రోమ్: ఇరాన్‌పై యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పెద్ద షాక్ తగిలింది. ఇరాన్‌పై యుద్ధం చేస్తున్న అమెరికా యుద్ధ విమానాలకు తమ గగనతలంలో అనుమతి ఇవ్వబోమని కొన్ని దేశాలు స్పష్టంగా ప్రకటించాయి. తాజాగా ఆ జాబితాలో ఇటలీ కూడా చేరింది. అమెరికా యుద్ధ విమానాలకు గగనతలాన్ని మూసివేయడానికి ఇటలీ ప్రధాని జార్జియా మెలోని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఈ నేపథ్యంలో ఇరాన్‌పై యుద్ధంలో తనకు సహకరించని దేశాలపై ట్రంప్ అక్కసు వెళ్లగక్కతూ తన ట్రూత్ సోషల్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో ఇరాన్‌ను విచ్ఛిన్నం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలకు సహకరించని దేశాలు తమకు కావాల్సిన చమురు అమెరికా నుంచి కొనుగోలు చేయాలి. లేదా హర్మూజ్ జలసంధి ద్వారా వెళ్లి మీకు కావాల్సి వెళ్లి స్వయంగా తెచ్చుకోవాల్సిందే’అని వ్యాఖ్యానించారు.
హర్మూజ్ జలసంధి మూసివేతతో కొన్ని దేశాలు జెట్ ఇంధనం కొరతను ఎదుర్కొంటున్నాయి. అమెరికా వద్ద ఇంధనం ఎక్కువగా ఉంది, కావాలంటే ఆ దేశాలు కొనుగోలు చేసుకోవచ్చు. ‘ధైర్యం చేసి హర్మూజ్‌కి వెళ్లి మీకు కావాల్సింది తెచ్చుకోండి’ అని బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ దేశాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘మీరు అమెరికాకు తోడుగా లేరు. ఇకపై అమెరికా సహాయం చేయదు. ఇకనైనా మీరు ఒంటరిగా పోరాడడం నేర్చుకోవాలి’ అని హెచ్చరించారు.
హర్మూజ్ జలసంధి, పర్షియన్ గల్ఫ్ నుంచి ప్రపంచానికి చమురు సరఫరా చేసే ప్రధాన మార్గం. ఇరాన్ ఈ మార్గాన్ని అడ్డుకోవడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరిగాయి. స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. సాధారణ వస్తువుల ధరలు కూడా పెరిగాయి. ట్రంప్ హెచ్చరిస్తూ ‘తక్షణమే కాల్పుల విరమణ జరగకపోతే, హర్మూజ్ జలసంధి తిరిగి తెరవకపోతే అమెరికా దాడులను విస్తరిస్తుంది. ఖార్గ్ దీవిలోని చమురు ఎగుమతి కేంద్రాన్ని, అవసరమైతే డీసాలినేషన్ ప్లాంట్లను కూడా లక్ష్యంగా చేసుకుంటుందని హెచ్చరించారు.


