ట్రంప్‌ ఏం చెబుతాడో?.. ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ | Iran-US deal reaches climax: World in suspense over Trump approval | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ ఏం చెబుతాడో?.. ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ

May 29 2026 7:11 AM | Updated on May 29 2026 8:47 AM

Iran-US deal reaches climax: World in suspense over Trump approval

మూడు నెలలుగా పశ్చిమాసియాను అగ్నికుండంలా మార్చిన అమెరికా–ఇరాన్‌ ఉద్రిక్తతలకు ముగింపు దగ్గరపడిందా? ప్రపంచాన్ని వణికించిన యుద్ధ మేఘాల మధ్య ఇప్పుడో ఆశాకిరణం కనిపిస్తోంది. అమెరికా–ఇరాన్‌ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందానికి సంబంధించిన ప్రాథమిక అవగాహన కుదిరిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఈ ఒప్పందానికి అసలైన గ్రీన్‌సిగ్నల్‌ ఇంకా రావాల్సి ఉండటంతో ప్రపంచ దృష్టి ఇప్పుడు వైట్‌హౌస్‌పైనే నిలిచింది.

అమెరికా, ఇరాన్‌ ప్రతినిధులు 60 రోజుల తాత్కాలిక అవగాహన ఒప్పందం (MoU)పై ప్రధాన అంశాల్లో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే కాల్పుల విరమణ కొనసాగడమే కాకుండా ఇరాన్‌ అణు కార్యక్రమంపై మళ్లీ చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇరాన్‌ అణ్వాయుధాల దిశగా వెళ్లబోదని హామీ ఇవ్వాల్సి ఉంటుందని తెలుస్తోంది.

ఈ చర్చల్లో అత్యంత కీలక అంశంగా హర్ముజ్‌ జలసంధి మారింది. ప్రపంచ చమురు రవాణాలో కీలక మార్గమైన ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా అనుమతించాలనే ప్రతిపాదనపై చర్చలు జరిగినట్లు సమాచారం. ఇందుకోసం ఇరాన్‌ సీమైన్లను (సముద్రంలో అమర్చిన బాంబులను) తొలగించడం, వాణిజ్య నౌకలపై జోక్యం చేసుకోకపోవడం వంటి షరతులు ఉండొచ్చని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. దానికి ప్రతిగా అమెరికా తన నౌకాదళ నిర్బంధాన్ని దశలవారీగా సడలించే అవకాశముందని తెలుస్తోంది. అయితే ఈ ఒప్పందానికి తుది ఆమోదం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నుంచే రావాల్సి ఉండటంతో, ఆయన వైఖరి ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ ప్రపంచవ్యాప్తంగా నెలకొంది.

మరోవైపు.. పశ్చిమాసియాలో పరిస్థితి ఇంకా పూర్తిగా చల్లబడలేదు. కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ ఇరు దేశాల మధ్య సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్‌ దాడి చేయగా.. బందర్‌ అబ్బాస్‌ సమీపంలో ఇరాన్‌ డ్రోన్‌ కేంద్రాలపై అమెరికా ప్రతిదాడులు జరిపింది. అమెరికా దళాలు ఐదు డ్రోన్లను కూల్చివేశామని ప్రకటించగా.. ఇరాన్‌ మాత్రం తమపై దాడులు పునరావృతమైతే మరింత తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించింది.

ఇదే సమయంలో హర్ముజ్‌ జలసంధి నిర్వహణలో ఒమన్‌, ఇరాన్‌ కలిసి పనిచేస్తున్నాయన్న వార్తలను ట్రంప్‌ తీవ్రంగా ఖండించారు. “అది అంతర్జాతీయ జలమార్గం.. ఎవరూ దానిపై ఆధిపత్యం చెలాయించలేరు” అంటూ ఘాటుగా స్పందించారు. ట్రంప్‌ వ్యాఖ్యలు ఇటు టెహ్రాన్‌లో ఆగ్రహానికి దారితీశాయి.

మరోవైపు ఇజ్రాయెల్‌–హెజ్బొల్లా ఘర్షణలు కూడా ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. లెబనాన్‌, బీరూట్‌లో హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు కొనసాగుతుండగా.. ఉత్తర ఇజ్రాయెల్‌లో సైరన్లు మోగుతున్నాయి. ఈ పరిణామాల మధ్య అమెరికా–ఇరాన్‌ ఒప్పందం ప్రపంచ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ తుది నిర్ణయం మాత్రం ఇప్పుడు ఒక్క ట్రంప్‌ చేతుల్లోనే ఉండటం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement