేఘన్‌ల గురించి ప్రస్తావించారు. విదేశాలో నివసిస్తున్న ఈ ఇద్దరిపై కూడా తనకు ప్రేమ ఉందని పేర్కొన్నారు.

అయితే ఎలిజబెత్-2 మరణానికి ముందు హ్యారీ బ్రిటన్‌లోనే ఉన్నారు. అయితే ఇది యాదృచ్చికమే అని బ్రిటీష్ మీడియా సంస్థలు తెలిపాయి.
చదవండి: తీవ్ర దుఃఖంలో ఉన్న కింగ్ చార్లెస్‌కు ముద్దు పెట్టిన మహిళ

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top