మళ్లీ.. దక్షిణాదికి వెళ్లిపోండి!  | Israel army urges Gaza City residents to move to humanitarian zone | Sakshi
Sakshi News home page

మళ్లీ.. దక్షిణాదికి వెళ్లిపోండి! 

Sep 7 2025 5:54 AM | Updated on Sep 7 2025 5:54 AM

Israel army urges Gaza City residents to move to humanitarian zone

గాజా నగర వాసులకు ఇజ్రాయెల్‌ ఆర్మీ హెచ్చరికలు 

మరో బహుళ అంతస్తుల భవనంపై దాడి 

గాజా సిటీ: గాజా నగరాన్ని పూర్తి నియంత్రణలోకి తెచ్చుకునే ప్రయత్నాలను ఇజ్రాయెల్‌ ఆర్మీ మరింత ముమ్మరం చేసింది. ఇప్పటికే నగరాన్ని యుద్ధ జోన్‌గాను, అందులోని కొన్ని ప్రాంతాలను రెడ్‌ జోన్లుగాను ప్రకటించింది. రెడ్‌ జోన్లలోని వారంతా ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేస్తోంది. దక్షిణాదిన ఉన్న మువాసికి వెళ్లాలని, అక్కడ ఏర్పాటు చేసిన హ్యుమానిటేరియన్‌ ఏరియాలో తలదాచుకోవాలని ఆర్మీ ప్రతినిధి అవిచె ఆండ్రీ ఎక్స్‌లో కోరారు. 

హమాస్‌కు గట్టి పట్టున్న యుద్ధ క్షేత్రంగా మారినందున వెంటనే వెళ్లిపోవాలని సూచించారు. నిర్దేశించిన మార్గంలో వెళితే ఎలాంటి తనిఖీలు ఉండవని చెప్పారు. హ్యుమానిటేరియన్‌ జోన్‌లో ఫీల్డ్‌ ఆస్పత్రులు, వాటర్‌ పైప్‌లైన్లు, ఆహారం, టెంట్లు ఉంటాయన్నారు. ఆర్మీ రెడ్‌ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో కనీసం 10 లక్షల మంది ఉంటున్నారు. వీరందరినీ ఖాళీ చేయించడం వల్ల మానవీయ సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చుతుందని సహాయక సంస్థలు అంటున్నాయి. 

దాదాపు రెండేళ్లుగా కొనసాగుతున్న పోరు కారణంగా పాలస్తీనియన్లు పదేపదే ఉన్న చోటును వదిలి వేరే చోటును ఆశ్రయించాల్సి వచ్చింది. సరైన ఆహారం సైతం లభించని స్థితిలో బలహీనంగా, ఎక్కడికి వెళ్లాలో తెలియని స్థితిలోకి వెళ్లిపోయారు. ‘వాళ్లు మాకు ఒక పట్టణం నుంచి ఇంకో పట్టణానికి వెళ్లిపోవాలంటూ హెచ్చరికలు చేస్తున్నారు. 

మా పిల్లలతో కలిసి మేం ఎక్కడికి వెళ్లాలి? ఏం చేయాలి? గాయపడిన వాళ్లు, జబ్బున పడిన వాళ్లు, ముసలి వాళ్లు ఉంటే వాళ్లని ఎక్కడికని తీసుకెళ్లాలి?’అని గాజా సిటీకి చెందిన ఉమ్‌ హైతమ్‌ ప్రశ్నించారు. తాజాగా, ఇజ్రాయెల్‌ ఆర్మీ ప్రకటించిన హ్యుమానిటేరియన్‌ జోన్‌ విషయంలో తమతో సంప్రదించలేదని ఐరాస ఆఫీస్‌ ఫర్‌ ది కోఆర్డినేషన్‌ ఆఫ్‌ హ్యుమానిటేరియన్‌ అఫైర్స్‌ ప్రతినిధి ఒల్గా చెరెవ్‌కో అన్నారు. 

గతంలో మువాసి సహా పలు ప్రాంతాలను మానవతా జోన్లుగా ప్రకటించిన తర్వాత కూడా ఇజ్రాయెల్‌ ఆర్మీ వాటిపై దాడులకు దిగిందని గాజా ఆరోగ్య విభాగం అంటోంది. ఇలా ఉండగా, శనివారం ఇజ్రాయెల్‌ ఆర్మీ నగరంలోని మరో రెండు బహుళ అంతస్తుల భవనాలకు హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం 12 అంతస్తుల భవనాన్ని నేలమట్టం చేయడం తెల్సిందే. హెచ్చరికలు జారీ చేసిన కొద్ది సేపటికే ఒక భవనాన్ని కూలి్చనట్లు మంత్రి ప్రకటించారు.

 ఆకాశ హర్మ్యాలను హమాస్‌ నిఘాకు వాడుకుంటోందన్నది ఆర్మీ ఆరోపణ. కాగా, హమాస్‌ తమ చెరలో ఉన్న ఇద్దరు ఇజ్రాయెల్‌ బందీల వీడియోలను తాజాగా విడుదల చేసింది. వీరిద్దరిని గై గిల్బోవా–దలాల్, అలొన్‌ ఒహెల్‌గా గుర్తించారు. వేలాదిగా ఆర్మీ సిబ్బందితో గాజాపై నియంత్రణకు ఇజ్రాయెల్‌ చేస్తున్న ప్రయత్నాలతో మిగతా బందీల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని వారి కుటుంబీకులు ఆవేదన చెందుతున్నారు. యుద్ధాన్ని ముగించి, బందీలను సురక్షితంగా విడిపించాలని వారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు విజ్ఞప్తి చేశారు. శనివారం వారు ట్రంప్‌ ప్రతినిధి స్టీవ్‌ విట్కాఫ్‌ను కలిశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement