ప్రపంచంలోని ఏ పర్యాటక ప్రాంతమూ మీకు సురక్షితం కాదు
శత్రువులకు ఇరాన్ హెచ్చరిక
గల్ఫ్‌లోని చమురు క్షేత్రాలపై మరిన్ని దాడులు
కువైట్‌లోని రెండు రిఫైనరీల్లో భారీగా మంటలు
పేలుళ్లతో దద్దరిల్లిన దుబాయ్, బహ్రెయిన్
గల్ఫ్‌కు మరో మూడు అమెరికా యుద్ధ నౌకలు
భూతల దాడుల దిశగా సంకేతాలు
దుబాయ్: పశి్చమాసియా యుద్ధం చినికి చినికి గాలివానగా మారుతోంది. ఇజ్రాయెల్–అమెరికా రాజేసిన యుద్ధ జ్వాలలను ప్రపంచమంతటికీ విస్తరించేందుకు ఇరాన్ ప్రయతి్నస్తోంది. శుక్రవారం ఆ దిశగా స్పష్టమైన సంకేతాలిచి్చంది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలు, ప్రఖ్యాత విడిది కేంద్రాలన్నింటినీ ఇకపై దాడులకు లక్ష్యంగా చేసుకుంటామంటూ తీవ్ర హెచ్చరికలు జారీచేసింది.
‘‘పార్కులు, విడిది, పర్యాటక కేంద్రాల వంటివేవీ మా శత్రువులకు ఇకపై సురక్షితం కాదు. ప్రపంచవ్యాప్తంగా వాటన్నింటినీ లక్ష్యాలుగా చేసుకుంటాం’’ అని ఇరాన్ సైనిక ఉన్నతాధికారి అబుల్ ఫజల్ షెకార్చీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో దుబాయ్ తదితర గల్ఫ్ ప్రాంతాల్లోని ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రాలపై దాడులు తప్పవన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు రంజాన్ పర్వదినం సందర్భంగా కూడా ఇరాన్ నెమ్మదించలేదు.
గల్ఫ్ దేశాల్లోని చమురు క్షేత్రాలపై దాడుల తీవ్రతను మరింతగా పెంచింది. కువైట్‌లో రెండు రిఫైనరీలపై డ్రోన్ దాడులకు దిగింది. దాంతో రోజుకు ఏకంగా 7.3 లక్షల బ్యారెళ్ల చమురు శుద్ధి చేసే మినా అల్ అహ్మదీ రిఫైనరీలో పలు యూనిట్లు మంటల్లో చిక్కాయి. వాటిని ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. కువైట్‌లోని మైనా అబ్దుల్లా చమురు క్షేత్రం కూడా దాడులకు గురైంది. ఈ రెండు క్షేత్రాలపై గురువారం కూడా ఇరాన్ దాడులు చేయడం తెలిసిందే.
సౌదీ అరేబియా, బహ్రెయిన్, దుబాయ్‌ల్లో కూడా భారీ బాంబుల మోతలతో దద్దరిల్లిపోయాయి. ఈ నేపథ్యంలో తన గడ్డపై ఉన్న ఇరాన్ సంస్థలన్నింటినీ మూసేయాలని దుబాయ్ నిర్ణయించుకుంది. ఇజ్రాయెల్‌లో హైఫాలో ఉన్న అతి పెద్ద చమురు శుద్ధి కేంద్రంపై కూడా ఇరాన్ భారీగా దాడులు చేసింది. దాంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.
జెరూసలేం, టెల్ అవీవ్‌తో పాటు దేశవ్యాప్తంగా దాడులు కొనసాగాయి.బాలిస్టిక్ క్షిపణి తయారీ సామర్థ్యాన్ని కోల్పోయానన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటనను ఇరాన్ ఖండించింది. ఇప్పటికీ భారీ సంఖ్యలో క్షిపణులను తయారు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. గురువారం తన గగనతలంలో అమెరికాకు చెందిన ఎఫ్–35 యుద్ధ విమానంపై చేసిన దాడికి సంబంధించి వీడియో క్లిప్పింగ్‌ను కూడా విడుదల చేసింది. ఈ అత్యాధునిక స్టెల్త్ ఫైటర్ జెట్లు దాడికి గురికావడం వాటి చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం!
ఇరాన్‌పై బాంబుల వర్షం
పర్షియా నూతన సంవత్సరం ‘నౌరోజ్’ నాడు ఇరాన్‌పై ఇజ్రాయెల్ ముమ్మర దాడులు కొనసాగాయి. రాజధాని టెహ్రాన్‌తో పాటు పలు దేశవ్యాప్తంగా నగరాలు పేలుళ్లతో దద్దరిల్లిపోయాయి. టెహ్రాన్‌లోని బసీజ్ గ్రూప్ ప్రధాన కార్యాలయంపైనా బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్‌లోని సౌత్ పార్స్ సహజవాయు క్షేత్రంపై ఇక దాడులు చేయబోమని నెతన్యాహు ప్రకటించారు. గల్ఫ్‌కు మరో మూడు యుద్ధ నౌకలను తరలించాలని అమెరికా నిర్ణయించింది.
సిరియాపైనా దాడులు
ఇజ్రాయెల్ తన దాడులను లెబనాన్‌తో పాటు సిరియాకూ విస్తరించింది. స్వెయ్‌డాతో పాటు దేశవ్యాప్తంగా పేలుళ్లు జరిగినట్టు సిరియా ప్రభుత్వ వార్తా సంస్థ వెల్లడించింది. అక్కడి డ్రౌజ్ మైనారిటీలను కాపాడేందుకే ఈ చర్యకు దిగినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది.
వారి భ్రమలు వీడాయి: మొజ్తబా
ఇరాన్ నాయకత్వాన్ని, అగ్ర నేతలను చంపినంత మాత్రాన ప్రభుత్వం తలకిందులైపోతుందని ఇజ్రాయెల్, అమెరికా భ్రమించాయని సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ ఎద్దేవా చేశారు. వాటిప్పుడు భ్రమలు వీడాయన్నారు. శత్రువుల రక్షణ కవచాలను ఛేదించాలని ఇరాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. యుద్ధం మొదలై మూడు వారాలైనా వాళ్లు గొప్ప ధైర్యస్థైర్యాలు చూపుతున్నారంటూ కొనియాడారు. పర్షియన్ నూతన సంవత్సరం ‘నౌరోజ్’ సందర్భంగా మొజ్తబాను ఉటంకిస్తూ ఇరాన్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆయన బతికే ఉన్నారంటూ ఒక వీడియోను కూడా విడుదల చేసింది. అందులో ఆయన పలువురికి మత బోధలు చేస్తూ కని్పస్తున్నారు. అది ఎప్పటి వీడియో అన్నదానిపై మాత్రం స్పష్టత లేదు. యుద్ధం మొదలైనప్పటి నుంచీ మొజ్తబా ఇప్పటిదాకా బహిరంగంగా కని్పంచకపోవడం తెలిసిందే. తండ్రి అయతొల్లా ఖమేనీ తదితరులను పొట్టన పెట్టుకున్న ఇజ్రాయెల్ దాడిలో ఆయన కూడా తీవ్రంగా గాయపడ్డట్టు వార్తలొస్తూనే ఉన్నాయి.
నాటో దేశాలు పిరికిపందలు: ట్రంప్
వాషింగ్టన్: నాటో దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వాటిని పిరికిపందలుగా అభివరి్ణంచారు. అమెరికా లేకుంటే నాటో కూటమి కేవలం కాగితం పులిగా మిగిలిపోతుందని ఎద్దేవా చేశారు. ‘‘చమురు ధరలు పెరుగుతున్నాయంటూ నాటో దేశాలు ఫిర్యాదు చేస్తున్నాయి. హార్మూజ్ జలసంధిని తెరిపిస్తే పరిష్కారమయ్యే చిన్న సమస్య అది. పైగా వాటికి పెద్దగా రిస్కు కూడా లేని వ్యవహారం. కానీ అందుకు ముందుకు రమ్మంటే మాత్రం ముఖం చాటేస్తున్నాయి. నాటో దేశాల ఈ పిరికిపంద చర్యను గుర్తు పెట్టుకుంటాం’’ అంటూ హెచ్చరించారు.
ఐఆర్‌జీసీ అధికార ప్రతినిధి మృతి
ఇరాన్ సైన్యం అధికార ప్రతినిధి అలీ మొహమ్మద్ నైనీ శుక్రవారం ఇజ్రాయెల్ దాడుల్లో మరణించారు. ఇజ్రాయెల్‌కు సర్‌ప్రైజ్ ఇస్తామంటూ ప్రకటనలు చేసిన గంటల వ్యవధిలోనే దాడులకు బలయ్యారు. అంతకు కొద్దిసేపటి ముందే ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటనను కూడా నైనీ ఎద్దేవా చేశారు. ఇరాన్ యురేనియం శుద్ధి, బాలిస్టిక్ క్షిపణి ఉత్పత్తి కార్యకలాపాలను ఇకపై ఎంతమాత్రమూ కొనసాగించజాలదన్న నెతన్యాహు వ్యాఖ్యలను దుయ్యబట్టారు.
హార్మూజ్ వద్ద ఇరాన్ నౌకలపై బాంబులు
హార్మూజ్‌ను తెరిపించే ప్రయత్నాలకు అమెరికా ఎట్టకేలకు శ్రీకారం చుట్టింది. దాని సమీపంలోని పలు ఇరాన్ నావికా దళ లక్ష్యాలను శుక్రవారం ధ్వంసం చేసినట్టు అమెరికా సైన్యం ప్రకటించింది. దాడులకు సంబంధించిన వీడియో క్లిప్పింగులను విడుదల చేసింది. ఇరాన్ నావికా, సైనికోత్పత్తి సదుపాయాలతో పాటు మిసైల్ లాంచర్ వ్యవస్థలను కూడా పూర్తిగా ధ్వంసం చేయడంపైనే దృష్టి పెట్టినట్టు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వెల్లడించారు.
హార్మూజ్ సుంకం!
రూ.18 కోట్లు చెల్లించిన ఓ నౌక ముందుగా ప్రకటించినట్టుగానే హార్మూజ్ జలసంధిని దాటేందుకు నౌకల నుంచి ఇరాన్ సుంకం వసూళ్లు ప్రారంభించింది. ఇందుకోసం ఒక చమురు నౌక రూ.18 కోట్ల పై చిలుకు మొత్తం చెల్లించినట్టు లాయిడ్స్ లిస్ట్ శుక్రవారం వెల్లడించింది. అంతేగాక హార్మూజ్ గుండా తాను అనుమతించిన నౌకల రవాణాకు పకడ్బందీగా నమోదు వ్యవస్థను కూడా రివల్యూషనరీ గార్డ్ ప్రకటించింది.


