ట్రంప్‌వి బిల్డప్‌ బాబాయ్‌ మాటలే..! | Iran War News: Tehran Reacts On Trump Latest Deal Comments | Sakshi
Sakshi News home page

ట్రంప్‌వి బిల్డప్‌ బాబాయ్‌ మాటలే..!

May 30 2026 7:07 AM | Updated on May 30 2026 7:11 AM

Iran War News: Tehran Reacts On Trump Latest Deal Comments

‘అన్నీ సెట్‌ అయిపోయాయి.. నౌకలు ఇంటికి వెళ్లొచ్చు’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇరాన్‌తో ఒప్పందం దాదాపు ఖరారైందన్న సంకేతాలతో అంతర్జాతీయ వర్గాలు ఊరట చెందాయి. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ట్రంప్‌ ప్రకటనపై ఇరాన్‌ వెంటనే కౌంటర్‌ ఇచ్చింది. ఆయన చెప్పిన కీలక అంశాల్లో చాలా వరకు ముసాయిదా ఒప్పందంలోనే లేవని స్పష్టం చేసింది. దీంతో ప్రపంచాన్ని ఊరించిన ట్రంప్‌ ప్రకటన అంతా బిల్డప్పేనా? అనే చర్చ జోరుందుకుంది. 

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌ ఎప్పటికీ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదని స్పష్టం చేసిన ఆయన, ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్‌ జలసంధిని ఎలాంటి సుంకాలు లేకుండా తిరిగి తెరవాలని పేర్కొన్నారు. జలసంధిలో ఏర్పాటు చేసిన సముద్ర మైన్లను వెంటనే నిర్వీర్యం చేయాలని, అక్కడ నిలిచిపోయిన నౌకలు మళ్లీ ప్రయాణాలు ప్రారంభించవచ్చని తెలిపారు.

"హర్ముజ్‌లో చిక్కుకుపోయిన నౌకలు ఇప్పుడు ఇంటివైపు ప్రయాణం ప్రారంభించవచ్చు. మీ భార్యలకు, భర్తలకు, కుటుంబ సభ్యులకు నా తరఫున హలో చెప్పండి" అంటూ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే అమెరికా అమలు చేసిన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేస్తున్నామని కూడా ఆయన ప్రకటించారు. అంతేకాదు.. 

ఇరాన్‌ వద్ద ఉన్న సుసంపన్న యురేనియం నిల్వలను అమెరికా, ఇరాన్‌, అంతర్జాతీయ అణుశక్తి పర్యవేక్షణ సంస్థ సమన్వయంతో వెలికితీసి పూర్తిగా ధ్వంసం చేస్తామని ట్రంప్‌ పేర్కొన్నారు. యుద్ధ పరిహారం, పెట్టుబడులు లేదంటే ఇతర రూపాల్లో ఇప్పట్లో ఎలాంటి నిధుల మార్పిడి ఉండదని, తదుపరి ప్రకటన వచ్చే వరకు డబ్బు చెల్లింపులు నిలిపివేస్తామని స్పష్టం చేశారు. అయితే తక్కువ ప్రాముఖ్యత కలిగిన కొన్ని అంశాలపై మాత్రమే ఇప్పటివరకు అంగీకారం కుదిరిందని కూడా వెల్లడించారు.

అయితే ట్రంప్‌ వ్యాఖ్యలను ఇరాన్‌ తీవ్రంగా ఖండించింది. ఇరాన్‌కు చెందిన ఫార్స్‌ వార్తా సంస్థ కథనం ప్రకారం, ట్రంప్‌ చెప్పిన అంశాలు వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించడం లేదని పేర్కొంది. హర్ముజ్‌ జలసంధిని తెరవడం జరిగితే అది పూర్తిగా ఇరాన్‌ నిబంధనల ప్రకారమే ఉంటుందని స్పష్టం చేసింది. నౌకల తనిఖీలు, భద్రతా చర్యలు, సముద్ర సేవలు కొనసాగుతాయని, ఎలాంటి షరతులు లేకుండా జలసంధిని తెరవడానికి తాము అంగీకరించలేదని వెల్లడించింది.

అలాగే ఇరాన్‌ అణు పదార్థాలను ధ్వంసం చేయడం, అణు కార్యక్రమాన్ని పూర్తిగా విరమించుకోవడం వంటి నిబంధనలు చర్చల్లో ఉన్న ముసాయిదా ఒప్పందంలో అసలు లేవని పేర్కొంది. ట్రంప్‌ చేసిన ఆ ప్రకటనలకు ఎలాంటి ఆధారమూ లేదని స్పష్టం చేసింది.

ఇరాన్‌ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం చర్చల్లో అత్యంత కీలక అంశం విదేశాల్లో స్తంభింపజేసిన 12 బిలియన్‌ డాలర్ల ఇరానీ నిధుల విడుదల. ఆ నిధులు విడుదలైన తర్వాతే తదుపరి దశ చర్చలకు వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే లెబనాన్‌లో పూర్తి కాల్పుల విరమణ కూడా చర్చల్లో ప్రధాన అంశంగా ఉన్నట్లు తెలుస్తోంది.

దీంతో అమెరికా–ఇరాన్‌ మధ్య ఒప్పందం నిజంగా ఎంత దూరం వెళ్లిందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకవైపు ఒప్పందం దాదాపు పూర్తైందని ట్రంప్‌ చెబుతుండగా, మరోవైపు అలాంటి అంగీకారాలు ఏవీ జరగలేదని ఇరాన్‌ వాదిస్తోంది. ఈ పరస్పర విరుద్ధ ప్రకటనల మధ్య అసలు నిజం ఏమిటన్నది తేలాలంటే తుది ఒప్పందం వెలుగులోకి రావాల్సిందే. ప్రస్తుతం మాత్రం ప్రపంచ దృష్టి మొత్తం వాషింగ్టన్‌, టెహ్రాన్‌ల మధ్య జరుగుతున్న ఈ దౌత్య పోరుపైనే కేంద్రీకృతమైంది.

Advertisement
 
Advertisement
Advertisement