
24 గంటల వ్యవధిలో 64 మంది మృతి
భవనాలను పేల్చి వేస్తున్న ఇజ్రాయెల్ ఆర్మీ
గాజా సిటీ: ముందుగా ప్రకటించిన విధంగానే గాజా స్ట్రిప్ లోని గాజా నగరాన్ని పూర్తిస్థాయిలో ఆక్రమించుకునే ఇజ్రాయెల్ బలగాలు ప్రయత్నాలను వేగవంతం చేశాయి. గాజా నగరానికి ఉత్తరాన ఉన్న జబాలియాలోని శరణార్థుల శిబిరాలపై రాత్రంతా దాడులు, పేలుళ్లు కొనసాగాయని ప్రత్యక్ష సాకు‡్ష్యలు తెలిపారు. రఫా మాదిరిగానే జబాలియాను శిథిలాల దిబ్బగా మార్చేందుకు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రయత్నిస్తోందని అన్నారు.
జెయిటౌన్, షెజాయియా, సబ్రా ప్రాంతాలపైనా రాత్రంగా బాంబు దాడులు కొనసాగాయి. ఈ సైనిక చర్య కోసం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ 60 వేల రిజర్వు బలగాలను త్వరలోనే రంగంలోకి దించుతామని ప్రకటించడం తెల్సిందే. అందుకు వేదికను సిద్ధం చేసేందుకు గాజా నగరానికి సమీపంలోని జబాలియాలోని భవనాలను సైతం ఇజ్రాయెల్ బలగాలు పేల్చి వేస్తున్నాయి.
ఇజ్రాయెల్ ఆర్మీ దాడుల్లో 24 గంటల వ్యవధిలో కనీసం 64 మంది చనిపోగా సుమారు 300 మంది గాయాలపాలయ్యారని హమాస్ ఆధ్వర్యంలో గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. 2023 అక్టోబర్ 7వ తేదీ నుంచి హమాస్ లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో మరణించిన వారి సంఖ్య 62,686కు, క్షతగాత్రుల సంఖ్య 1.75 లక్షలు దాటిందని వివరించింది. ఇజ్రాయెల్ సైన్యం దాడులతో గాజా ప్రాంతంలోని ఇళ్లలో 90 శాతంపైగా నేలమట్టం కావడమో ధ్వంసమవడమో జరిగింది. అక్కడి ఆరోగ్య వ్యవస్థ దెబ్బతింది. మొత్తం 36 ఆస్పత్రులకు గాను 18 ఆస్పత్రులు, అదీ పాక్షికంగా పనిచేస్తున్నాయి. నీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది.
సహాయ కేంద్రాల వద్ద మరో నలుగురు మృతి
గాజా నగరంలో ఆదివారం ఆహార పంపిణీ కేంద్రం వద్దకు చేరుకున్న వారిపై ఇజ్రాయెల్ బలగాలు జరిపిన కాల్పుల్లో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. నెట్‌జరిమ్ కారిడార్ వద్ద ఘటన చోటుచేసుకుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాల్పులతో భీతిల్లిన కొందరు పరుగులు తీయగా, గాయపడిన కొందరు నేలపై పడిపోయారన్నారు.
ఐరాసతోపాటు ఇతర సంస్థలు ఏర్పాటు చేసిన ఆహార పంపిణీ కేంద్రాల వద్ద ఇజ్రాయెల్ బలగాలు జరిపిన కాల్పుల్లో ఇప్పటి వరకు 2 వేల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోగా 13,500 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. అదేవిధంగా, పోషకాహార లోపంతో మరో 8 మంది చనిపోగా ఇప్పటి వరకు ఇలా 281 మంది చనిపోయినట్లయిందని వివరించింది. వీరిలో చిన్నారులే 115 మంది వరకు ఉన్నట్లు తెలిపింది. ఇలా ఉండగా, జూలై 21వ తేదీ నుంచి గాజా నుంచి తీసుకెళ్లిన తమ సిబ్బందిని ఇజ్రాయెల్ ఆర్మీ ఆదివారం వదిలేసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇతర వివరాలను మాత్రం వెల్లడించలేదు.