ట్రంప్ కోటకు కింగ్ చార్లెస్: 20 నిమిషాల ప్రసంగంపై ఉత్కంఠ | King Charles Historic US Visit A Bid To Heal US UK Rift, Set To Address Congress In Historic Speech | Sakshi
Sakshi News home page

ట్రంప్ కోటకు కింగ్ చార్లెస్: 20 నిమిషాల ప్రసంగంపై ఉత్కంఠ

Apr 28 2026 8:16 AM | Updated on Apr 28 2026 9:11 AM

King Charles Historic US Visit A Bid to Heal US UK Rift

వాషింగ్టన్‌: ఇరాన్ వివాదం నేపథ్యంలో అమెరికా-బ్రిటన్ దేశాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలను చల్లార్చేందుకు బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III రంగంలోకి దిగారు. నాలుగు రోజుల చారిత్రక పర్యటన నిమిత్తం అమెరికా చేరుకున్న ఆయనకు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో ఘన స్వాగతం పలికారు. ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ పర్యటనలో కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఆయన చేయబోయే ప్రసంగంపైనే అందరి దృష్టి నిలిచింది.

చారిత్రక ఘట్టం: అమెరికా కాంగ్రెస్‌లో ప్రసంగం
1991లో క్వీన్ ఎలిజబెత్ II తర్వాత అమెరికా చట్టసభ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించనున్న తొలి బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్ III చరిత్ర సృష్టించనున్నారు. సుమారు 20 నిమిషాల పాటు సాగే ఈ ప్రసంగంలో ఉమ్మడి ప్రజాస్వామ్య విలువల ప్రాముఖ్యతను, రెండు దేశాల మధ్య దెబ్బతిన్న బంధాన్ని పునరుద్ధరించుకోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పనున్నారు. మంగళవారం వైట్‌హౌస్‌లో 21 తుపాకుల వందనంతో లాంఛనప్రాయ స్వాగతం అందుకున్న అనంతరం, ట్రంప్‌ దంపతులతో ఓవల్ ఆఫీసులో రాజు, క్వీన్ కెమిల్లా ఏకాంతంగా చర్చలు జరుపుతారు.

ఉద్రిక్తతలు.. ఆసక్తికర పరిణామాలు
ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యకు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ మద్దతు ఇవ్వకపోవడంతో ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పర్యటన తొలి రోజైన సోమవారం ట్రంప్ దంపతులు బ్రిటన్ రాజ దంపతులకు ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా 2024లో తనపై జరిగిన హత్యాయత్నానికి సంబంధించిన ఓ పెయింటింగ్‌ను ట్రంప్ వారికి చూపించడం గమనార్హం. అనంతరం బ్రిటిష్ ఎంబసీలో జరిగిన విందులో రాజు పాల్గొన్నారు.

250 వసంతాల స్వాతంత్యానంతరం..
అమెరికా స్వాతంత్ర్యం పొంది 250 ఏళ్లు పూర్తవుతున్న వేళ ఈ పర్యటన జరగడం రెండు దేశాల మధ్య స్నేహానికి ప్రతీకగా నిలుస్తోంది. ఒకపక్క ఈ పర్యటనను రద్దు చేయాలని  కొందరు బ్రిటన్ పౌరులు కోరుతున్నప్పటికీ, ప్రధాని స్టార్మర్ దీనిని గట్టిగా సమర్థించారు. మంగళవారం రాత్రి వైట్‌హౌస్‌లో జరిగే అధికారిక విందులో రాజు ప్రసంగించనున్నారు. బుధవారం న్యూయార్క్‌లోని 9/11 స్మారకాన్ని సందర్శించి, గురువారం బెర్ముడా పర్యటనతో ఆయన తన అమెరికా టూర్‌ను ముగిస్తారు.

ఇది కూడా చదవండి: కమలానికి ‘వంద’ కష్టాలు: షా వ్యూహం రివర్స్?

Advertisement
 
Advertisement
Advertisement