వాషింగ్టన్: ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. ఇరాన్ ఇప్పటికే బలహీనమైపోయిందని, ఇంకెంత కాలం నిలబడుతుందో చూద్దామని అన్నారు. శుక్రవారం తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. “ఇరాన్ నేతలు 42,000 మందిని చంపారు. నేను ఓ విధంగా ఆ దేశాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాను. ఇది రఫ్ గ్రూప్, కానీ, మేము వారిని పూర్తిగా బలహీనపరిచాం. వారి ఆర్థిక వ్యవస్థ దుర్భర స్థితిలో ఉంది. కాబట్టి వారు ఎంతకాలం నిలబడతారో చూద్దాం.
సైనిక చర్య జరిగినప్పటికీ దాన్ని నేను యుద్ధం అని పిలవను. ఇరాన్ ఒప్పందం చేసుకోవడానికి అమితాసక్తి చూపుతోంది. వారికి నౌకాదళం లేదు, వైమానిక దళం లేదు, అన్ని రకాల సామగ్రి దాదాపు పూర్తిగా నశించింది. వారి డ్రోన్ ఫ్యాక్టరీలు సుమారు 82 శాతం తగ్గిపోయాయి. వారు ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నారు.. మేము వారి అణు సామర్థ్యాన్ని పూర్తిగా ధ్వంసం చేశాం. అందువల్ల వారికి అణు బాంబు దక్కలేదు.
నేను 8 యుద్ధాలను ఆపాను. దాదాపు ప్రతి సందర్భంలో వారు నాకు ధన్యవాదాలు తెలుపుతూ లేఖలు పంపారు. నోబెల్ కమిటీకి కూడా లేఖలు పంపారు. నేను 30 నుంచి 50 మిలియన్ మంది ప్రాణాలు కాపాడానని భారతదేశ విషయంలో.. పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా అన్నారు. అది ఇంకా ఎక్కువ కావచ్చు. రెండు అణ‍్వాయుధ దేశాలు పోరాడుతున్నాయి. 11 విమానాలు కూల్చివేశారు. నేను దాన్ని పరిష్కరించాను. టారిఫ్‌లు వాడాను.. వాళ్లు యుద్ధం కొనసాగిస్తే వారిపై టారిఫ్‌లు విధిస్తానని నేను చెప్పాను” అని తెలిపారు.
మరోవైపు, అమెరికా హార్మూజ్ నిర్బంధం వల్ల చమురు మార్కెట్‌లో సరఫరా సంక్షోభం తీవ్రత పెరుగుతోంది. తగ్గిన సరఫరాతో చమురు ధరలు పెరుగుతున్నాయి. హార్మూజ్ మూసివేతతో గ్లోబల్ మార్కెట్‌పై భారీ దెబ్బ పడింది. అమెరికా-ఇరాన్ మధ్య ఇప్పట్లో ఒప్పందం కుదిరే పరిస్థితులు కనపడట్లేదు.


