టోక్యో: ప్రపంచ దేశాలకు చమురు సరఫరా చేసే కీలకమైన ‘హర్మూజ్ జలసంధి’లో నెలకొన్న ఉద్రిక్తతలు జపాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపధ్యంలో సముద్ర మార్గంలో నౌకా దళ మైన్లు (Naval Mines) జపాన్‌కు ఆటంకం కలిగిస్తున్నాయి. వాటిని తొలగించేందుకు ఆ దేశం సిద్ధమవుతోంది. తమ దేశ మనుగడకు అత్యవసరమైన చమురు సరఫరాను పునరుద్ధరించేందుకు సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఎస్‌డీఎఫ్)ను రంగంలోకి దించే అంశాన్ని జపాన్ పరిశీలిస్తోంది.
ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పు
జపాన్ దిగుమతి చేసుకునే ముడి చమురులో దాదాపు 90 శాతం ఈ హర్మూజ్ జలసంధి నుంచే వస్తుంది. నాలుగు వారాలుగా కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడమే కాకుండా, జపాన్ తన అత్యవసర నిల్వల నుంచి చమురును వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది జపాన్ ఆర్థిక వ్యవస్థకు జీవన్మరణ సమస్యగా మారింది.
నిబంధనలు ఏం చెబుతున్నాయి?
జపాన్ రాజ్యాంగం ప్రకారం విదేశాల్లో సైనిక బలగాలను మోహరించడంపై కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. అయితే, 2015లో తీసుకువచ్చిన భద్రతా చట్టాల ప్రకారం.. దేశ మనుగడకు ముప్పు వాటిల్లితే లేదా సన్నిహిత భాగస్వామ్య దేశాల భద్రత దెబ్బతింటే సైన్యాన్ని పంపే వెసులుబాటు ఉంది. ఫుజి టీవీ కార్యక్రమంలో మాట్లాడిన విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటెగి.. హర్మూజ్ జలసంధిని సురక్షితంగా ఉంచడం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని స్పష్టం చేశారు.
అంతర్జాతీయ ఒత్తిడి
ఇటీవల వాషింగ్టన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జపాన్ ప్రధాని సనే తకైచితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జలసంధిని పునరుద్ధరించేందుకు మిత్రదేశాల సహకారం అవసరమని ట్రంప్ కోరారు. మరోవైపు జపాన్ నౌకల రాకపోకల విషయంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీతో కూడా చర్చలు జరుగుతున్నాయి. యుద్ధం పూర్తిగా ముగిసి, పరిస్థితులు శాంతించిన తర్వాతే మైన్లను తొలగించే ఆపరేషన్‌పై జపాన్ తుది నిర్ణయం తీసుకోనున్నదని సమాచారం.
ఇది కూడా చదవండి: రైలు రంగుల్లో ‘ప్రాణ రక్షణ’.. ఇది తెలిస్తే జ్ఞానం రెండింతలు!


